Share News

పంటలు కాపాడుకోవడం ఎలా?

ABN , Publish Date - Aug 22 , 2026 | 01:20 AM

ఖరీఫ్‌ సాగుకు ఎల్‌నినో గండం తప్పేట్టు లేదు. జూలై చివరి వారంలో ఆగస్టు మొదటి వారంలో కురిసిన వర్షాలతో రైతులు వరి నాట్లు పూర్తి చేశారు. అడపా దడపా కురిసిన వర్షాలతో సాధారణ వర్షపాతం నమోదైనా భూగర్భ జలాలు పెరగకపోవడం, బావులు, చెరువులు, కుంటల్లోకి నీరు రాకుండా పోయింది.

పంటలు కాపాడుకోవడం ఎలా?

- ఎస్సారెస్పీ నీరు వదిలేది ప్రశ్నార్థకమే

- సగమే నిండిన ప్రాజెక్టు

- మండుతున్న ఎండలు

- 2.40 లక్షల ఎకరాల్లో వరి, 45,836 వేల ఎకరాల్లో పత్తి సాగు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ఖరీఫ్‌ సాగుకు ఎల్‌నినో గండం తప్పేట్టు లేదు. జూలై చివరి వారంలో ఆగస్టు మొదటి వారంలో కురిసిన వర్షాలతో రైతులు వరి నాట్లు పూర్తి చేశారు. అడపా దడపా కురిసిన వర్షాలతో సాధారణ వర్షపాతం నమోదైనా భూగర్భ జలాలు పెరగకపోవడం, బావులు, చెరువులు, కుంటల్లోకి నీరు రాకుండా పోయింది. ప్రాజెక్టుల్లో కూడా పూర్తి స్థాయిలో నీరు రాక పోవడంతో ఈ పంటకు నీరు వదిలేది ప్రశ్నార్థకంగా మారింది. సెప్టెంబర్‌ మాసం నుంచి ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండబోతుందని వాతావరణ శాస్త్రజ్ఞులు చెబుతుండడం మరో వైపు కమ్ముకుని వస్తున్న మేఘాలు ఊరికే తేలిపోతూ ఎండలు మండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఖరీఫ్‌లో జిల్లాలో 2,69,834 ఎకరాల్లో వరి, 52,938 ఎకరాల్లో పత్తి, 4,310 ఎకరాల్లో మొక్కజొన్న మరో 15 వేల ఎకరాల్లో ఇతర పంటలు కూరగాయలు సాగు చేస్తారు. ఈ సారి 2.79 లక్షల ఎకరాల్లో వరి, 48 వేల ఎకరాల్లో పత్తి 4,500 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. 2.40,822 ఎకరాల్లో వరి, 45,836 ఎకరాల్లో పత్తి, 5,409 ఎకరాల్లో మొక్కజొన్న, 2,288 ఎకరాల్లో కంది, 4,191 ఎకరాల్లో పెసర పంటలు సాగు చేశారు.

ఫ 13 శాతం లోటు వర్షపాతం

ఎల్‌నినో కారణంగా ఆరుతడి పంటలు మాత్రమే వేయాలని ప్రభుత్వం ప్రచారం చేసింది. వాతావరణ శాస్తజ్ఞులు చెప్పిన ప్రకారమే నైరుతి రుతుపవనాల వల్ల పెద్దగా వర్షాలు పడలేదు. జూన్‌ మాసం మొదటి నుంచి నైరుతి రుతుపవనాల కాలంలో 81 రోజులు గడిచిపోగా కేవలం 32 రోజుల్లో మాత్రమే అక్కడక్కడా వర్షపాతం నమోదైంది. అది కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసిన రోజులు వారం కూడా లేదు. ఇప్పటి వరకు జిల్లాలో జూన్‌ ఆరంభం నుంచి 506.0 మిమీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 438.9 మిమిల వర్షపాతం మాత్రమే నమోదైంది. 13 శాతం లోటు వర్షపాతంతో జిల్లాలో భూగర్భ జలాలు పెరగకుండా పోయాయి. గోదావరి పరివాహాక ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి సగం మేరకు నీరు వచ్చింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 80.5 టిఎంసీలు కాగా 44.26 టిఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్టులోకి వచ్చింది. ఆదిలాబాద్‌ జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టుకు వరద వచ్చి గేట్లు ఎత్తడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 20 టిఎంసీల మేరకు నీరు రావడంతో ఆ నీటిని మద్య మానేరుకు ఎత్తిపోశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 20.17 టిఎంసీల నీటి సామర్థ్యానికి 16.18 టిఎంసీల నీరు ఉన్నది. 27.55 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న మిడ్‌ మానేరు రిజర్వాయర్‌లో 20.09 టిఎంసీల నీరు నిల్వ ఉన్నది. లోయర్‌ మానేరు డ్యాంలో 24.03 టిఎంసీలకు 11.00 టిఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఈ మూడు రిజర్వాయర్‌లలో ఉన్న నీటి నిల్వతో శ్రీరాంసాగర్‌ ఆయకట్టు ప్రాంతమైన జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాల ఆయకట్టుకు సాగు నీరు సరిపోయే పరిస్థితులు ఉన్నాయి. అయితే సెప్టెంబర్‌ నుంచి ఎల్‌నినో తీవ్ర రూపం దాల్చి, తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని ఎండలు మండిపోవడంతో రాబోయే రోజుల్లో తాగునీటికి కూడా ఇబ్బందులు ఏర్పడకుండా చూడడానికి ప్రాజెక్టుల నీటిని సాగుకు వదిలే అవకాశం లేదని అంటున్నారు. 40 టీఎంసీల నీరు ఉన్న సందర్భాల్లో శ్రీరాంసాగర్‌ ఆయకట్టుకు ఆన్‌ అండ్‌ ఆఫ్‌ విధానంలో సాగునీరు వదలడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ప్రాజెక్టుల నుంచే అన్ని గ్రామాలకు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు వదులుతున్నందున ఈ నీటిని సాగుకు వాడితే ఏడాది వరకు తాగు నీరు అందించే అవకాశం లేకుండా పోతుందనే కారణంతో నీటిని వదిలే అవకాశాలు ఉండకపోవచ్చని ఇరిగేషన్‌ అధికారులు ప్రైవేట్‌ మాటల్లో చెబుతు న్నారు. ఇప్పటి వరకు నీటిని వదిలే విషయంలో శివం సమావేశం ఏర్పాటు చేసి ఒక నిర్ణయం తీసుకోకపోవడంతో వారి మాటలు నిజమేననే భావన కలుగుతున్నది. ఇప్పటికే ఎండలు మండిపోతుడడంతో పత్తి, వరి వల్లిపోతున్నాయి. మరికొద్ది రోజులు ఇదే వేడి వాతావరణం కొనసాగితే మొక్కలు ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి వరి నాట్లు వేసిన నేపథ్యంలో ఈ పంటకైనా నీరు వదిలి కాపాడాలని రైతులు అంటున్నారు. అయితే అధికారుల నుంచి మాత్రం ఎలాంటి స్పందన రావడం లేదని రైతులు చెబుతున్నారు.

Updated Date - Aug 22 , 2026 | 01:20 AM