Share News

గెలుపు గుర్రాల కోసం వేట

ABN , Publish Date - Jan 19 , 2026 | 01:09 AM

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఆయా వార్డులు, చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు చేయడంతో ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల కోసం వేటను కొనసాగిస్తున్నాయి.

గెలుపు గుర్రాల కోసం వేట

- మున్సిపోల్స్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రధాన పార్టీలు

- టికెట్ల కోసం పోటాపోటీ

- ఆశావహుల ముమ్మర ప్రయత్నాలు

- రిజర్వేషన్ల ఖరారుతో జోరందుకున్న రాజకీయం

జగిత్యాల, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఆయా వార్డులు, చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు చేయడంతో ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల కోసం వేటను కొనసాగిస్తున్నాయి. షెడ్యూల్‌ విడుదల ఏ క్షణం విడుదలైనా ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి అధికారులు సంసిద్ధంగా ఉన్నారు. ఈనేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలు మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాలపై గురి పెట్టి పావులు కదుపుతున్నాయి. ప్రధాన పార్టీల టికెట్లను సొంతం చేసుకోవడానికి ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి మున్సిపాలిటీల్లో ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.

ఫచైర్మన్‌ పదవి దక్కాలంటే..

మున్సిపల్‌ ఎన్నికల్లో ఒక్కో కౌన్సిలర్‌ పదవికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. చైర్మన్‌ పదవిని దక్కించుకోవాలంటే అవసరమైన సంఖ్యా బలం సమకూర్చుకోవాల్సిందే. దీంతో ప్రధాన పార్టీల్లో టికెట్ల కేటాయింపు అంత సులువు కాదనే ప్రచారం సాగుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల అనుభావాల నేపథ్యంలో ప్రధాన పార్టీలు మున్సిపల్‌ పోరుకు సంబంధించిన టికెట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. జిల్లాలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ, ఇతర పార్టీల ముఖ్య నేతలు మున్సిపల్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పావులు కదుపుతున్నాయి.

ఫప్రజాభిప్రాయం మేరకే..

జిల్లాలో మున్సిపాలిటీల్లోని ఆయా వార్డుల్లో ప్రజాభిప్రాయం మేరకే ప్రధాన పార్టీలు టికెట్లను కేటాయించే అవకాశం ఉంది. ఈ విషయంలో సంబంధిత వార్డుల్లోని పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, ముఖ్య కార్యకర్తల సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే టికెట్లను ఫైనల్‌ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఒక్కో వార్డులో నలుగురు నుంచి ఐదుగురు ఆశావహులున్నా వారిలో ప్రజల మద్దతు ఎక్కువగా ఎవరి వైపు ఉందనే విషయాలను ఆయా పార్టీల అధిష్ఠానాలు పరిగణనలోకి తీసుకొని టికెట్లు కేటాయించనున్నాయి.

ఫసీనియారిటీ కోటా అనుమానమే..

పార్టీనే నమ్ముకొని చాలా కాలంగా పనిచేస్తున్నామని పరిగణనలోకి తీసుకొని టికెట్లు కేటాయించాలని ప్రధాన పార్టీల శ్రేణుల నుంచి నేతలపై ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాన పార్టీల నేతలు సీనియారిటీ కోటపై ఆసక్తిగా లేనట్లు ప్రచారం సాగుతోంది. గెలిచే వ్యక్తి పక్క పార్టీకి చెందిన వాడైనా టికెట్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయా పార్టీల కార్యకర్తలు పేర్కొంటున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

Updated Date - Jan 19 , 2026 | 01:09 AM