ఇలా అయితే ఎలా.. సర్..
ABN , Publish Date - Aug 28 , 2026 | 12:59 AM
ఇదేంది.. సర్.. మా ఓట్లు ఇట్లా ఎట్లా పోతాయ్.. మేము ఫారాలను సరిగ్గానే నింపి ఇచ్చినం. ఇప్పుడు కొత్తగా మళ్లీ ఓటు కోసం నమోదు చేసుకోవాలని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. మీరు చేయాల్సిన పని సక్రమంగా చేసి ఉంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు.. ఫారాలను నింపిన మా ఓట్లే జాబితాలో లేకపోతే ఎట్ల’... - చెర్లబూత్కుర్ గ్రామసభలో ఓటు లేని ఓ మహిళ ఆవేదన ఇది.
- గందరగోళంగా ఓటర్ల జాబితాలు
- పలు గామ్రసభల్లో ప్రజల నిలదీత
- నోటీసులు అందిస్తున్న అధికారులు
(ఆంరఽధజ్యోతి, కరీంనగర్/ కరీంనగర్ రూరల్)
‘ఇదేంది.. సర్.. మా ఓట్లు ఇట్లా ఎట్లా పోతాయ్.. మేము ఫారాలను సరిగ్గానే నింపి ఇచ్చినం. ఇప్పుడు కొత్తగా మళ్లీ ఓటు కోసం నమోదు చేసుకోవాలని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. మీరు చేయాల్సిన పని సక్రమంగా చేసి ఉంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు.. ఫారాలను నింపిన మా ఓట్లే జాబితాలో లేకపోతే ఎట్ల’...
- చెర్లబూత్కుర్ గ్రామసభలో ఓటు లేని ఓ మహిళ ఆవేదన ఇది.
- అదేంది.. సర్.! మా ఒక్క ఊరిలోనే ఫారాలు నింపిన వారిలో 900 మందికి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ప్రజలకు మీరేమి సమాధానం చెబుతారు. బీఎల్‌వోలు అన్నీ మేము చూసుకుంటామని చెప్పి ఇప్పుడు నోటీసులు ఇవ్వడం న్యాయామా..?
- నగునూర్ గ్రామసభ వద్ద అధికారులతో గ్రామస్తుల వాగ్వాదం
సర్..(ప్రత్యేక ఓటరు సవరణ) ప్రకియ్ర గ్రామాల్లో సమస్యల్ని సృష్టిస్తోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఓటర్ల వివరాలను బహిరంగంగా వెల్లడించేందుకు నిర్వహించిన గ్రామసభల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. నిన్న మొన్నటి వరకు ఫారం నింపించిన వారందరి ఓట్లు ఉన్నాయని ఓటర్లు అనుకున్నారు. చాలామందికి నోటీసులు రావడంతో తలపట్టుకుంటున్నారు. ఇదెక్కడి సమస్య అంటూ బీఎల్‌వోలను, అధికారులను నిలదీస్తున్నారు.
ఫ అర్థంకాక అవస్థలు..
గ్రామాల్లో అందజేస్తున్న నోటీసులు ప్రజలకు అర్థం అవక అవస్థలు పడుతున్నారు. అందులో ఏ సమయానికి రావాలనే సమయం ఉండడం మినహా మిగతా విషయాలు ఏమీ గ్రామీణ ప్రజలకు తెలియడం లేదు. ఏ కారణం చేత ఓటును తొలిగిస్తున్నామనేది అధికారులు చెబితేకాని అర్థం అవడం లేదు. దీంతోపాటు 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి తమ వివరాలను సరిపోల్చుకోవాలని అని సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,77,157మందికి నోటీసులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయా మండలాల్లో నిర్ణీత తేదీలతో గ్రామసభల షెడ్యూల్‌ను ఇప్పటికే ఖరారు చేశారు. మరోవైపు ఈ సభలతో సంబంధం లేకుండా నోటీసుల పంపిణీని బీఎల్‌వోలు, ఇతర సిబ్బంది అందిస్తున్నారు. సర్‌కు ముందు జిల్లా వ్యాప్తంగా 10,89,090 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం 9,11,933 మంది ఓటర్లున్నారు. అత్యధికంగా కరీంనగర్ నియోజకవర్గంలో 1,00,618 ఓట్లు తొలిగిపోయాయి. హుజూరాబాద్‌లో 28,245, మానకొండూర్‌లో 19,668, చొప్పదండిలో 28,668 ఓట్లు తొలగించారు.
ఫ తప్పుల తడకగా నమోదు
వాస్తవానికి ఓటర్లు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేసే క్రమంలో తప్పులు దొర్లినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. చాలామంది ఓటర్ల వివరాలు, వారి ఎపిక్ నంబర్ల విషయంలో సున్నా ఉన్న చోట ఓ అనే ఆంగ్ల అక్షరాన్ని నమోదు చేయడం లేదా ఓ అని ఉన్న అక్షరం స్థానంలో సున్నాను పేర్కొనడంతో పొందుపర్చిన వివరాల్లో తప్పుగా నమోదైంది. ఎక్కువగా వృద్ధుల ఓట్లు మాయమవడంతో వారు తామెక్కడికి వెళ్లాలి..? మళ్లీ కొత్తగా ఎలా నమోదు చేసుకోవాలని ఆందోళన చెందుతున్నారు.
కరీంనగర్ రూరల్ మండల పరిధిలోనే 56,767 మంది ఓటర్లు ఉండగా ఇందులో సరైన వివరాలు ఫారాల్లో రాయలేదని 9,779 మందికి నోటీసు ఇచ్చారు. నో మ్యాపింగ్ కారణంగా 4,486 మందివి తిరస్కరణకు గురయ్యాయి. సెప్టెంబరు 9వ తేదీ వరకు అభ్యంతరాలు సహా ఫిర్యాదులకు అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. కొద్ది రోజులే వ్యవధి ఉండడంతో ఎంతమంది ఓటర్లు తుది ముసాయిదాకు అర్హత సాధిస్తారనేది అంతుచిక్కడం లేదు.
ఫ సర్ నోటీసుల కలకలం
- కళాభారతిలో 20 ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు
కరీంనగర్ టౌన్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ముసాయిదా జాబితాలో మ్యాపింగ్ చేయని, ఇతర వివరాలు సరిపోలని వారికి అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. మ్యాపింగ్ ప్రకారంగా ఓటరు పేరు, తండ్రి పేరు గత జాబితాకు సరిపోలక పోవడం, తల్లితండ్రులతో అనుసంధానం చేసిన మరో సంతానంతో పోలిస్తే వయసు మధ్య తొమ్మిది నెలల కంటే తక్కువగా ఉండడం, తల్లితండ్రి వయసు మధ్య తేడా 50 ఏళ్లకు మించి ఉండడం, ఒకే వ్యక్తిని పలువురు తండ్రిగా పేర్కొనడం, ఇతర వివరాలకు తేడాలు ఉండడం, పొరపాట్లు, తప్పులు ఉన్న ఓటర్లకు నోటీసులు అందిస్తున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో ఈనెల 10న ముసాయిదా జాబితాను విడుదల చేశారు. ముసాయిదా జాబితా ప్రకారంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2,68,214 మంది ఓటర్లు ఉన్నారు. 2002 ఓటరు జాబితాకు తాజా జాబితాకు తేడాలుండడంతో నియోజకవర్గంలో 94 వేల మందికి ఆధారాలను చూపించి తప్పులను సరి చేయించుకోవాలంటూ అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పేరుతో నోటీసులు జారీ చేస్తున్నారు.
ఫ నగర పరిధిలో 63,942 మందికి నోటీసులు
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 63,942 మందికి నోటీసులను సంబంధిత బీఎల్‌వోల ద్వారా జారీ చేశారు. నోటీసు వెనుకభాగంలో సూచించిన ఆధారాలను చూపించిన వెంటనే వాటిని సరిచేస్తూ ఆన్‌లైన్ చేసేందుకు బీఎల్‌వోలకు ప్రత్యేక తేదీలు, సమయాలను కేటాయించారు. కళాభారతి ఆడిటోరియంలో 20 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి సరి చేసే ప్రక్రియను గురువారం ప్రారంభించారు. బీఎల్‌వోలు జారీ చేస్తున్న నోటీసుల్లో పేర్కొన్న తేదీ, సమయంలో కళాభారతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో నోటీసు జారీ అయిన వ్యక్తులు స్వయంగా ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. సెప్టెంబరు 22 వరకు నోటీసులు జారీ చేసిన వారి ఆధారాలను పరిశీలించి తుది ఓటరు జాబితాను రూపొందిస్తారు. గతంలో ఓటు హక్కు కలిగి ఉండి ముసాయిదా జాబితాలో పేర్లు రానివారు అభ్యంతరాలతో దరఖాస్తు చేసుకుంటే ఆధారాలను పరిశీలించి ఓటు హక్కును కల్పిస్తారు. కొత్తగా ఓటు హక్కు కోసం ఫారం-6ను సమర్పించి ఓటరుగా పేరు నమోదు చేసుకునే అవకాశాన్ని కలిస్తున్నారు. బీఎల్‌వోలు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫారాల్లోని వివరాలను సరిగానే పూర్తిచేసి సరైన ఆధారాలను జత చేసి బీఎల్‌వోలుకు సమర్పించినప్పటికీ నోటీసులు జారీ చేయడమేమిటనీ పలువురు ప్రశ్నిస్తున్నారు. తిరిగి తప్పులు జరగకుండా తుదిజాబితాను రూపొందించాలని, అర్హులైన వారి ఓటు హక్కు పోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.