అధికార పార్టీ నేతల్లో ‘సహకార’ ఆశలు
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:47 AM
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) పదవులు అధికార పార్టీ నేతల్లో మళ్లీ ఆశలు పెంచాయి.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) పదవులు అధికార పార్టీ నేతల్లో మళ్లీ ఆశలు పెంచాయి. సహకార పదవుల భర్తీ విషయంలో ఎన్నికలు లేక నామినేటెడ్ పద్ధతి అవలంబిస్తారా అనే విషయానికి తెరదించుతూ ప్రభుత్వం మార్కెట్ కమిటీల తరహాలో వ్యవసాయ సహకార సంఘాలకు నామినేటెడ్ పాలకవర్గాలను నియమిస్తోంది. గతంలో నామినేటెడ్ పద్ధతిని ముందుకు తీసుకువచ్చిన పాత పాలకవర్గాలు హైకోర్టు ఆశ్రయించడంతో ఎన్నికలు నిర్వహించాలని లేని పక్షంలో పాత పాలకవర్గాలను కొనసాగించే విధంగా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో అధికార కాంగ్రెస్ నేతల్లో నిరాశ మిగిలింది. 2025 డిసెంబర్ 19న ప్రభుత్వం డీసీసీ బ్యాంక్, వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేసింది. ప్రభుత్వ అధికారులను పర్సన్ ఇన్‌చార్జిలుగా నియమించింది. పీఏసీఎస్ ఆశ్రయించడం వారికి అనుకూలంగా తీర్పురావడంతో తిరిగి పదవుల్లో కొనసాగారు. ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా సహకార పదవుల భర్తీకి చకచకా నియమకాలు చేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్‌తో పాటు యాదాద్రి, వరంగల్, వికారాబాద్ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నామినేటెడ్ పాలకవర్గాలను నియమించింది. ఇదే తరహాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 24 సొసైటీలకు పాలకవర్గాలను నియమించడానికి కసరత్తు ప్రారంభించింది. దీంతో అధికార పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలోని సొసైటీలకు పాలకవర్గాల నియామకాలకు సంబంధించి ఇప్పటికే కొన్ని పేర్లు ఖరారు అయినట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లోనే నామినేటెడ్ నియామక ఉత్తర్వులు వెలువడుతాయని భావిస్తున్నారు.
కాంగ్రెస్‌లో సందడి..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నామినేట్ పద్ధతిలో పదవులు భర్తీ చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీలో సందడి మొదలైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడిచిపోతున్నా పదవులు లేక అసంతృప్తిలో నేతలు ఉన్నారు. సహకార పదవుల భర్తీ మొదలు కావడంతో ఇతర నామినేటెడ్ పదవులపై నేతల్లో ఆశలు పెరిగాయి. గ్రామస్థాయి నుంచి ఆశావహులు సహకార సంఘాల పదవులపై దృష్టి పెట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దల వరకు పదవులు దక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
జిల్లాలో 24 సొసైటీలు.. 312 మందికి పదవులు..
అధికార పక్షానికిసహకారం అందించే దిశగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 24 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నామినేటెడ్ పాలక వర్గాల ద్వారా 312 మందికి పదవుల యోగం కలగనుంది. సహకార చట్టం ప్రకారం ప్రతి సొసైటీకి 13 మందితో పాలకవర్గం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒకరు చైర్మన్, ఒక వైస్‌చైర్మన్, 11 మంది డైరెక్టర్లు ఉంటారు. ఎస్సీ మహిళా, ఎస్టీ జనరల్, బీసీ జనరల్‌కు మూడు డైరెక్టర్ పోస్టులను కేటాయించాల్సి ఉంటుంది. ఇదే మాదిరిగా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, జిల్లా సహకార మార్కెటింగ్ సమాఖ్య, మార్క్‌ఫెడ్, టెస్కాబ్ పాలవర్గాలు కూడా నియమిస్తారు. ప్రభుత్వం మాత్రం సొసైటీలో సభ్యత్వం ఉన్నవారిని నామినేటెడ్ చేసే ఆలోచనలు ఉండడంతో సొసైటీలో అధికార పార్టీకి చెందిన సభ్యులు ముందుకు వస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 24 సంఘాల పరిధిలో 74728 మంది సభ్యులు ఉన్నారు. సిరిసిల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో 12,859 మంది సభ్యులు ఉండగా, పెద్దూరు సొసైటీలో 1,336 మంది, నేరెళ్ల సొసైటీలో 1,257 మంది, కోనరావుపేట సొసైటీలో 6,196 మంది, కొలనూరు సొసైటీలో 3,018 మంది, వేములవాడ సొసైటీలో 8,180 మంది, నాంపెల్లి సొసైటీలో 1,191 మంది, రుద్రవరం సొసైటీలో 998 మంది, చందుర్తి సొసైటీలో 3,369 మంది, సనుగుల సొసైటీలో 1,733 మంది, బోయినిపల్లి సొసైటీలో 910 మంది, కోరెం సొసైటీలో 1,694 మంది, మాన్వాడ సొసైటీలో 1,163 మంది, నర్సింగాపూర్ సొసైటీలో 1,684 మంది, ఇల్లంతకుంట సొసైటీలో 3,547 మంది, గాలిపెల్లి సొసైటీలో 1,680 మంది, ముస్తాబాద్ సొసైటీలో 2,082 మంది, పోత్గల్ సొసైటీలో 7,169 మంది, గంభీరావుపేట సొసైటీలో 8,183 మంది, కొత్తపెల్లి సొసైటీలో 3,680 మంది, ఎల్లారెడ్డిపేట సొసైటీలో 3,864 మంది, అల్మాస్‌పూర్ సొసైటీలో 2,139 మంది, తిమ్మాపూర్ సొసైటీలో 1,597 మంది, మానాల సొసైటీలో 199 మంది సభ్యులు ఉన్నారు.
వ్యాపార రంగాల్లోకి సహకార సంఘాలు..
వ్యవసాయ సహకార పరపతి సంఘాల బలోపేతం వైపు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సహకార రంగంలో వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా రైతులకు విస్తృత సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంది. సహకార పరపతి సంఘాలను పునర్విభజన చేసే కార్యక్రమాలు జరుగుతుండగానే వ్యాపార రంగాల్లోకి సహకార సంఘాలను తీసుకవచ్చే దిశగా పరపతి సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్చుతోంది. ప్రస్తుతం సహకార సంఘాల ద్వారా విత్తనాలు, ఎరువుల విక్రయాలతో పాటు ధాన్యం కొనుగోళ్లతో లాభాలు అర్జిస్తున్నాయి. వీటి స్థానంలోనే రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా ఏర్పాటు చేసి ఇతర వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే దిశగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 311 వ్యవసాయ సహకార పరపతి సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్పులు చేసింది. దీని ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని వ్యవసాయ పనిముట్లు అందుబాటులోకి తేవడం, ఇతర రంగాల్లోనూ అడుగుపెట్టే దిశగా చర్యలు చేపట్టింది. జిల్లాలో 24 వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో తొలివిడతగా ఆరు సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్పులు చేసింది.. జిల్లాలో వేములవాడ, సనుగుల, నాంపల్లి, అల్మాస్‌పూర్, గంభీరావుపేట, ఇల్లంతకుంట సహకార సంఘాలను రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్పులు చేసి సేవలు అందించనున్నారు. ఈ సంస్థల్లో వాటాదారులుగా చేర్చుకుంటారు. సభ్యులు తమ వాటాకు అనుగుణంగా ఈక్విటీగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఈ సొసైటీలకు ఈక్విటీ వాటాగా కేంద్ర ప్రభుత్వం రూ.15 లక్షల వరకు ఒక్కో సొసైటీకి మ్యాచింగ్ గ్రాంట్ కింద అందిస్తుంది. మూడు సంవత్సరాల నిర్వహణకు ఏడాదికి రూ.6 లక్షల చొప్పున రూ.18 లక్షలు ఇస్తుంది. ప్రస్తుతం సహకార శాఖ అధికారులు ఉద్యోగులకే రైతు ఉత్పత్తి సంస్థల బాధ్యతలను అప్పగించనుంది. ఈ పథకానికి సంబంధించి ప్రత్యేక క్రెడిట్ గ్యారంటీ కింద నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. ఎన్‌సీడీసీ, నాబార్డ్ ద్వారా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకరానున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సహకార సంఘాలు వేర్వేరు లక్ష్యాలతో ఉన్న ఇవి రెండు ఒకేరకమైన సంస్థలుగా పనిచేస్తాయి. ఎఫ్‌ఫీవోలు ప్రధానంగా రైతుల ఆదాయం పెంచడానికి ఉత్పత్తులు పెంచడానికి, ప్రాసెసింగ్ చేయడంపై దృష్టి పెడతారు. రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చే దిశగానే రైతు ఉత్పత్తి సంస్థలు పనిచేస్తాయి. సంస్థల ఏర్పాట్లకు ప్రభుత్వం రూ.18.96 లక్షలు అందించింది.