మద్దతు ధరపై పత్తి రైతుల్లో ఆశలు
ABN , Publish Date - Oct 23 , 2026 | 12:19 AM
పత్తి పంటకు మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
పెద్దపల్లి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): పత్తి పంటకు మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పత్తి కొనుగోళ్ల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం 51 వేల ఎకరాలకు పైగా ఉండటంతో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర అందించడంపై అధికారులు దృష్టి సారించారు. పత్తి విక్రయాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో సీసీఐ ద్వారా నాలుగు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఫ రైతులకు అందుబాటులో కొనుగోళ్శు
పెద్దపల్లి మార్కెట్ పరిధిలో రెండు, సుల్తానాబాద్‌లో ఒకటి, కమా న్‌పూర్‌లో మరొకటి చొప్పున మొత్తం నాలుగు పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలు, తేమ శాతం తదితర నిబంధనల ప్రకారం పత్తిని కొనుగోలు చేయనున్నారు. రైతులు దళారుల ప్రమేయం లేకుండా నేరుగా కేంద్రాలకు పత్తిని తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మార్కెట్ ధరలపై రైతుల ఆశలు
ప్రస్తుతం పత్తికి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ ఉండటంతో తెలంగాణలోని పలు వ్యవసాయ మార్కెట్లలో ధరలు పెరుగుతున్నాయి. ఈనెల 16న రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో పత్తి ధరలు క్వింటాల్‌కు రూ.5 వేల నుంచి రూ.9500 వరకు నమోదయ్యాయి. కొన్ని మార్కెట్లలో సాధారణంగా లావాదేవీలు జరిగిన ధరలు రూ.9 వేల స్థాయిలో ఉన్నాయి. అయితే పత్తి రకం, నాణ్యత, తేమ శాతం, మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ధరల్లో వ్యత్యాసం ఉంటోంది. మరోవైపు, ప్రస్తుత 2026-27ఖరీఫ్ సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం మధ్యస్థాయి పత్తికి క్వింటాల్‌కు రూ.8,267, పొడవు పింజ పత్తికి రూ.8667గా కనీస మద్దతు ధరలను నిర్ణయించింది. ప్రైవేటు వ్యాపారులు కొన్ని చోట్ల మద్దతు ధరకు మించి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో రైతులు మార్కెట్ ధరలను పరిశీలించడంతోపాటు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో లభించే మద్దతు ధరను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఫ నిబంధనలు పాటిస్తేనే మద్దతు ధర
కొనుగోలు కేంద్రాల్లో పత్తిని విక్రయించే రైతులు నాణ్యతా ప్రమాణాలపై అవగాహన కలిగి ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పత్తిలో తేమ శాతం అనుమతించిన పరిమితిలో ఉండేలా చూసుకోవాలి. పత్తిని ఆరబెట్టి, చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేసి కేంద్రాలకు తీసుకురావాలి. రైతులు తమ పట్టాదారు, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు అందుబాటులో ఉంచుకోవాలి. కొనుగోలు ప్రక్రియకు సంబంధించి నిబంధనలు, నమోదు విధానాలను సంబంధిత అధికారుల వద్ద తెలుసుకోవాలి. పత్తి ధరలు పెరుగుతున్న సమయంలో రైతులు తొందరపడి తక్కువ ధరకు పంటను విక్రయించకుండా, అందుబాటులో ఉన్న మార్కెట్ ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని వ్యవసాయ మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. అయితే పత్తిని ఎక్కువకాలం నిల్వ ఉంచడం వల్ల తేమ, నాణ్యత తగ్గే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని. మార్కెట్‌లో లభించే ధర, ప్రభుత్వ మద్దతు ధర, పత్తి నాణ్యత, రవాణా ఖర్చులను బేరీజు వేసుకుని విక్రయించడం రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అధికారులు సూచిస్తున్నారు.
ఫ రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
పత్తి సాగు చేస్తున్న రైతులకు నాలుగు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఉపయోగకరంగా మారనుంది. ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని, కొనుగోలు నిబంధనలపై ముందుగానే అవగాహన పెంచుకోవాలని అధికారులు కోరుతున్నారు. పత్తి కొనుగోళ్ళకు సంబందించి రైతుల సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నంబరు 18005995779 ను సంప్రదించవచ్చు.