ఆపదలో.. అమ్మ!
ABN , Publish Date - Sep 05 , 2026 | 01:21 AM
అమ్మగా మారడం ప్రతి మహిళ జీవితంలో అత్యంత మధురమైన అనుభూతి. తన కడుపులో మరో ప్రాణాన్ని మోస్తూ తొమ్మిది నెలలు ఎన్నో ఆశలు, ఆందోళనల మధ్య గడుపుతుంది. బిడ్డ పుట్టిన తర్వాత ఆ చిన్నారి ఏడుపు వినాలన్న ఆశతో ఎన్నో కష్టాలను భరిస్తుంది. కానీ కొందరు మహిళలకు ఆ మాతృత్వ ప్రయాణమే ప్రమాదకరంగా మారుతోంది.
- జిల్లాలో పెరుగుతున్న హైరిస్క్ గర్భిణుల కేసులు
- జనవరి నుంచి ఆగస్టు వరకు 5,884మంది గుర్తింపు
- గత ప్రసవ సమస్యలు, సిజేరియన్లు, ఊబకాయం ప్రధాన కారణాలు
- నిర్లక్ష్యం చేస్తే తల్లీబిడ్డల ప్రాణాలకే ముప్పు
- ప్రత్యేక పర్యవేక్షణ అవసరమంటున్న వైద్యులు
జగిత్యాల, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): అమ్మగా మారడం ప్రతి మహిళ జీవితంలో అత్యంత మధురమైన అనుభూతి. తన కడుపులో మరో ప్రాణాన్ని మోస్తూ తొమ్మిది నెలలు ఎన్నో ఆశలు, ఆందోళనల మధ్య గడుపుతుంది. బిడ్డ పుట్టిన తర్వాత ఆ చిన్నారి ఏడుపు వినాలన్న ఆశతో ఎన్నో కష్టాలను భరిస్తుంది. కానీ కొందరు మహిళలకు ఆ మాతృత్వ ప్రయాణమే ప్రమాదకరంగా మారుతోంది. గర్భాధారణ సమయంలో తలెత్తుతున్న వివిధ ఆరోగ్య సమస్యలు తల్లీబిడ్డల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. జగిత్యాల జిల్లాలో హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. 2026జనవరి నుంచి ఆగస్టువరకు జిల్లాలో ఏకంగా 5,884మంది హైరిస్క్ గర్భిణులను గుర్తించారు. గర్భిణుల్లో గణనీయమైన సంఖ్యలో మహిళలు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సరైన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం, పోషకాహార లోపం, అధిక బరువు, గతంలో జరిగిన సిజేరియన్ ప్రసవాలు తదితర కారణాలు ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయి.
గత సిజేరియన్లే అధికం..
జిల్లాలో గుర్తించిన హైరిస్క్ గర్భిణుల్లో అత్యధికంగా గతంలో సిజేరియన్ ప్రసవం జరిగిన మహిళలు 1,643మంది ఉన్నారు. ఒకసారి సిజేరియన్ అయిన మహిళలు తదుపరి గర్భధారణ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. గర్భాశయంపై గతంలో జరిగిన శస్త్రచికిత్స ప్రభావం, ప్రసవ సమయంలో వచ్చే సమస్యలు తదితర అంశాలను వైద్యులు నిరంతరం పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే గతంలో సిజేరియన్‌తో పాటు బరువు తక్కువగా ఉన్న 358 మంది గర్భిణులు కూడా హైరిస్క్ జాబితాలో ఉన్నారు. అధిక బరువుతో బాధపడుతున్న వారు 676మంది ఉండగా, ఊబకాయంతో పాటు గతంలో సిజేరియన్ అయిన వారు 418మంది ఉన్నారు. మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ తగ్గడం, ఆహారపు అలవాట్లలో మార్పులు కూడా గర్భిణుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
పోషకాహార లోపం.. మరో ప్రమాద ఘంటిక..
చాలామంది గర్భిణులు సరైన పోషకాహారం తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో 815మంది గర్భిణులు తక్కువ బరువుతో ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి కేసుల్లో బిడ్డ తక్కువ బరువుతో జన్మించడం, నెలలు నిండకముందే ప్రసవం కావడం వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
చిన్న వయసులో గర్భం..ఆలస్య వయసులోనూ ముప్పే
జిల్లాలో 18ఏళ్లలోపు, 35ఏళ్లు దాటిన వయసులో గర్భం దాల్చిన 159మంది మహిళలను హైరిస్క్ కేటగిరీలో గుర్తించారు. చిన్నవయసులో శారీరక ఎదుగుదల పూర్తికాకముందే గర్భం దాల్చడం తల్లీబిడ్డలకు సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా అధిక వయసులో గర్భధారణ జరిగినా ప్రత్యేక వైద్య పర్యవేక్షణ అవసరమవుతుంది.
గత ప్రసవాల చరిత్ర కూడా కీలకమే..
గతంలో జరిగిన ప్రసవాల్లో సమస్యలు ఎదుర్కొన్న మహిళలను కూడా వైద్యులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. బ్యాడ్ అబ్‌స్టెట్రిక్ హిస్టరీ(బీఓహెచ్) ఉన్న 107మంది గర్భిణులు గుర్తించ బడ్డారు. అలాగే రెండు కంటే ఎక్కువ ప్రసవాలు జరిగిన 94మంది మల్టీపారిటీ గర్భిణులు కూడా హైరిస్క్‌జాబితాలో ఉన్నారు. కాగా జిల్లాలో ఆర్‌హెచ్ నెగెటివ్ రక్తగ్రూప్ కలిగిన 115 మంది గర్భిణులను కూడా ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. తల్లి, శిశువు రక్తగ్రూపులకు సంబంధించిన అసమ్మతి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో వీరికి క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించడం అవసరమని వైద్యులు చెబుతున్నారు.
క్రమం తప్పకుండా పర్యవేక్షణ అవసరం
గర్భం దాల్చిన రోజు నుంచి ప్రసవం అయ్యే వరకు ప్రతిరోజు తల్లికి, బిడ్డకు కీలకమే. క్రమం తప్పకుండా రక్తపరీక్షలు, బీపీ, బరువు, రక్తహీనత పరీక్షలు చేయించుకోవడంతో పాటు వైద్యులు సూచించిన మందులు, ఐరన్, కాల్షియం మాత్రలను తప్పనిసరిగా తీసుకోవాలి.
నిర్లక్ష్యం చేస్తే రెండు ప్రాణాలకు ముప్పు..
హైరిస్క్ గర్భిణుల విషయంలో నిర్లక్ష్యం అత్యంత ప్రమాదకరం. రక్తపోటు పెరగడం, రక్తహీనత, గర్భంలో శిశువు ఎదుగుదల తగ్గడం, నెలలు నిండకముందే ప్రసవం కావడం, తక్కువ బరువుతో శిశువు జన్మించడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. తీవ్ర పరిస్థితుల్లో ప్రసవ సమయంలో రక్తస్రావం, ఇతర అత్యవసర సమస్యలు తలెత్తి తల్లీబిడ్డల ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చు. అందుకే హైరిస్క్‌గా గుర్తించిన గర్భిణులను చివరి నెలల్లో మరింత జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.
పోషకాలతో కూడిన ఆహారం కావాలి..
గర్భిణులు కేవలం కడుపు నింపుకునే ఆహారం తీసుకోవడం కాకుండా పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆకుకూరలు, పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు, పండ్లు వంటి పోషకాహారాన్ని అందుబాటులో ఉన్న మేరకు తీసుకోవాలి. సమయానికి భోజనం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, వైద్యులు సూచించిన పరీక్షలకు హాజరుకావడం ద్వారా అనేక ప్రమాదాలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది.
వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి
- డాక్టర్ జైపాల్ రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో, జగిత్యాల
గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం అయ్యే వరకు ప్రతి గర్భిణీ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా హైరిస్క్‌గా గుర్తించిన మహిళలు వైద్యుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి. సరైన పోషకాహారం తీసుకోవడంతో పాటు బీపీ, రక్తహీనత, బరువు తదితర అంశాలను నిరంతరం పరిశీలించాలి. చిన్న సమస్య కనిపించినా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. నిర్లక్ష్యం చేస్తే తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యంపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.
హైరిస్క్ గర్భిణుల వివరాలు..
మొత్తం హైరిస్క్ కేసులు (జనవరి నుంచి ఆగస్టు 2026 వరకు) - 5,884 మంది
18ఏళ్ల లోపు, 35ఏళ్లపై బడినవారు - 159 మంది
గత ప్రసవాల్లో సమస్యల చరిత్ర (బీవోహెచ్) - 107మంది
రెండు కంటే ఎక్కువ ప్రసవాలు - 94మంది
ఊబకాయం - 676మంది
ఊబకాయం, గతంలో సిజేరియన్ - 418మంది
గతంలో సిజేరియన్ - 1,643మంది
గత సిజేరియన్, తక్కువ బరువు - 358మంది
ఆర్‌హెచ్ నెగెటివ్ - 115మంది
తక్కువ బరువు - 815మంది