హుజూరాబాద్‌ను పీవీ జిల్లాగా ఏర్పాటు చేయాలి..
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:03 AM
హుజూరాబాద్ కేద్రంగా పీవీ జిల్లాను ఏర్పాటు చేయాలని పీవీ సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
- సాధన సమితి ఆధ్వర్యంలో ర్యాలీ
హుజూరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్ కేద్రంగా పీవీ జిల్లాను ఏర్పాటు చేయాలని పీవీ సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సైదాపూర్ రోడ్‌లోని పీవీ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. హైస్కూల్ మైదానం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పీవీ సాధన సమితి నాయకులు మాట్లాడుతూ హుజూరాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేయడానికి అవసరమైన మౌలిక వసతులు, సదుపాయాలు ఉన్నాయన్నారు. పట్టణంలో జనాభా కూడా అధికంగా ఉందన్నారు. హుజూరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాలను కలుపుకుంటే సుమారు ఆరు లక్షల జనాభా ఉంటుందన్నారు. హుజూరాబాద్‌ను జిల్లాగా ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం రేవంతరెడ్డి హుజూరాబాద్‌ను జిల్లాగా చేస్తామని హామీ ఇచ్చారని, దానిని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో పీవీ సాధన సమితి కన్వీనర్ సదానందం, బండ శ్రీనివాస్, కట్కూరి మల్లారెడ్డి, శ్రీనివాస్, నర్సింహారెడ్డి, రాజిరెడ్డి, ఖాలీద్ హుస్సేన తదితరులు పాల్గొన్నారు.