Share News

పల్లెల్లో నిరీక్షణ.. బల్దియాల్లో సందడి

ABN , Publish Date - Apr 12 , 2026 | 01:55 AM

పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి ముగిసి మూడు నెలలు గడిచిపోయింది. పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరి పల్లెలో కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. మున్సిపల్‌, గ్రామ పాలకవర్గాలకు సలహాలు, సూచనలు ఇవ్వడం కోసం సభ్యులకు అవకాశం కల్పిస్తారు. మున్సిపల్‌, గ్రామపంచాయతీలో పాలకవర్గాలు కొలువుతీరిన రెండు నెలల్లో కో ఆప్షన్‌ సభ్యుల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.

పల్లెల్లో నిరీక్షణ.. బల్దియాల్లో సందడి

- కో-ఆప్షన్‌ పదవులకు ఎదురుచూపులు

- ప్రతి పంచాయతీలో ముగ్గురికి అవకాశం

- వార్డు సభ్యులతో సమానంగా హోదా

- రేపు సిరిసిల్ల మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి ముగిసి మూడు నెలలు గడిచిపోయింది. పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరి పల్లెలో కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. మున్సిపల్‌, గ్రామ పాలకవర్గాలకు సలహాలు, సూచనలు ఇవ్వడం కోసం సభ్యులకు అవకాశం కల్పిస్తారు. మున్సిపల్‌, గ్రామపంచాయతీలో పాలకవర్గాలు కొలువుతీరిన రెండు నెలల్లో కో ఆప్షన్‌ సభ్యుల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ మూడు నెలలు గడిచిపోయినా పంచాయతీల్లో కోఆప్షన్‌ పదవులు కనిపించడం లేదు. మున్సిపాలిటీల్లో మాత్రం కో ఆప్షన్‌ పదవుల సందడి మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు ఉండగా సిరిసిల్లలో నాలుగు కోఆప్షన్‌ పదవులకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. నాలుగు కోఆప్షన్‌ పదవులకు 12 మంది దరఖాస్తు చేసుకున్నారు. సిరిసిల్ల బల్దియాపై బీఆర్‌ఎస్‌ జెండా ఎగరడంతో కోఆప్షన్‌ పదవుల ఎంపిక కూడా లాంఛనంగానే మారింది. కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక కోసం ఈ నెల 13న సిరిసిల్ల మున్సిపల్‌ కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కోఆప్షన్‌ పదవుల కోసం బీఆర్‌ఎస్‌లో పోటీ పెరిగింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. మాజీ కౌన్సిలర్లు నంది శంకర్‌, కొండ అనూషలతో పాటు మైనార్టీ విభాగంలో సయ్యద్‌ తస్లీమా, సయ్యద్‌ సోహెల్‌లను ఇప్పటికే పార్టీ పెద్దలు ప్రకటించడంతో ఆశావాహుల్లో నిరాశ పెరిగింది. ప్రత్యేక సమావేశం వరకు మార్పులు జరుగుతాయని ఆశతో దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. మున్సి పాలిటీల్లో కోఆప్షన్‌ ఎంపిక ఉత్కంఠగా మారుతుండగా గ్రామపంచాయతీలో కోఆప్షన్‌ సభ్యుల పదవులపై స్పష్టత కనిపించడం లేదు.

జిల్లాలో 260 పంచాయతీలు..780 మందికి అవకాశం

జిల్లాలో 260 గ్రామపంచాయతీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహిం చారు. 260 గ్రామపంచాయతీలో 27 గ్రామపంచాయతీలు, 2,268 వార్డుల్లో 668 మంది సభ్యులు ఏకగ్రీవమయ్యారు. ఉపసంహరణలు, ఏకగ్రీవాల సమయంలో కో ఆప్షన్‌ పదవుల ఆశలు చూపి అభ్యర్థులను పోటీ నుంచి తప్పించిన సంద ర్భాలు ఉన్నాయి. కోఆప్షన్‌ సభ్యుల నియామకానికి సంబంధించిన షెడ్యూల్‌ నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తునే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిల బెట్టుకోవాలని కొందరు, గెలుపునకు సహకరించామని మరికొందరు కోఆప్షన్‌ పదవులను ఆశిస్తున్నారు.

- నేతల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు

ప్రజల భాగస్వామ్యం పెంపొందించేందుకు స్థానిక పాలకవర్గాల్లో కో ఆప్షన్‌ సభ్యులుగా వివిధ వర్గాల నుంచి ముగ్గురిని ఎన్నుకుంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామపంచాయతీలు ఉండగా కో ఆప్షన్‌ సభ్యులుగా 780 మందికి అవకాశం ఉంటుంది. కోఆప్షన్‌ సభ్యులలో గతంలో గ్రామపంచాయతీలో పాలకవర్గాల్లో పని చేసిన వారు, ఉద్యోగ విరమణ చేసినవారు, సీనియర్‌ సిటిజన్లు, ఎన్‌ఆర్‌ఐలు, ఇలా గ్రామాభివృద్ధికి కృషి చేసిన వారిలో ముగ్గురిని సభ్యులుగా ఎన్నుకుంటారు. గ్రామ సమైక్య అధ్యక్షురాలు ఒకరు ఉంటారు. కోఆప్షన్‌ సభ్యుడికి వార్డు సభ్యులతో సమాన హోదా, ప్రొటోకాల్‌ ఉంటుంది. చర్చల్లో పాల్గొనడం సూచనలు ఇవ్వడం చేయవచ్చు. తీర్మానంపై ఓటు వేసే హక్కు వీరికి ఉండదు. గ్రామపంచాయతీలో కోఆప్షన్‌ సభ్యుల స్థానాల భర్తీకి ప్రభుత్వం ఇంకా ఉత్తర్వులు వెల్లడించకపోయిన గ్రామాల్లో మాత్రం పదవులు దక్కించుకోవడానికి ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామపంచాయతీ పాలకవర్గాల చుట్టూ తిరగడంతో పాటు ఆయా పార్టీల ముఖ్య నేతల చుట్టూ కోఆప్షన్‌ పదవుల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణలు చేసిన కోఆప్షన్‌ నియామకం అంశంలో మార్పుల్లోకి మాత్రం వెళ్లలేదు. దీంతో యధా విధిగా ముగ్గురిని కో ఆప్షన్‌ సభ్యులుగా నియమిస్తారని భావిస్తూ పదవులు దక్కించుకోవడానికి ఆశావహులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - Apr 12 , 2026 | 01:55 AM