అందని అత్యవసర వైద్యం..
ABN , Publish Date - Jun 23 , 2026 | 01:52 AM
ప్రభుత్వ వైద్య కళాశాలకు టీచింగ్ హాస్పిటల్... ఉమ్మడి జిల్లాకే కాకుండా కుమరం భీం, మంచిర్యాల జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ విభాగం నిరుపయోగంగా మారింది.
- అందుబాటులోకి రాని క్రిటికల్ కేర్ విభాగం
- భవనం ప్రారంభించారు... సౌకర్యాలు మరిచారు
- జాడలేని సూపర్‌స్పెషలిస్టుల నియామకం
- అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు రెఫర్
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ప్రభుత్వ వైద్య కళాశాలకు టీచింగ్ హాస్పిటల్... ఉమ్మడి జిల్లాకే కాకుండా కుమరం భీం, మంచిర్యాల జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ విభాగం నిరుపయోగంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో క్లిష్టమైన శస్త్రచికిత్సలు, ఇతర వైద్యసేవలు అందించడానికి ఏర్పాటు చేసిన ఈ విభాగంలో అవసరమైన పరికరాలు లేవు. సేవలు అందించే సూపర్‌స్పెషలిస్టు డాక్టర్లు లేరు. దీంతో క్రిటికల్ కేర్ విభాగం నామమాత్రంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో చికిత్స కోసం వచ్చిన వారిని ప్రైవేట్ ఆసుపత్రులకు, హైదరాబాద్, వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిస్తున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలకు టీచింగ్ హాస్పిటల్‌గా ఉన్న ఈ ఆసుపత్రిలో అన్ని రకాల సేవలు అందిస్తూ విద్యార్థులకు ఆయా చికిత్స విధానాల్లో అధ్యయనం చేసేందుకు అనువుగా ఉండాల్సిన అవసరముంది. కాని ఆసుపత్రిలో సౌకర్యాలు పట్టించుకునే వారే లేకుండా పోతున్నారు.
50 మంది సూపర్ స్పెషలిస్టు డాక్టర్ల అవసర
కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితోపాటు రాష్ట్రంలోని మరో ఏడు ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ విభాగాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించి నిధులు విడుదల చేసింది. 23.75 కోట్ల రూపాయలు వెచ్చించి క్రిటికల్ కేర్ విభాగాన్ని నిర్వహించేందుకు భవనాన్ని నిర్మించారు. ఈ విభాగంలో గుండె చికిత్సలు అందించడానికి కేథ్‌లాబ్, యూరాలజీ, న్యూరో, ఆర్థో, జనరల్ వైద్య సేవల కోసం 50 మంది సూపర్ స్పెషలిస్టు డాక్టర్లను నియమించాల్సి ఉన్నది. వారితోపాటు ఆయా విభాగాల్లో అవసరమైన పరికరాలు, యంత్రాలను నిర్వహించడానికి అర్హత గల టెక్నీషియన్లను నియమించాల్సి ఉన్నది. క్రిటికల్ కేర్ విభాగాన్ని ప్రారంభించి ఏడాది గడిచినా ఇప్పటి వరకు సూపర్‌స్పెషలిస్టు డాక్టర్లను, టెక్నీషియన్లను నియమించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు విడుదల చేసి క్రిటికల్ కేర్ విభాగానికి అన్ని సౌకర్యాలను సమకూర్చాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉన్న వైద్యులే యూరో, ఆర్థో విభాగాల పేషెంట్లకు వైద్య సేవలందిస్తున్నారు.
రోజుకు 10 ట్రామా కేసులు
ఆసుపత్రికి ట్రామా కేసులు సగటున రోజుకు 10 కేసులు వస్తుంటాయి. న్యూరో విభాగానికి చెందిన రోగులు వైద్య సేవల కోసం సుమారు నెలకు 100 మంది, ఆర్థో సేవల కోసం అత్యవసర పరిస్థితుల్లో 70 నుంచి 100 కేసులు వస్తుంటాయి. సూపర్ స్పెషలిస్టులు లేక పోవడం, అవసరమైన పరికరాలు, యంత్రాలు లేక పోవడంతో ఎంజీఎం వరంగల్, హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారు. స్థానిక రోటరీ క్లబ్ వారు గుండె చికిత్సలకు అవసరమైన సీఆర్మ్ పరికరంతోపాటు ఒక అంబులెన్సును, మరికొన్ని అత్యవసర సేవలకు అవసరమైన పరికరాలను అందించారు. ఆపరేషన్ థియేటర్లకు అవసరమైన టేబుళ్ళు, వెంటిలేటర్లు, మానిటర్లు, పడకలు, లాబ్ సౌకర్యాలు లేవు. సూపర్‌స్పెషాలిటీ విభాగాల మాట అటుంచి జనరల్ సర్జరీకి అవసరమైన సౌకర్యాలు, పరికరాలు కూడా లేకుండా పోవడంతో క్రిటికల్ కేర్ విభాగం నిరుపయోగంగా మారుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి క్రిటికల్ కేర్ విభాగంలో సౌకర్యాలు కల్పించడంతోపాటు సూపర్‌స్పెషలిస్టులు, నర్సింగ్ సిబ్బంది, టెక్నీషియన్లను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.