Share News

ఎన్నాళ్లీ ఎదురుచూపులు

ABN , Publish Date - Jun 10 , 2026 | 12:55 AM

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణకే పరిమితమైంది.

ఎన్నాళ్లీ ఎదురుచూపులు

జగిత్యాల, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణకే పరిమితమైంది. ఈ పథకాన్ని ప్రకటించి యేడాది దాటిన అడుగు ముందుకు పడకపోవడంతో దరఖాస్తు దారులు నిరాశ చెందుతున్నారు. గత యేడాది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని ప్రారంభిస్తామని, తొలి విడతగా కొన్ని దరఖాస్తులకు నిధులు కేటాయిస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో దరఖాస్తుదారులు నిరుత్సాహానికి గురయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ పథకం ఊసే ఎత్తలేదు. వారం రోజుల క్రితం జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగానైనా నిధులు కేటాయిస్తారని ఎదురుచూసిన నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదు.

ఫతప్పని ఎదురుచూపులు...

రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. నెల రోజుల్లో రుణాలు ఇప్పిస్తామని దరఖాస్తులు స్వీకరించి, మండల స్థాయిలో కమిటీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పిన ప్రభుత్వం యేడాది దాటినా ఆ దిశగా అడుగులు వేయడం లేదని యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి వేల సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అధిక విలువ కలిగిన యూనిట్లతో మెరుగైన స్వయం ఉపాధి పొందవచ్చన్న ఉద్దేశంతో ఎక్కువ మంది కేటగిరీ-4 రుణాలకే మొగ్గుచూపారు. దరఖాస్తుల పరిశీలన, అర్హుల ఎంపికకు ఇంటర్వ్యూల నిర్వహణ తదితర కసరత్తులను సైతం పూర్తి చేసింది.

ఫ ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులు

జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి మున్సిపాలిటీలతో పాటు అన్ని మండలాల పరిదిలో గల గ్రామాల్లో సుమారు పన్నెండు లక్షల పై చిలుకు జనాభా ఉంది. రాజీవ్‌ యువ వికాసంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ సామాజిక వర్గాల నుంచి దరఖాస్తులను అధికారులు ఆహ్వానించారు. ఆయా సామాజిక వర్గాల నుంచి దరఖాస్తులు పోటెత్తాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ సామాజిక వర్గాలకు చెందిన సుమారు 47,787 మంది యువతీ యువకులు దరఖాస్తు చేసుకున్నారు.

ఫఇంటర్వ్యూలు నిర్వహించి...

తొలుత ప్రభుత్వం దరఖాస్తుదారులకు మండల పరిషత్‌, మున్సిపల్‌ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఆ తర్వాత అర్హులైన వారికి యూనిట్‌ విలువ ప్రకారం ఐదు విడతల్లో అక్టోబరు వరకు మంజూరు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి విడతల్లో కేటగిరీ-1లో, రూ.50 వేలు, కేటగిరీ-2లో రూ.లక్ష రుణాల వరకు ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. కానీ ఈ ప్రక్రియ వాయిదా పడడంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర నిరాశ నెలకొంది.

ఫబ్యాంకులు సమ్మతించినా..

రాజీవ్‌ యువ వికాసం పథకంలో భాగంగా వివిధ కార్పొరేషన్‌ల ద్వారా రూ.50 వేల వరకు రుణ సదుపాయం కల్పిస్తే వంద శాతం, రూ.లక్ష వరకు 90 శాతం, రూ. 2లక్షల వరకు 80 శాతం, రూ.2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు రుణం పొందిన వారికి 70 శాతం రాయితీ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కువ మంది రూ.4 లక్షల వరకు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. బ్యాంకులు సమ్మతించినా ప్రభుత్వం రాయితీ నిధులు విడుదల చేయకపోవడంతో బ్యాంకర్లు ఏమీ చేయలేకపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పథకం అమలును వేగవంతం చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.

ఫప్రభుత్వ మార్గదర్శకాల మేరకు..

రాజీవ్‌ యువ వికాసం పథకం లబ్ధిదారులకు రుణాలు, ఆర్థిక సాయం అందజేత విషయమై సంబంధిత అధికారులు ప్రభుత్వం నుంచి తదుపరి వచ్చే మార్గదర్శకాల మేరకు నడుచుకుంటామని అంటున్నారు. పథకం కింద లబ్ధిపొందడానికి నిత్యం పదుల సంఖ్యలో దరఖాస్తుదారులు సంబంధిత శాఖల అధికారులను సంప్రదిస్తున్నారు. రాజీవ్‌ యువ వికాసం పథకం ప్రారంభంపై స్పష్టత లేకపోవడంతో దరఖాస్తుదారులకు ఎలాంటి సమాచారం అందించాలో తెలియక అధికారులు సైతం అయోమయానికి గురవుతున్నారు.

యువతను ఆదుకోవాలి

- దొనికెల నవీన్‌, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు

రాజీవ్‌ యువ వికాసం పథకం రుణాలను త్వరితగతిన అందించి యువతను ఆదుకోవాలి. అటు ఉపాధి లేక కుటుంబాలు గడవక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకోవాలి. సిబిల్‌ స్కోర్‌, పాన్‌కార్డుతో సంబంధం లేకుండా అర్హులందరికీ రుణాలు అందించాలి.

జిల్లాలో పరిస్థితి ఇలా..

---------------------------------------------------------------------------------

కార్పొరేషన్‌..యూనిట్ల లక్ష్యం.....వచ్చిన దరఖాస్తులు

---------------------------------------------------------------------------------

ఎస్సీ 4,402 11,300

ఎస్టీ 674 1,437

మైనార్టీ764 3,922

బీసీ 7,013 31,128

---------------------------------------------------------------------------------

మొత్తం12,853 47,787

---------------------------------------------------------------------------------

Updated Date - Jun 10 , 2026 | 12:55 AM