Share News

నామినేటెడ్‌ పదవులపై ఆశలు

ABN , Publish Date - Feb 25 , 2026 | 01:10 AM

నామినేటెడ్‌ పోస్టుల భర్తీ కోసం కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంతో ఆ పార్టీ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మార్చి 15 నాటికి నామినేటెడ్‌ పోస్టులతోపాటు పార్టీ పదవులన్నిటినీ భర్తీ చేస్తామని టీపీ సీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ ప్రకటించడంతో ఆయా పదవులపై ఆశలు పెంచుకున్న వారు మళ్లీ నాయకుల ఆశీస్సుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.

నామినేటెడ్‌ పదవులపై ఆశలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

నామినేటెడ్‌ పోస్టుల భర్తీ కోసం కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంతో ఆ పార్టీ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మార్చి 15 నాటికి నామినేటెడ్‌ పోస్టులతోపాటు పార్టీ పదవులన్నిటినీ భర్తీ చేస్తామని టీపీ సీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ ప్రకటించడంతో ఆయా పదవులపై ఆశలు పెంచుకున్న వారు మళ్లీ నాయకుల ఆశీస్సుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రభుత్వ, పార్టీ పరంగా నామినేటెడ్‌ పదవులు భర్తీ చేస్తామంటూ ఇప్పటికే పలుమార్లు ప్రకటించడం, వాయిదా వేయడం జరుగుతుండడంతో కార్యకర్తల్లో కొంత నిరాశ చోటుచేసుకొంది. మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇటీవల పార్టీ అధిష్టాన వర్గం ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రులతో సమావేశం జరిపారు. టీపీసీసీ అధ్యక్షుడు మార్చి 15లోగా పార్టీ పదవులను, నామినేటెడ్‌ పదవులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈసారి ఈ ప్రక్రియ వాయిదా పడకపోవచ్చనే నమ్మకం కార్యకర్తల్లో కలిగింది.

జిల్లాలో డీసీసీ, లైబ్రరీ చైర్మన్‌ లాంటి కీలక పదవులు ఇప్పటికే భర్తీ అయ్యాయి. జిల్లా కాంగ్రెస్‌ కార్యవర్గం భర్తీ చేయాల్సి ఉన్నది. అలాగే లైబ్రరీ కమిటీ సభ్యుల నియామకం చేపట్టాల్సి ఉన్నది. వీటన్నిటి భర్తీతో కనీసం 50 నుంచి 60 మందికి పైగా పదవులు పొందే అవకాశం ఉన్నది. రాష్ట్రస్థాయి పదవుల్లో జిల్లాకు చెందిన హర్కార వేణుగోపాల్‌రావుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా, జనక్‌ప్రసాద్‌ తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్‌, డీసీసీ అధ్యక్ష పదవి రెండోసారి రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌కు దక్కింది. జిల్లాలో గల ఎనిమిది మార్కెట్‌ కమిటీల పాలకవర్గాల పదవులు కూడా భర్తీ అయ్యాయి. ఇటీ వల నూతనంగా ఎలిగేడులో మార్కెట్‌ కమిటీ ఏర్పాటైంది. దీనికి పాలక వర్గాన్ని త్వరలోనే ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. చైర్మన్‌ డైరెక్టర్‌ పదవులను దక్కించుకునేందుకు పలువురు నాయకులు ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నారు.

ధర్మారం, పెద్దపల్లి, జూలపల్లి, కాల్వశ్రీరాంపూర్‌, సుల్తానాబాద్‌ మార్కెట్ల పదవీ కాలం సెప్టెంబరుతో పూర్తి కావస్తున్నాయి. దీంతోపాటు వీటి కోసం కూడా ఇప్పటి నుంచే కొందరు నాయకులు ప్రయత్నాలు ఆరంభించారు. ఈ పదవులకు రాజకీయ వర్గాల్లో డిమాండ్‌ ఉన్నది. అంతేగాకుండా పౌర సరఫరాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి కూడా రెండేళ్లుగా ఖాళీగా ఉన్నది. గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి రవీందర్‌ సింగ్‌ కు ఆ పదవిని కట్టబెట్టారు. ఉమ్మడి జిల్లాలో అత్యధిక రైస్‌మిల్లులు గల జిల్లాగా పెద్దపల్లి ఉంది. ఈ పదవిని పెద్దపల్లి జిల్లాకు చెందిన వారికే ఇవ్వాలని పార్టీ నాయకులు కోరుతున్నారు. నామినేటెడ్‌ పదవుల కోసం మాజీ జడ్పీటీసీ సభ్యుడు చొప్పరి సదానందం, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్‌, టీపీసీసీ బీసీ సెల్‌ రాష్ట్ర నాయకులు భూషణవేణి రమేష్‌, మాజీ ఎన్‌ఎస్‌యుఐ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పెద్ది ప్రకాష్‌, తదితరులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబుపై ఆశలు పెట్టుకున్నారు.

జిల్లాలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలలో అత్యధిక స్థానాలు సాధించడంతో కాంగ్రెస్‌ పార్టీ నేతలు సంతోషంగా ఉన్నారు. పార్టీ క్షేత్ర స్థాయిలో శ్రేణులు కూడా ఉత్సాహంగా ఉంటేనే మరిన్ని మంచి ఫలితాలు సాధించవచ్చని భావిస్తున్న అధిష్టానవర్గం పార్టీ కమిటీల నియామకాల ద్వారా నామినేటెడ్‌ పదవులను ఔత్సాహిక, క్రియాశీల కార్యకర్తలకు అవకాశం కల్పించాలని భావిస్తున్నది. ఈ పదవుల భర్తీ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నందున గ్రామాల్లో పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంతో పని చేసి విజయాన్ని చేకూరుస్తారని నాయకత్వం ఆశిస్తున్నది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీసీ) ఎన్నికలు కూడా జరగాల్సి ఉన్నది. వీటిల్లో కూడా పార్టీ ఆధిప త్యం చాటుకోవడానికి గ్రామ స్థాయిలో పనిచేసే కార్యకర్తలు, నాయకులే కీలకంగా వ్యవహరించే అవకాశమున్నందున వారిలో నెలకొన్న నిరాశ నిస్పృహలను నామినేటెడ్‌ పదవుల భర్తీ ద్వారా తొలగించాలని అధిష్టాన వర్గం ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. త్వరలోనే ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలుస్తుండడంతో ఆయా నియోజకవర్గాల్లో నామినే టెడ్‌ పార్టీ పదవులు ఆశిస్తున్న వారు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి పేరు పరిశీలనకు తీసుకోవాలని కోరుతున్నట్లు సమాచారం. పార్టీ నాయకత్వం ఇప్పటికే ఆయా స్థాయిల్లో చురుగ్గా పని చేసే నాయ కులు, శ్రేణుల సమాచారాన్ని సేకరించింది. తాజాగా మరోసారి పరిశీలన జరిపి పదవులు భర్తీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నది.

Updated Date - Feb 25 , 2026 | 01:10 AM