మానేరు రివర్ ఫ్రంట్‌పై ఆశలు
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:19 AM
కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్‌పై మంత్రులు సమీక్ష నిర్వహించి, ప్రాజెక్టును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించడంతో జిల్లా ప్రజలకు ఆశలు చిగురిస్తున్నాయి. ఆదివారం అసెంబ్లీ హాల్‌లో మానేరు రివర్ ఫ్రంట్‌పై ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు.
కరీంనగర్ టౌన్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్‌పై మంత్రులు సమీక్ష నిర్వహించి, ప్రాజెక్టును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించడంతో జిల్లా ప్రజలకు ఆశలు చిగురిస్తున్నాయి. ఆదివారం అసెంబ్లీ హాల్‌లో మానేరు రివర్ ఫ్రంట్‌పై ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్, టూరిజంశాఖల అధికారులు పాల్గొన్నారు. మానేరు రివర్‌ఫ్రంట్ పనుల పురోగతి, పెండింగ్ నిధులు, ప్రాజెక్టు పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. ప్రస్తుతం మానేరు రివర్ ఫ్రంట్ క్షేత్రస్థాయి నివేదికలను కలెక్టర్, ఉన్నతాధికారులతో పరిశీలించారు. ఏప్రిల్‌లో మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. భూ సేకరణ, అంచనా వ్యయం, నీటి పారుదల, పర్యాటక శాఖకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.
ఫ రూ. 540 కోట్ల మంజూరు : ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్‌కు బీఆర్‌ఎస్ హయాంలోనే 540 కోట్లు మంజూరు చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. రాష్ట్ర పర్యాటకశాఖ నుంచి 100 కోట్లు, 440 కోట్లు నీటి పారుదల శాఖ నుంచి మంజూరయ్యాయన్నారు. హైదరాబాద్‌లో మూసీ రివరఫ్రంట్ చేపడుతున్నందున కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ పూర్తయ్యేందకు చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, జిల్లా మంత్రులను కోరామని తెలిపారు. వారు ఆదివారం హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో తాను సమీక్షలో పాల్గొనలేదని చెప్పారు. ఏప్రిల్‌లో మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి, సమీక్ష నిర్వహిస్తారన్నారు. మానేరు రివర్‌ఫ్రంట్‌కు భూసేకరణ పూర్తిచేసి గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను విడుదల చేసి పనులు వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.