హుజూరాబాద్ బంద్ విజయవంతం
ABN , Publish Date - Apr 04 , 2026 | 12:17 AM
హుజూరాబాద్ మండలం సిర్సపల్లి శివారులో ఏర్పాటు చేసే డంపింగ్ యార్డును రద్దు చేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా పట్టణంలోని వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి షాపులను మూసివేశారు.
హుజూరాబాద్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్ మండలం సిర్సపల్లి శివారులో ఏర్పాటు చేసే డంపింగ్ యార్డును రద్దు చేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా పట్టణంలోని వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి షాపులను మూసివేశారు. అలాగే అన్ని వర్గాల నాయకులు బంద్‌కు మద్దతు పలికారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపడుతున్న దీక్షకు మద్దతు గా పలువురు సంఘీభావం తెలిపారు. ముందుగా పట్టణంలో మోటర్ సైకిళ్ల ర్యాలీ నిర్వహిం చారు. ముందస్తుగానే పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. డంపింగ్‌యార్డు రద్దుకు మద్దతుగా పలువురు నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ హుజూరాబాద్ ప్రాంతంలో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేస్తే ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. దేశానికి నాణ్యమైన విత్తనాలను అందించే ఈ ప్రాంతంలోని వ్యవసాయ భూములు నాశనం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా పోరాడా లన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి డంపింగ్‌యార్డును రద్దు చేయాలన్నారు. లేని యెడల ఈ నెల 7,8వ తేదీల్లో అఖిలపక్ష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో రెండ్రోజుల పాటు పాల్గొంటానన్నారు. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బంద్‌కు సహకరించిన అన్ని వర్గాల ప్రజలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అఖిల పక్ష, ప్రజా సంఘాలు, జేఏసీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పలు పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.