Share News

‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ సాగేదెలా?

ABN , Publish Date - Mar 17 , 2026 | 01:19 AM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక’కు నిధుల కొరత ఏర్పడింది.

‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ సాగేదెలా?

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక’కు నిధుల కొరత ఏర్పడింది. 99 రోజులపాటు ఐదు దశల్లో పది రకాల అంశాలపై కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించిన ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించక పోవడంతో అటు.. అధికారులు, ఇటు.. సర్పంచులు, మున్సిపల్‌ చైర్మన్లు తలలు పట్టుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేది ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 6వ తేదీ నుంచి అమల్లోకి రాగా, జూన్‌ 12వ తేదీ వరకు 99 రోజులపాటు సాగనున్నది. ఏప్రిల్‌ 16వ తేదీన ఒకే రోజు అన్ని గ్రామాలు, పట్ట ణాల్లో గ్రామ, వార్డు సభలు, మే 2వ తేదీన నియోజకవర్గ స్థాయిలో ఒకే రోజు, మే 22వ తేదీన జిల్లా స్థాయిలో సమావే శాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పది అంశాలపై దృష్టి సారించనున్నారు. పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యా లయాల్లో పెండింగులో ఉన్న ఫైళ్ల క్లియరెన్స్‌, ఆరోగ్యం, సంక్షేమం, విద్య, అరైవ్‌ అలైవ్‌, పిల్లల భద్రత, డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేయడం, రైతు సంక్షేమం, వ్యవసాయం, మహిళలు, యువత, క్రీడలు, పర్యావరణం, తదితర అంశాలపై కార్యక్రమాన్ని రూపొందించారు. పంచాయతీలు, పురపాలక సంఘాలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయగా, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఈ ప్రణాళిక అమలుకు పెద్దగా నిధులు అవసరం లేదు. అందు బాటులో ఉన్న నిధులతోనే కార్యక్రమాన్ని నెట్టుకు రావచ్చు. కానీ గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఇది సాధ్యం కాదు. వీటిలో చేపట్టే ప్రతి పనికి నిధులు అవసరం అవుతాయి. అప్పుడే ఈ కార్యక్రమం అమలు సాధ్యమవుతుంది. కానీ నిధుల విడుదలపై ప్రభుత్వం పెద్దగా దృష్టి సారించలేదు.

ఫ నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం

పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పనుల నిర్వహణకు అవసర మైన నిధుల కేటాయింపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో అధికారులు, ప్రజాప్రతినిధుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిధులు కేటాయించకుండా ప్రగతి పనులు ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. గ్రామాల్లోని చెరువులు, కుంటలు, ఇతర నీటి వనరుల్లో గుర్రపు డెక్క, చెత్తా, చెదారం పేరుకుపోయింది. దీన్ని తొలగించాలంటే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాల్సి ఉంటుంది. ఇందుకు నిధులు అవసరం అవుతాయి. పారిశుధ్య కార్మికుల జీతాలు, వీధి దీపాల నిర్వహణ, మురుగు కాలువల శుభ్రత పనులకు నిధులు లేక ఇప్పటికే పంచాయతీ పాలకవర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఏడాదిన్నర తర్వాత గ్రామ పంచా యతీ, ఏడాది తర్వాత మున్సిపల్‌ ఎన్నికలు జరగడంతో కేంద్రం వద్ద పెండింగులో ఉన్న 2023-24, 2024-25 సంవత్సరాలకు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతున్నాయి. పంచాయతీలకు ఇప్పటి వరకు మూడు విడతల్లో నిధులు వచ్చాయి. మున్సిపాలిటీలకు విడుదల కావాల్సి ఉన్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు గతంలో చేపట్టిన అభివృద్ధి పనులు, పంచాయతీల నిర్వహణకే సరిపోతాయి. అందుబాటులో ఉన్న నిధులనే వెచ్చించాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ప్రస్తుతం విడుదలైన నిధులు బకాయిలు, నిర్వహణకు సరిపోవని ప్రజాప్రతి నిధులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో 99 రోజుల ప్రణాళికను ఎలా అమలు చేయాలో తెలియక సర్పంచులు, కార్యదర్శులు, ఇటు మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లు ఆందోళన చెందుతున్నారు.

ఫ 99 రోజుల ప్రణాళిక ఇలా..

ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజులపాటు ఒక్కో వారంలో కొన్ని అంశాలను అమలు చేయాలని ఆదేశించింది. ఇందులో ఒకటవ వారంలో గ్రామసభలు నిర్వహించడం, గ్రామ అవసరాలను సర్వే చేయడం, అభివృద్ధి ప్రణాళిక కమిటీలను ఏర్పాటు చేయాలి. 2వ వారంలో శుభ్రత కార్యక్రమాలు ప్రారంభించడం, చెత్త సేకరణ వ్యవస్థను ఏర్పాటు, మురుగు కాలువలను శుభ్రం చేయించాలి. 3వ వారంలో తాగునీటి వనరులను తనిఖీ చేయగా, నీటి ట్యాంకులను శుభ్రం చేయడం, లీకేజీలకు మరమ్మతులు చేపట్టాలి. 4వ వారంలో గ్రామ రహదారుల మరమ్మతు, వీధి దీపాల తనిఖీ, మరమ్మతు చేయాలి. 5వ వారంలో మహిళా సంఘాల సమావేశాలు, చిన్న వ్యాపారు లకు శిక్షణ ఇవ్వాలి. 6వ వారంలో రైతులతో సమావేశాలు, సాగు నీటి సమస్యల పరిష్కారం, వర్షం నీటి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. 7వ వారంలో ఆరోగ్య శిబిరాల నిర్వహణ, మలేరియా, డెంగీ నివారణకు చర్యలు తీసుకోవాలి. 8వవారంలో పాఠశాలల పరిశీలన, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. 9వ వారంలో చెట్లు నాటడం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టాలి. 10వ వారంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, క్రీడా కార్యక్రమాలు నిర్వహించాలి. 11వ వారంలో ప్రభుత్వ పథకాల నమోదు. శిబిరాల నిర్వహణ, పింఛన్‌, రేషన్‌, ఆధార్‌ సేవలు అందించాలి. 12వ వారంలో గ్రామ మౌలిక సదుపాయాలపై సమీక్ష, మిగిలిన పనుల పూర్తి చేయాలి. 13వ వారంలో పూర్తి నివేదిక తయారీ, గ్రామ, పట్టణ సభల ప్రగతి వివరాలు తదుపరి ప్రణాళిక నిర్ణయం తదితర కార్యక్రమాలను అమలు చేయాల్సి ఉంటుంది. అయితే 99 రోజుల ప్రణాళికలో సగం పనులు నిధులతోనే ముడిపడి ఉండడం నిధుల కొరత ఏర్పడడంతో ఏం చేయాలో ప్రజాప్రతినిధులు, అధికారులు దిక్కులు చూస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రత్యేకించి నిధులు మంజూరు చేస్తేనే ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక విజయవంతం అవుతుంది. లేదంటే తూతూ మంత్రంగానే సాగనున్నది.

Updated Date - Mar 17 , 2026 | 01:19 AM