హోటళ్లు, లాడ్జీల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - May 20 , 2026 | 12:15 AM
హోటళ్లు, లాడ్జీల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని సీపీ గౌస్‌ఆలం అన్నారు. పీఎంజే జ్యువెలర్స్‌లో జరిగిన భారీ దోపిడీ ఉదంతాన్ని పురస్కరించుకుని కమిషనరేట్ పరిధిలోని హోటళ్లు, లాడ్జీల యజమానులు, నిర్వాహకులతో మంగళవారం సీపీ అవగాహన సమావేశం నిర్వహించారు.
కరీంనగర్ క్రైం, మే 19 (ఆంధ్రజ్యోతి): హోటళ్లు, లాడ్జీల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని సీపీ గౌస్‌ఆలం అన్నారు. పీఎంజే జ్యువెలర్స్‌లో జరిగిన భారీ దోపిడీ ఉదంతాన్ని పురస్కరించుకుని కమిషనరేట్ పరిధిలోని హోటళ్లు, లాడ్జీల యజమానులు, నిర్వాహకులతో మంగళవారం సీపీ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆయుధాలతో కూడిన ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠా నకిలీ ఆధార్ కార్డులు, తప్పుడు ఫోన్ నంబర్లు, తప్పుడు చిరునామాలు ఇచ్చి ఉమ్మడి జిల్లాలోని పలు హోటళ్లలో దాదాపు రెండు నెలల పాటు బస చేసిందన్నారు.ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతే ధ్యేయంగా పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా కఠినమైన మార్గదర్శకాలను జారీ చేస్తున్నామని తెలిపారు. హోటళ్లు, లాడ్జీల్లో రూములు ఇచ్చే ముందు గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఆధార్ కార్డులను గుడ్డిగా నమ్మకుండా అందులోని ఫోటో, వయస్సు, చిరునామా అసలైనవా కాదా అని సరిచూసుకోవాలన్నారు. అనుమానం వస్తే అదనపు గుర్తింపు కార్డులను అడగాలన్నారు. కస్టమర్లు ఇచ్చే మొబైల్ నంబర్ పనిచేస్తుందో లేదో క్రాస్-చెక్ చేసుకోవాలని, అది సదరు వ్యక్తి పేరు మీద ఉందో లేదో నిర్ధారించుకోవాలన్నారు. విదేశీయులు వస్తే నిబంధనల ప్రకారం తక్షణమే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సీపీ సూచించారు. ప్రతి హోటల్‌లో హై-రెజల్యూషన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, కనీసం 90 రోజుల ఫుటేజీని భద్రపరచాలన్నారు. గెస్ట్ రిజిస్టర్, ఐడీ ప్రూఫ్స్, వాహనాల వివరాలు, చెక్-ఇన్/చెక్-అవుట్ సమయాలను డిజిటల్ రూపంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు.
ఫ అనుమానాస్పద కదలికలపై నిఘా
లగేజీ లేకుండా రూమ్ తీసుకునేవారు, ఆయుధాలు, అనుమానాస్పద బ్యాగులతో వచ్చేవారు, సీసీ కెమెరాల ముందుకు రాకుండా తప్పించుకునే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని సీపీ ఆదేశించారు. భారీ నగదు లావాదేవీలు చేసే వారి వివరాలను వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరవేయాలని సూచించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించి, నిందితులకు ఆశ్రయం కల్పించినా, పోలీసుల తనిఖీలకు సహకరించకపోయినా సదరు హోటల్ యాజమాన్యాలపై క్రిమినల్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఫనగరంలో ముమ్మరంగా తనిఖీలు.
నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద పగలు, రాత్రి తేడా లేకుండా ‘నాకా బందీ’ (వాహనాల తనిఖీ) నిర్వహిస్తున్నామని సీపీ తెలిపారు. నకిలీ నంబర్ ప్లేట్లు, అద్దె వాహనాలు, తప్పుడు పత్రాలతో తిరిగే వారిని నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, శివారు కాలనీల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నామన్నారు. కొత్తగా అద్దెకు దిగిన వారు, అనుమానాస్పద వ్యక్తులు, పాత నేరస్థుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మార్కెట్ ప్రాంతాలు, జ్యువెలర్స్, ఫైనాన్స్ సంస్థల వద్ద బ్లూ కోల్ట్స్, టాస్క్‌ఫోర్స్, ప్రత్యేక పోలీస్ బలగాలతో నిరంతర పెట్రోలింగ్ పెంచామన్నారు. ఆయా ప్రాంతంలో ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నా, ఇళ్లు అద్దెకు తీసుకుని వింతగా ప్రవర్తిస్తున్నా, వాహనాలు వదిలేసి వెళ్లినా వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్‌స్పెక్టర్లు రాంచందర్‌రావు, సృజన్‌రెడ్డి, తిరుమల్ పాల్గొన్నారు.