Share News

‘భట్టి’ బడ్జెట్‌పై ఆశలు

ABN , Publish Date - Mar 20 , 2026 | 01:01 AM

శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఇప్పటికే వాడీవేడిగా కొనసాగుతున్నాయి.

‘భట్టి’ బడ్జెట్‌పై ఆశలు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఇప్పటికే వాడీవేడిగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెడుతోంది. శుక్రవారం శాసనసభలో 2026-27 సంవత్సరానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఏ రంగానికి ఎన్ని నిధులు ఉంటాయనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ముఖ్యంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఏ స్థాయిలో బడ్జెట్‌ కరుణ చూపుతోందనే ఉత్కంఠ నేత కార్మికులు, యాజమాన్యాల్లో నెలకొంది. మరోవైపు జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో తొమ్మిదో ప్యాకేజీ, 11వ ప్యాకేజీ కాలువల నిర్మాణాలు ముందుకు సాగే విధంగా నిధులు సమకూరుతాయనే ఆశలతో ఉన్నారు. జిల్లాలో విద్యాసంస్థలు కూడా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్న సందర్భాలు ఉన్నాయి. చాలా చోట్ల రోడ్ల నిర్మాణం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి అడుగులు పడ్డాయి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2024 సంవత్సరం నవంబరులో దేవస్థానం అభివృధ్ధి పనులతో పాటు ఇతర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పనులు వేగంగా నడుసున్నాయి. మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌కు అనుసంధానంగా ఏర్పాటుకు గత పభుత్వంలో సిద్ధం చేసిన అక్వాహబ్‌ ప్రాజెక్ట్‌ పెండింగ్‌లోనే ఉండిపోయింది. మిడ్‌ మానేరు, అనంతారం ప్రాజెక్ట్‌ల కలయికతో పర్యాటక అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఐలాండ్‌ అభివృద్ధి పనులు ప్రతిపాదనలకే పరిమితం అయ్యాయి. మిడ్‌ మానేరు బ్యాక్‌ వాటర్‌లో ఏర్పాటు చేసిన జలవిహారంలో ఏర్పాటు చేసిన బోట్‌ ప్రారంభించిన ప్రజలకు అందుబాటులోకి రాలేదు. ఈసారైనా ప్రభుత్వ బడ్జెట్‌లో కొంత మేరకైనా పెండింగ్‌ పనులు ముందుకు సాగే విధంగా ఉంటుందని జిల్లా ప్రజలు భావిస్తున్నారు.

వర్కర్‌ టు ఓనర్‌ పథకానికి ఎదురుచూపులు..

సిరిసిల్ల శివారులో నేతన్నలకు ఉపాధికి వారధిగా ఉన్న అపెరల్‌ పార్కు, వీవింగ్‌ పార్కుల్లో నేత కార్మికులు, వస్త్ర ఉత్పత్తిదారులకు ఆశ, నిరాశలుగా మిగిలాయి. అపెరల్‌ పార్కులో యూనిట్లు ప్రారంభం అవుతుండగా కార్మికులను యజమానులుగా మార్చే వర్కర్‌ టు ఓనర్‌ పథకం కోసం నిరీక్షణ తప్పడం లేదు. గత సంవత్సరం మొదట్లో మరమగ్గాల యూనిట్లను స్థాపించే విధంగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినా ముందుకు కదలడం లేదు. గత ప్రభుత్వం చేపట్టిన వర్కర్‌ టు ఓనర్‌ పథకంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం, నిర్మాణం పూర్తిచేసుకున్న షెడ్లలో ఇతర సంస్థలకు లీజుకు ఇవ్వడంతో పవర్‌లూం కార్మికుల్లో పథకంపై ఆశలు సన్నగిల్లాయి. మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా రూ.386.88 కోట్ల పవర్‌లూం కార్మికులను యజమానులుగా మార్చే పథకాన్ని అమలు చేయడానికి సన్నాహాలతో సరిపెట్టింది. గత ప్రభుత్వం మరమగ్గాల కార్మికులను యజమానులుగా మార్చే దిశగా వర్కర్‌ టు ఓనర్‌ పథకాన్ని రూపకల్పన చేసింది. ఇందుకు అనుగుణంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారులోని పెద్దూరు వద్ద వీవింగ్‌ పార్కు నిర్మాణం చేపట్టారు. 42 వీవింగ్‌ షెడ్లు నిర్మాణం జరిగింది. కార్మికులకు నచ్చే విధంగా సెమీఅటోమెటిక్‌ మరమగ్గాలను నమూనాగా ఏర్పాటు చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రం మున్సిపల్‌ పరిధిలోని పెద్దూర్‌ వద్ద 88 ఎకరాల్లో రూ.374 కోట్లతో వీవింగ్‌ పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మొదటి విడతలో 1,104 మంది కార్మికులకు వర్క్‌షెడ్లను నిర్మించి అందించాలనే లక్ష్యంగా పనులు ప్రారంభించారు. రోడ్లు, నీటి వసతి, కరెంట్‌, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారు. 46 వర్క్‌షెడ్లను నిర్మించాలనే లక్ష్యంగా పెట్టుకోని నిర్మాణాలు 42 షెడ్లు పూర్తి చేశారు. ఇందులో కార్మికులకు మొదటి విడతలో 4,416 మరమగ్గాలను గ్రూప్‌ షెడ్ల కింద అందించనున్నారు. ఒక్కో కార్మికుడికి 800 చదరపు అడుగుల్లో స్టోర్‌రూంతో కలిపి అందిస్తారు. ఇందులో నాలుగు సెమీ అటోమేటిక్‌ మరమగ్గాలు, కండెలు చుట్టే యంత్రం ఇస్తారు. పార్కులో 60 వార్ఫిన్‌ మిషన్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఒక్కో యూనిట్‌ ధర రూ.8 లక్షలుగా ముందుగా నిర్ణయించారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.16.52 లక్షల వరకు చేరుకునే అవకాశం ఉంది. ఇందులో 10 శాతం లబ్ధిదారుడి వాటాధనం, 50 శాతం ప్రభుత్వ రాయితీ, 40 శాతం బ్యాంక్‌ రుణం ఉండే విధంగా పథకానికి రూపకల్పన చేశారు. సిరిసిల్లలో ఏర్పాటు చేస్తున్న వీవింగ్‌ పార్కులో కొందరికే మరమగ్గాల యూనిట్లు దక్కే అవకాశం ఉండడంతో మిగతా కార్మికులు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగంలో జియో ట్యాగింగ్‌ చేసిన మరమగ్గాలు 3,0352 ఉన్నాయి. వీటిపై 6,500 మంది పని చేస్తున్నారు. అనుబంధ పరిశ్రమల్లో మరో 6 వేల మంది వరకు పనిచేస్తున్నారు. ప్రభుత్వం మొదటి దశలో 1,104 మందికే యూనిట్లను అందించడంతో, మిగతా కార్మికులు నిరీక్షించే పరిస్థితి ఉంది.

టెక్స్‌టైల్‌ జోన్‌పై ఆశలు..

సిరిసిల్ల నేతన్నల దశాబ్దాల కల మెగా పవర్‌లూం క్లస్టర్‌. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఇతర రాష్ట్రాలకు మెగా క్లస్టర్‌లు ఇస్తున్నా సిరిసిల్ల నేత కార్మికులకు మాత్రం నిరాశను మిగిలిస్తూనే ఉంది. ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో మళ్లీ మెగా పవర్‌లూం క్లస్టర్‌పై నిరాశే మిగిలింది. ప్రతి సంవత్సరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌లపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా చివరకు నేతన్నలు చిన్నబోయే పరిస్థితి కలుగుతోంది. గతంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ సిరిసిల్ల వస్త్ర సంక్షోభ సమయంలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు సిరిసిల్లలో పర్యటించి టెక్స్‌టైల్‌ జోన్‌, మెగా పవర్‌లూం క్లస్టర్‌గా మార్చి అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. శాశ్వత ఉపాధికి పవర్‌లూం క్లస్టర్‌ దోహదపడుతుందని భావించారు. కేంద్ర ప్రభుత్వం హామీల మేరకు పరిమితమయ్యింది. తెలంగాణ ప్రభుత్వమైనా వరంగల్‌ తరహాలో భారీ టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు బడ్జెట్‌ ఊతమిస్తారని భావించారు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మారిపోయి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంవత్సర కాలంగా ఒడిదొడుకులను ఎదుర్కొంది. ప్రభుత్వం దృష్టి సారించడంతో వస్త్ర పరిశ్రమలో ఆశలు చిగురించాయి. 2024-25 బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం టెక్స్‌టైల్‌ జోన్‌ను తీసుకవస్తుందని భావించినా ఆరు గ్యారంటీల పథకాలతోనే సరిపెట్టింది. 2025-26లో రాష్ట్ర బడ్జెట్‌లో టెక్స్‌టైల్‌ జోన్‌ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆశాజనకమైన కేటాయింపులు ఉంటాయని భావించిన ప్రభుత్వ ఆర్డర్లతోనే సరిపెట్టింది. 2026-27 బడ్జెట్‌పై ఆశగా చూస్తున్నారు. సిరిసిల్ల మెగా పవర్‌లూం క్లస్టర్‌గా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాం నుంచి ప్రతిపాదనలు పంపిస్తూనే ఉన్నారు. 2013లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హాయంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావును సిరిసిల్లకు రప్పించిన ఎమ్మెల్యే కేటీఆర్‌ అప్పటి ఎంపీగా ఉన్న పొన్నం ప్రభాకర్‌లు మెగా పవర్‌లూం క్లస్టర్‌ హామీని పొందారు. అప్పటి బడ్జెట్‌లోనే ప్రకటిస్తారని ఆశించారు. కానీ నిరాశే మిగిలింది. 2004లో తంగళ్లపల్లి మండలం బద్దనపల్లి వద్ద 60ఎకరాల్లో టెక్స్‌టైల్‌ పార్కును రూ.7.73 కోట్లతో ఏర్పాటు చేశారు. టెక్స్‌టైల్‌ పార్కులో ఆధునిక మరమగ్గాలను స్థాపించారు. దేశ, విదేశీ మార్కెట్‌లో అమ్ముడుపోయే విలువైన వస్త్రాలను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్న పార్కులోకి అనుబంధ పరిశ్రమలు రాకపోవడంతో ఉత్పత్తుల్లో మార్పులు రాలేదు. సిరిసిల్లలో లోటెక్నాలజీ మరమగ్గాలపై ఆధునిక ఉత్పత్తులు చేయలేక తరచూ పరిశ్రమ సంక్షోభాన్ని చవిచూసింది. ఆత్మహత్యలు, సంక్షోభం నేపథ్యంలో సిరిసిల్లలో మార్పులు తీసుకరావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. అప్పటి కేంద్ర ప్రభుత్వం సిరిసిల్ల మెగా పవర్‌లూం క్లస్టర్‌ను ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మారిపోయి బీజేపీ ప్రభుత్వం రావడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. 2016 బడ్జెట్‌ సమయంలో మంత్రి కేటీఆర్‌ మూడుసార్లు ఢిల్లీకి వెళ్లి, అప్పటి చేనేత జౌళిశాఖ మంత్రి సంతోష్‌ గంగువార్‌లను కలిసి వస్త్ర పరిశ్రమ సమస్యలను వివరించారు. మెగా పవర్‌లూం క్లస్టర్‌ ప్రతిపాదనలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి పంపించామని తెలపడంతో ఆ బడ్జెట్‌లో పవర్‌లూం క్టస్టర్‌ చోటు దక్కుతుందని భావించారు. మొదటి విడతలో దేశంలో ఐదు మెగా క్లస్టర్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా సిరిసిల్లకు చోటు దక్కలేదు. 2017 బడ్జెట్‌ సమయంలో అప్పుడు చేనేత జౌళి శాఖ మంత్రిగా ఉన్నా కేటీఆర్‌, అప్పటి ఎంపీ వినోద్‌లు చేనేత జౌళి శాఖ మంత్రి స్మృతిఇరానీని కలిసి మెగా పవర్‌లూం క్లస్టర్‌ను సాధించుకునే విధంగా చర్యలు చేపట్టారు. కానీ ఆ బడ్జెట్‌లో కూడా మోక్షం లభించలేదు. అదేక్రమంలో 2018, 2019, 2020, 2021, 2022, 2023, 2024, 2025, 2026 బడ్జెట్‌లో కూడా అదే పరిస్థితి ఎదురైంది. ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్‌లో సిరిసిల్ల వస్త్రోత్పత్తికి భారీగా కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై అవగాహన ఉన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌ అది శ్రీనివాస్‌లు ఆ దిశగా కృషి చేస్తారని భావిస్తున్నారు.

ప్రభుత్వ అర్డర్లతో ఊరట..

సంక్షోభంలో విలవిలలాడిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ గడిచిన సంవత్సర కాలంగా ప్రభుత్వ అందించిన ఆర్డర్లతో కొంత ఊరట లభించింది. ఇందిరా మహిళా శక్తి పథకంలో స్వశక్తి మహిళలకు ఉచితంగా యూనిఫామ్‌ చీరల ఉత్పత్తిని సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు ఇవ్వడంతో కార్మికులకు చేతినిండా పని లభించింది. సిరిసిల్లలోని మ్యాక్స్‌ సంఘాల ద్వారా 6.86 కోట్ల మీటర్ల స్వశక్తి చీరల వస్త్ర ఉత్పత్తి జరిగింది. ఇప్పటికే చీరలు గ్రామీణ ప్రాంతాల్లోని స్వశక్తి మహిళలకు ఒక చీర చొప్పున పంపిణీ చేశారు. మున్సిపల్‌ పరిధిలో పంపిణీ జరగాల్సి ఉంది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు చీరల చొప్పున పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఆర్డర్ల కోసం నేత కార్మికులు ఎదురుచూస్తున్నారు. దీంతోపాటు సమగ్ర శిక్ష శాఖకు అవసరమైన విద్యార్థులకు యూనిఫామ్‌ వస్త్ర ఆర్డర్లు కూడా లభించాయి. దీంతోపాటు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 84.96 లక్షల మీటర్ల బట్ట ఉత్పత్తి ఆర్డర్లు కేటాయించారు. ప్రభుత్వ అందిస్తున్న ఆర్డర్లు నేత కార్మికులకు ఉపాధి లభిస్తోంది. ఈ బడ్జెట్లో వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ఇతర శాఖల ఆర్డర్ల కేటాయింపులకు ఊతమిస్తుందని భావిస్తున్నారు.

Updated Date - Mar 20 , 2026 | 01:01 AM