ఆరోపణలు రుజువు చేయకపోతే రాజీనామా చేయాలి
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:18 AM
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారని, ఆ ఆరోపణలు రుజువు చేయకపోతే రాజీనామా చేయాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
కరీంనగర్ అర్బన్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారని, ఆ ఆరోపణలు రుజువు చేయకపోతే రాజీనామా చేయాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఉదయం ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి మానేరుడ్యాంకు వెళ్లి ఆటలాడితే... సాయంత్రం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, అధికారులు, నాయకులు, కార్యకర్తలతో వెళ్లి నీటిని పరిశీలించారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ... బీఆర్‌ఎస్ హయాంలో ఇదే సీజన్‌లో ఎల్‌ఎండీలో నీటి నిల్వ 15 టీఎంసీల కంటే ఎన్నడూ తగ్గలేదన్నారు కదా, ఇదిగో అధికారిక ఆధారాలు చూపిస్తున్న.. దమ్ముంటే నా సవాలును స్వీకరించు, నిరూపిస్తే నేను ముక్కు నేలకు రాసా,్త నిరూపించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ అని సవాల్ విసిరారు. ఇప్పుడున్న 5.8 టీఎంసీలలో డెడ్ స్టోరేజ్ పోను మిగిలిన రెండు టీఎంసీలు నీరు రాబోయే 4 నెలల వరకు కరీంనగర్ నగర ప్రజల త్రాగు నీటికి, మిషన్ భగీరథకు సరిపోతుందన్నారు. ఈ లోగా వర్షాలు కురుస్తాయని, ఒకవేళ ఇబ్బందయితే మిడ్ మానేరులో నాలుగు టీఎంసీలు అదనంగా ఉన్నాయని, వాటిని విడుదల చేస్తారన్నారు. కమీషన్ల కక్కుర్తితో కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసింది చాలక, ప్రాజెక్టు రిపేర్ చేస్తే నీళ్లు వచ్చేవని అంటున్నారని, అదేమన్నా ప్యాచ్ వేస్తే ఆగేదా అని ఎద్దేవా చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజలే మిమ్ములను ఫుట్ బాల్ ఆడుతారని హెచ్చరించారు. గంగుల కమలాకర్ అబద్ధాలతో ఇంకెంత కాలం ప్రజలను మోసం చేస్తారన్నారు. అధికారిక రికార్డులను తీసుకువచ్చానని, వీటిని పరిశీలించి సమాధానం చెప్పాలన్నారు. గంగుల కమలాకర్ డ్యాంలో ఉదయం అడుగుపెడితే ఎండకొట్టిందని, తాము సాయంత్రం అడుగుపెట్టగానే వర్షం కురిసిందన్నారు. వర్షాలు అడపాదడపా కురిసినా సెప్టెంబర్ వరకు తాగునీటికి, మిషన్ భగీరథకు సరిపోతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, కార్పొరేటర్ పర్వతాల మల్లేశం, నాయకులు గోపు మల్లారెడ్డి, లాయక్, చర్ల పద్మ, నెల్లి నరేష్, షబానా మహమ్మద్, ముల్కల కవిత, జ్యోతి రెడ్డి, అస్తాపురం తిరుమల, మహాలక్ష్మి, కంది అశోక్‌రెడ్డి, బషీర్, షెహన్షా, మాసుంఖాన్, రాజ్ కుమార్, హనీఫ్, అనిల్ పాల్గొన్నారు.