Share News

ఆశలు సజీవం..

ABN , Publish Date - Jul 30 , 2026 | 01:22 AM

జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైతుల ఆశలు సజీవంగా నిలుస్తున్నాయి. ఈసీజన్‌లో వర్షాలకోసం ఎదురుచూస్తున్న రైతన్నలకు ఈ వర్షాలు ఊరటనిచ్చాయి.

  ఆశలు సజీవం..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైతుల ఆశలు సజీవంగా నిలుస్తున్నాయి. ఈసీజన్‌లో వర్షాలకోసం ఎదురుచూస్తున్న రైతన్నలకు ఈ వర్షాలు ఊరటనిచ్చాయి. జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం వరకు 84.0మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా కమాన్‌పూర్‌ మండలంలో 141.4మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ వర్షాలతో వాగులు, వంకలు, హుస్సేనిమియా పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరడంతో మత్తడులు దూకుతున్నాయి. గోదావరిఖని ప్రాంతంలో గల సింగరేణి ఓసీపీ గనుల్లోకి వర్షం నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టులోకి సాయంత్రం వరకు 75,328 క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో ప్రాజెక్టు నీటి మట్టం 11.110టీఎంసీలకు చేరుకున్నది. అలాగే అక్కడి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నంది పంప్‌హౌస్‌లోని నాలుగు మోటార్లను ఆన్‌ చేసి మిడ్‌మానేరుకు 12,600క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. ఈ వర్షాలతో ఖరీఫ్‌లో పంటల సాగుకు డోకా ఉండదనే ధీమాతో రైతులు ఉన్నారు.

ఫ కమాన్‌పూర్‌లో 141.4 మిల్లీ మీటర్ల వర్షం..

జిల్లాలో అత్యధికంగా కమాన్‌పూర్‌ మండలంలో 141.4మిల్లీమీటర్లవర్షం కురిసింది. రామగుండం మండలంలో 129.3మిల్లీమీటర్లు, పాలకుర్తి మండలంలో 117.4, రామగిరి మండలంలో 108.0, అంతర్గాం మండలంలో 101.2, ధర్మారం మండలంలో 97.8, పెద్దపల్లి మండలంలో 88.4మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మంథని మండలంలో 83.7, ఎలిగేడు మండలంలో 62.6, కాల్వశ్రీరాంపూర్‌ మండలంలో 60.5, జూలపల్లి మండలంలో 52.1, ముత్తారం మండలంలో 47.3, ఓదెల మండలంలో 43.7, సుల్తానాబాద్‌ మండలంలో 42.5మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

ఫ సింగరేణిలో నిలిచి బొగ్గు ఉత్పత్తి..

వర్షాల వల్ల సింగరేణిలో ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. ఆర్‌జీ3 పరిధిలోని ఓసీపీ2లోకి వరద నీరు చేరడంతో అప్రోచ్‌ రోడ్డు తెగిపోయి 3సిమ్‌లో 17మంది కార్మికులు చిక్కుకున్నారు. రోడ్డు పునరుద్ధరణ చర్యలు చేపట్టడంతో కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. రెండు గంటల పాటు ఉత్కంఠకు గురయ్యారు. రోడ్డు రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని నాలుగు నాలాలు పొంగి పొర్లుతున్నాయి. ఎక్స్‌కావటేర్‌లతో కాలువలు తీసి వరద నీటిని గోదావరిలోకి మళ్లించారు. వీర్నపల్లి వైపు గల ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్రహరీ కూలడంతో గ్రామంలోకి పెద్దఎత్తున నీళ్లు వచ్చాయి. సప్తగిరికాలనీలో గల రాజ్యలక్ష్మి రహదారి పక్కన గల మెడికల్‌ కళాశాల ప్రహరీ కూలిపోవడంతో పక్కనే ఉన్న ఇల్లు పాక్షికంగా కూలిపోయింది. మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది. పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. మండలంలోని బొంపెల్లి, రాగినేడు, అప్పన్నపేట గ్రామాల చెరువులు నిండి మత్తళ్లు దూకుతున్నాయి. పెద్దపల్లి పట్టణ శివారులో గల డబుల్‌ బెడ్‌ రూముల ఇళ్ల కాలనీకి వరద నీరు చేరింది.

ఫ శ్రీపాద ఎల్లంపల్లికి పెరుగుతున్న వరద..

జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20.175టీఎంసీలకు గాను, 11.110 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఎగువప్రాంతం నుంచి సాయంత్రం 6గంటల వరకు 75328 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నది. ఉదయం 6గంటల వరకు 11,735క్యూసెక్కులు, 9గంటల వరకు 44,665క్యూసెక్కులు, మధ్యాహ్నాం 12గంటల వరకు 56,497క్యూసెక్కులు, 3గంటల వరకు 66,126 క్యూసెక్కులు, సాయంత్రం 6గంటల వరకు 75,328క్యూసెక్కుల వరద నీరు వస్తున్నది. వర్షాలు మరో రెండు రోజుల పాటు ఇలాగే కురిస్తే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోనున్నది. భారీ వర్షాలు కురుస్తుండడంతో కాళేశ్వరం ప్రాజెక్టు నంది పంప్‌హౌస్‌ నుంచి నాలుగు మోటార్ల ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని గాయత్రి పంప్‌హౌస్‌కు అక్కడి నుంచి మిడ్‌ మానేరుకు తరలిస్తున్నారు.

Updated Date - Jul 30 , 2026 | 01:22 AM