Share News

సాదా బైనామాలపై ఆశలు..

ABN , Publish Date - Apr 04 , 2026 | 01:50 AM

సాదా బైనామాల నిరీక్షణకు ఉపశమనం కలగనుంది. తాజాగా హైకోర్టు సాదా బైనామాలపై సానుకూలంగా తీర్పునివ్వడంతో మోక్షం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పదేళ్లుగా రైతులకు ప్రభుత్వ పథకాలను దూరం చేస్తున్న సాదాబైనామాలకు మోక్షం కలుగుతుందనే ఆశలు మొదలయ్యాయి.

సాదా బైనామాలపై ఆశలు..

- హైకోర్టు నుంచి ఊరట..

- విధివిధానాలపై ప్రభుత్వం కసరత్తు

- జిల్లాలో పాత సాదాబైనామాలు 15 వేలు..

- భూభారతి ద్వారా 1675 దరఖాస్తులు పెండింగ్‌

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

సాదా బైనామాల నిరీక్షణకు ఉపశమనం కలగనుంది. తాజాగా హైకోర్టు సాదా బైనామాలపై సానుకూలంగా తీర్పునివ్వడంతో మోక్షం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పదేళ్లుగా రైతులకు ప్రభుత్వ పథకాలను దూరం చేస్తున్న సాదాబైనామాలకు మోక్షం కలుగుతుందనే ఆశలు మొదలయ్యాయి. సాదా బైనామాల సమస్య తీరుస్తామని గత ప్రభుత్వ హయాం నుంచి ఊరిస్తూ వస్తున్న మోక్షం మాత్రం కలగలేదు. ధరణి ప్రవేశపెట్టిన గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాదా బైనామాలను ముందుకు తీసుకువచ్చి క్రమబద్ధీకరణకు దరఖాస్తులు స్వీకరించింది. హైకోర్టు స్టే విధించడంతో దీనిపై ఉత్తర్వులు రాలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిలో ఉన్న లోపాలను సవరిస్తూ భూభారతని తీసుకొచ్చింది. ఇందులో సాదా బైనామాల క్రమబద్ధీకరణ జరుగుతుందని ప్రకటించారు. భూభారతిలో సెక్షన్‌-6 రూల్‌(6)లో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు. సాదా బైనామాలపై రైతుల్లో మళ్లీ ఆశలు కల్పించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆర్డీవో నేతృత్వంలో దరఖాస్తుల పరిశీలన మొదలైంది. ఈ సందర్భంలోనే కొన్ని సమస్యలతో సాదా బైనామాల పరిష్కారం ప్రక్రియ మళ్లీ నిలిచిపోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటిగా ఉన్న సాదా బైనామాల పరిష్కారం ఊరించే పరిస్థితిగానే ఉంది. గత ప్రభుత్వంలో 2016లో జీవో నంబర్‌ 153ను తీసుకొచ్చింది. 2014 జూన్‌ 2 తేదీ కంటే ముందు సాదా బైనామాలతో భూములు కొనుగోలు చేసిన రైతుల నుంచి దరఖాస్తు స్వీకరించి చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించారు. తర్వాత మళ్లీ 2020 అక్టోబర్‌ 12న కూడా జీవో నంబర్‌ 112ను జారీ చేసి సాదా బైనామాల సమస్య పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగానే 2020 అక్టోబర్‌లో కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ ప్రక్రియను చేపట్టారు. జీవోలు వచ్చిన గత ప్రభుత్వంలో సాదా బైనామాలపై పరిష్కారం లభించలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూభారతి చట్టం ద్వారా రైతు సమస్యలు పరిష్కరించేందుకు పూనుకుంది. కార్యచరణకు శ్రీకారం చుట్టి దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో సాదా బైనామాలతో పాటు అసైన్డ్‌ భూముల సమస్యలపై కూడా దరఖాస్తులు వచ్చాయి. కానీ కొందరు హైకోర్టుకు వెళ్లడంతో పెండింగ్‌లో పడిపోయింది. తాజాగా హైకోర్టు సాదా బైనామాలపై సానుకూలంగా తీర్పునివ్వడంతో ప్రభుత్వం మళ్లీ సాదా బైనామాలకు మోక్షం కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వ నుంచి రావాల్సి ఉంది.

సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ద్వారానే పరిష్కారం..

సాదా బైనామాలలో భూభారతి చట్ట ప్రకారం క్షేత్రస్థాయి పరిశీలనలో కొనుగోలుదారులు, అమ్మకందారులు పత్రాలు ఇవ్వాలనే నిబంధనలు ఉండేవి. దీని ద్వారా సమస్యలు వస్తున్నాయని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం విక్రయదారుడు లేకపోయినా కొనుగోలుదారునికి హక్కులు సంక్రమించే విధంగా నిబంధనలు సవరిస్తున్నట్లు తెలుస్తోంది. భూమి చుట్టుపక్కల ఉన్నవారిని విచారించిన అనంతరం కొనుగోలుదారు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తీసుకొని కల్పించే దిశగా త్వరలోనే విధివిధానాలు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. కొనుగోలుదారుడు తాను ఇచ్చే అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలినా రిజిస్ట్రేషన్‌ రద్దుచేసి, స్టాంప్‌ డ్యూటీని జప్తు చేయడంతో పాటు క్రిమినల్‌ చర్యలు కూడా తీసుకునే విధంగా పకడ్బందీగా విధివిధానాలు రానున్నట్లు తెలుస్తోంది.

పాత సాదాబైనామాలు 15 వేలు..

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ధరణి భూ సమస్యలకు పరిష్కారం చూపకపోగా పట్టాదారులకు కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ధరణి స్థానంలో తీసుకవచ్చిన భూభారతితో భూ సమస్యలు తీరుతాయనే భావనలో రైతులు ఉన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో భూసమస్యలపై కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చాయి. భూభారతి సదస్సులో అసైన్డ్‌ భూముల సమస్యలతో పాటు సాదాబైనామాలపైన ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 6,787 దరఖాస్తులు రెవెన్యూ సదస్సులో వచ్చాయి. వీటిలో సాదాబైనామా దరఖాస్తులు 1,675 వచ్చాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెల్లకాగితం ఒప్పందాలకు చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ భూ భారతి బిల్లు 2024 ద్వారా సాదాబైనామాలతో క్రమబద్ధీకరణకు భూభారతి పోర్టల్‌ ద్వారా రైతులందరికి పట్టాదారు పాసుపుస్తకాలు అందించాలని స్వీకరించిన దరఖాస్తులకు మోక్షం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం 2020 సంవత్సరం నవంబరు వరకు సాదాబైనామాల దరఖాస్తులను స్వీకరించింది. అందులో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 15వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. మీ సేవా ద్వారా చేసుకున్న దరఖాస్తుల్లో సిరిసిల్ల మండలంలో 428, వేములవాడ మండలంలో 675, వేములవాడ రూరల్‌లో 1,072, ఎల్లారెడ్డిపేటలో 1,227, తంగళ్లపల్లిలో 1,776, ముస్తాబాద్‌లో 1,685, గంభీరావుపేటలో 1,403, చందుర్తిలో 1,259, బోయినపల్లిలో 764, కోనరావుపేటలో 2,690, రుద్రంగిలో 162, వీర్నపల్లిలో 379 మంది దరఖాస్తులు వచ్చాయి. వీటిని క్రమబద్ధీకరించే చర్యలు మాత్రం జరగలేదు. తాజాగా కాంగ్రెస్‌ ప్రభుత్వం భూభరతి రెవెన్యూ సదస్సులో మళ్లీ దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లాలోని 167 రెవెన్యూ గ్రామాల పరిధిలో సదస్సులు నిర్వహించగా భూసమస్యలపై 6,787 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో మిస్సింగ్‌ సర్వే నంబర్లు, విస్తీర్ణంలో మార్పులు, చేర్పులు, సాదా బైనామాలు, కోర్టు కేసులు, ఒకరి భూములు మరొకరిపై నమోదు కావడం, పెండింగ్‌ మ్యుటేషన్‌ తదితర సమస్యలపై దరఖాస్తులు చేసుకున్నారు. మిస్సింగ్‌ సర్వే నంబర్లకు సంబంధించి 1,393 దరఖాస్తులు, పెండింగ్‌ మ్యుటేషన్‌కు 295 దరఖాస్తులు, డీఎస్‌ పెండింగ్‌లో 404 దరఖాస్తులు వచ్చాయి. భూమి విస్తీర్ణం, చేర్పులు మార్పులు సంబంధించి 2,093 దరఖాస్తులు వచ్చాయి. నిషేధిత జాబితాలో భూములు నమోదు అయినట్లు సవరించడానికి 270 దరఖాస్తులు వచ్చాయి. అసైన్డ్‌ భూములు, భూసేకరణ, ఇతర రికార్డులకు సంబంధించిన సమస్యలపై 3,489 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 1,675 సాదా బైనామాల సమస్యలపైనే దరఖాస్తులు వచ్చాయి. బోయిన్‌పల్లి మండలంలో 167, చందుర్తిలో 287, ఇల్లంతకుంటలో 200, గంభీరావుపేటలో192, కోనరావుపేటలో 136, ముస్తాబాద్‌లో 306, సిరిసిల్లలో 13, తంగళ్ళపల్లిలో 75, వేములవాడలో 92, వేములవాడ రూరల్‌లో 82, వీర్నపల్లిలో 49, ఎల్లారెడ్డిపేటలో 76 దరఖాస్తులు వచ్చాయి.

Updated Date - Apr 04 , 2026 | 01:50 AM