Share News

హస్తవ్యస్తం

ABN , Publish Date - Aug 24 , 2026 | 01:12 AM

ఉత్తర తెలంగాణ రాజకీయాలకు కీలక కేంద్రమైన కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ లేమితో ఇబ్బంది పడుతోంది.

హస్తవ్యస్తం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఉత్తర తెలంగాణ రాజకీయాలకు కీలక కేంద్రమైన కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ లేమితో ఇబ్బంది పడుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో పలు కీలక మలుపుల సందర్భాల్లో కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగానే రాజకీయాలు నడిచాయి. అలాంటి ప్రాధాన్యమున్న కరీంనగర్‌పై కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమనెవరూ పట్టించుకునే వారే లేరని ద్వితీయ శ్రేణి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫ వరుసగా ఎదురు దెబ్బలు

ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ వరుసగా నాలుగుసార్లు విజయం సాధించారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి బండి సంజయ్‌కుమార్‌ వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను బీజేపీ దక్కించుకున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోనే ఉన్నా జిల్లా రాజకీయాలకు దిశా నిర్దేశం చేసే కరీంనగర్‌ నియోజకవర్గంలో మాత్రం ఆ పార్టీకి ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్‌ లేరు.

ఫ పట్టించుకోని మంత్రులు

కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌ నేతృత్వంలో బీజేపీ, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ నేతృత్వంలో బీఆర్‌ఎస్‌ తమ రాజకీయాలను ముమ్మరం చేస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కి దిశా నిర్దేంశం చేసే వారే లేదని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మంత్రులుగా ఉన్నారు. వీరిలో పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌ జిల్లాకేంద్రానికి చెందిన వారే కావడంతోపాటు ఆయన అసెంబ్లీ నియోజకవర్గంలో జిల్లాకు చెందిన చిగురుమామిడి, సైదాపూర్‌ మండలాలు ఉన్నాయి. దీంతో ఆయన అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కరీంనగర్‌ రాజకీయాలపై దృష్టిసారించారు. మంత్రి శ్రీధర్‌బాబుకు కూడా జిల్లాలో విస్తృతమైన సంబంధాలున్నాయి. ఆయన కూడా తొలినాళ్లలో జిల్లా రాజకీయాలపై కొంత దృష్టిపెట్టారు. దీంతో మిత్రులుగా ఉన్న పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. ఒకరి ప్రతిపాదనలను మరొకరు వ్యతిరేకించే స్థాయికి ఇవి చేరుకున్నాయి. శ్రీధర్‌బాబు ప్రతిపాదించిన కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి సుడా చైర్మన్‌గా నియమితులు కావడం, తనకు తెలియకుండానే లైబ్రరీ చైర్మన్‌గా ముఖ్యమంత్రి తన సన్నిహితుడు సత్తు మల్లేశంను నియమించడం పొన్నం ప్రభాకర్‌కు మింగుడుపడలేదు. విభేదాలు ముదరడంతో శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మదణ్‌కుమార్‌ జిల్లా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పొన్నం ప్రభాకర్‌ తన నియోజకవర్గమైన హుస్నాబాద్‌కు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఫ నేతలతో పెరిగిన దూరం..

కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి గత ఎన్నికల్లో పోటీచేసిన వెలిచాల రాజేందర్‌రావు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉండడం ఆనవాయితీ. పొన్నం ప్రభాకర్‌ తానే నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగడం రాజేందర్‌రావుకు ఆయనకు మధ్య దూరం పెంచింది. రాజేందర్‌రావు, పొన్నం ప్రభాకర్‌ అండదండలతోనే పార్లమెంట్‌ నియోజకవర్గంలో పోటీచేసినా ఆ తర్వాత కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. రాజేందర్‌రావు స్వతంత్రంగా వ్యవహరిస్తూ కొన్ని ప్రతిపాదనలు చేయగా తనకు సంబంధం లేకుండానే, తనతో సంప్రదించకుండానే నియోజకవర్గంలో పదవుల నియామకాలకు, ఇందిరమ్మ ఇళ్లకు జాబితాలు పంపించారని పొన్నం ప్రభాకర్‌ ఆగ్రహించారు. ఈ నేపథ్యంలోనే రాజేందర్‌రావు నేరుగా మంత్రి ప్రభాకర్‌పై విమర్శలు చేయడంతో ఇద్దరి మధ్య సంబంధాలకు తెరపడింది. దీంతో రాజేందర్‌రావు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నా ఆయన ఆ బాధ్యతలను పూర్తిగా నిర్వహించే అవకాశాలు తగ్గిపోయాయి. మొదట అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి పురమల్ల శ్రీనివాస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఆయన కూడా తన ప్రతిపాదనలను నేరుగా సమర్పించడంతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం శ్రీనివాస్‌ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు గుప్పించారు. దీంతో ఆయనను పార్టీ సుంచి సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత తిరిగి పార్టీలో చేర్చుకున్నా ఏ హోదా లేకుండా కొనసాగుతున్నారు.

ఫ జోరుగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ కార్యక్రమాలు

మంత్రులు ఇక్కడి రాజకీయాలను పట్టించుకోకపోవడం, ఇతర నాయకులు దూరంగా ఉండడంతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ తమ రాజకీయాలను ముమ్మరం చేస్తున్నాయి. గత మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకున్న బీజేపీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను దక్కించుకున్నది. నియోజకవర్గంలో 70 శాతం ఓటర్లు ఉన్న కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో బీజేపీ కార్పొరేటర్లు, మేయర్‌, డిప్యూటీ మేయర్లు చురుకుగా రాజకీయాలు కొనసాగిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ తన స్థానాన్ని పదిలపరుచుకుంటూనే మరింత మెరుగు పరుచుకోవడానికి కృషిచేస్తున్నది. కాంగ్రెస్‌కు చెందిన కార్పొరేటర్లు బీఆర్‌ఎస్‌ కంటే ఎక్కువగానే ఉన్నా దిశా నిర్దేశం చేసేవారు లేక ఇబ్బంది పడుతున్నారు.

ఫ చేస్తున్న పనులను చెప్పుకోలేక..

ఇటీవల కరీంనగర్‌ కార్పొరేషన్‌కు అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ కింద 840 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఇందులో 210 కోట్ల రూపాయలు కేంద్రం, మరో 210 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుండగా 420 కోట్లు హడ్కో నుంచి రుణంగా సమకూర్చుతున్నారు. రుణాన్నికూడా రాష్ట్ర ప్రభుత్వమే తీర్చాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం 630 కోట్లు ఈ పథకం కింద వెచ్చిస్తున్నా ఇక్కడ మాత్రం కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. బీజేపీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్లు మాత్రం ప్రతి చోట కేంద్ర నిధులతోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని ధీమా చెబుతున్నారు. ఇప్పటికైనా అధిష్ఠానం కరీంనగర్‌ రాజకీయాలపై దృష్టిసారించి పరిస్థితిని చక్కదిద్దాలని పార్టీ నేతలు కోరుతున్నారు.

Updated Date - Aug 24 , 2026 | 01:12 AM