రైతు భరోసా ఎందరికి..?
ABN , Publish Date - Jun 21 , 2026 | 01:11 AM
రైతు భరోసా పథకం కింద ఈనెల 30నుంచి తొమ్మిది రోజుల్లో ఆర్థిక సహాయం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడాన్ని జిల్లా రైతులు స్వాగతిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
రైతు భరోసా పథకం కింద ఈనెల 30నుంచి తొమ్మిది రోజుల్లో ఆర్థిక సహాయం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడాన్ని జిల్లా రైతులు స్వాగతిస్తున్నారు. యాసంగి సీజన్‌లో ఈ పథకం కింద సహాయం కోసం ఎదురుచూసిన రైతులకు నిరాశే మిగిలింది. జిల్లాలోని రైతులందరికీ వారికి ఎంత భూమి ఉన్నా.. రెండెకరాలకు మాత్రమే రెండు విడతల్లో ఎకరాకు ఆరేసి వేల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. రెండెకరాల విస్తీర్ణం వరకు భూమి ఉన్న రైతులందరూ దీంతో సంతోషించినా మూడు, నాలుగు, ఐదు ఆపైన విస్తీర్ణంలో భూమి ఉన్నవారికి గతంలో మాదిరిగా ఆర్థిక సహాయం అందక తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఫ రైతుల్లో అనుమానాలు
ఈ సారి తొమ్మిదిరోజులపాటు రైతులందరికీ ఆర్థిక సహాయం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో అందరు రైతులకు మొత్తం భూమికి ఎకరాకు ఆరువేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం విడుదలవుతుందని ఆశిస్తున్నా కొందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో 2018లో ఆనాటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రారంభించి ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సహాయంగా అందించారు. 2023 డిసెంబరులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ సంవత్సరం యాసంగి సీజన్‌లో ఎకరాకు ఐదు వేల చొప్పున పెట్టుబడి సహాయాన్ని అందించింది. ఆ తర్వాత 2024 వానాకాలం సీజన్‌లో రైతుబంధు కింత ఆర్థిక సహాయం ఇవ్వలేదు. అనంతరం రైతు భరోసా పథకంగా పేరు మార్చి 2024-25 యాసంగిలో ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి శ్రీకారం చుట్టింది. ఆ సీజన్‌లో జిల్లాలోని 1,65,850 మందికి 132.13 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించింది. ఆ తర్వాత 2025 వానా కాలం సీజన్‌లో 1,90,186 మంది రైతులకు 206.63 కోట్లు పెట్టుబడి సహాయంగా రైతుల ఖాతాల్లోడబ్బులు జమ చేసింది. 2025-26 యాసంగిలో ఎకరాకు ఆరు వేల చొప్పున కేవలం 2 ఎకరాల విస్తీర్ణానికి మాత్రమే పెట్టుబడి సహాయం విడుదల చేసింది.
ఫ యాసంగి సీజన్‌లో రూ. 143.35 కోట్ల సాయం
గత యాసంగి సీజన్‌లో జిల్లాలో 2,14,311 మంది రైతులు వారికి ఉన్న వ్యవసాయ భూమికి 213.45 కోట్ల రూపాయల పెట్టుబడి సహాయం అవసరమవుతుందని అధికారయంత్రాంగం గుర్తించి ప్రతిపాదనలను పంపించింది. రెండెకరాల విస్తీర్ణం మేరకు మాత్రమే రైతులకు సహాయం అందించడంతో 143.35 కోట్ల లబ్ధి చేకూరింది. అధికారులు గుర్తించిన 20,704 మంది రైతులకు 70.09 కోట్ల రూపాయలు అందలేదు. ఈసారి వానా కాలం సీజన్‌లోనైనా అందరికీ మొత్తం విస్తీర్ణానికి ఆర్థిక సహాయం అందిస్తారా లేక మళ్లీ రెండు ఎకరాల మేరకే అందిస్తారా అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన మేరకు తొమ్మిది రోజుల్లో అందరికీ ఆర్థిక సహాయం అందిస్తామని అనడం గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేల కోట్ల పైచిలుకు పెట్టుబడి సహాయం ఏడు రోజుల్లో అందించారు. ప్రస్తుతం ఎకరాకు ఆరు వేల రూపాయల సహాయాన్ని పెంచడంతో అది తొమ్మిది వేల కోట్లకు పెరిగింది. ఒక్కో రోజు ఒక్కో ఎకరం విస్తీర్ణాన్ని పెంచుతూ రైతులందరికీ తొమ్మిది రోజుల్లో సహాయం అందిస్తే రాష్ట్రంలోని సాగుభూమి అంతటికీ రైతుభరోసా సహాయం అందే అవకాశాలున్నాయి. ఈనెల 30న ఖమ్మం జిల్లా మధిరలో జరిగే రైతు సమ్మేళనంలో రైతుభరోసా నిధుల విడుదల ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో ఆరోజు నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సహాయం జమకానున్నది.