Share News

ఆశ.. నిరాశ

ABN , Publish Date - Nov 17 , 2026 | 01:13 AM

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్ల వెతలు తీరడం లేదు. చాలీచాలని పారితోషకాలతో కుటుంబ పోషణ భారంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు.

ఆశ.. నిరాశ
: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌ ముందు ఆశ వర్కర్ల నిరసన

- కనీస వేతనాలు.. ఉద్యోగ భద్రత కోసం ఉద్యమ బాట

(ఆంరఽధజ్యోతి సిరిసిల్ల)

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్ల వెతలు తీరడం లేదు. చాలీచాలని పారితోషకాలతో కుటుంబ పోషణ భారంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. మాతాశిశు వైద్య సేవలు, ఆరోగ్యశాఖ నిర్వహించే సర్వేలు, క్షయ బాధితులను గుర్తించి వారికి తగిన వైద్యం అందించే దిశగా కృషి చేయడం, పల్స్‌పోలియో వంటి అనేక కార్యక్రమాల్లో అక్రిడేటెడ్‌ సోషల్‌ హెల్త్‌ ఆక్టివిస్ట్‌ (ఆశా వర్కర్‌ ) విధులు నిర్వహిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించే కార్యక్రమాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ నిరంతరం సేవలందిస్తున్న ఆశా వర్కర్ల జీవితాలకు భరోసా కల్పించే ఏ పథకం వారికి వర్తిం చడం లేదు. ప్రతి సంవత్సరం ఏదో రూపంలో ఉద్యోగ భద్రత, కనీస వేతనాల కోసం ఎర్ర జెండాలు చేతభూని ఉద్యమాలు చేస్తున్న ఆశా వర్కర్లకు ప్రభుత్వం హామీలు ఇస్తూ ఆశలు కల్పించి నిరాశకు గురిచేస్తున్నారు. మరోసారి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, రెండవ పీఆర్‌సీలో ఆశా వర్కర్లకు రూ. 30 వేలు కనీస వేతనం నిర్ణయించాలని. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన రెండు డీఏలు ఆశా వర్కర్లకు వర్తింపజేయాలని, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఉద్యమబాట పట్టారు.

జిల్లాలో 470 మంది ఆశా వర్కర్లు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 470 మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతా ల్లో వెయ్యి మందికి ఒకరు, పట్టణ ప్రాంతాల్లో 2 వేల నుంచి 5 వేల మంది ప్రజలకు ఒకరు సేవలందిస్తున్నారు. గర్భిణులకు అన్ని రకాల వైద్య సేవలు అందించడంలో కీలకంగా పనిచేయడమే కాకుండా ఆసుపత్రిలో ప్రసూతి అయ్యేవరకు పనిచేస్తున్నారు. తల్లి, బిడ్డ ప్రాణాలను రక్షణగా నిలవడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. సీజనల్‌ వ్యాధులు, అంటు వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులను అరికట్టడంతో పాటు కరోనా మహమ్మారి కట్టడిలో వీరు అందించిన సేవలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు మాత్రమే కురిపించారు. ఆశాలను గ్లోబల్‌ లీడర్స్‌గా ప్రశంసించిన ప్రభుత్వం వారి భద్రతపై మాత్రం దృష్టి పెట్టలేకపోయింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా శ్రమిస్తున్న ఆశలకు ఫిక్స్‌డ్‌ వేతనం లేదు. కేవలం రూ. 9,900 వరకు పారితోషికాలు చెల్లిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా పారితోషకాలను కూడా పెంచలేదు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆశా వర్కర్లు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. పీఎఫ్‌, ఎస్‌ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఆశ వర్కర్లకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్‌, మట్టి ఖర్చుల పేరుతో రూ. 50 వేలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, సెలవులు, పదోన్న తులు కల్పించే సౌకర్యం, రూ. 18 వేల ఫిక్స్‌డ్‌ వేతనం అమలు చేయాలని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనబాట పట్టారు.

డిసెంబర్‌ 15 నుంచి నిరవధిక సమ్మె

ఆశా వర్కర్లు డిసెంబర్‌ 15 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నారు. ఇందుకు ముందస్తుగా నవంబర్‌ 3 నుంచి ఆశా డే సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చారు. నవంబర్‌ 10 న ఎమ్మెల్యేలకు సమ్మె వినతిపత్రాలు, నవంబర్‌ 15న జిల్లాలో సదస్సులు నిర్వహించారు. నవంబర్‌ 16 సోమవారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలు నిర్వహించి అధికారులకు సమ్మె నోటీస్‌ ఇచ్చారు. నవంబర్‌ 20న రాష్ట్ర మంత్రులకు సమ్మె వినతిపత్రం, డిసెంబర్‌ 5 నుంచి 10 వరకు అన్ని గ్రామాల్లో సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు సమ్మె వినతిపత్రాలు ఇవ్వాలని, మండలాల్లో తహసీల్దార్‌లకు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. డిసెంబర్‌ 15 నుంచి నిరవధిక సమ్మెతో ఆందోళన ఉధృతం కానుంది.

కనీస వేతనాలు ఇవ్వాలి

- కోడం రమణ, సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి

ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. కార్మిక చట్టం ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని రకాల వసతులు ఆశా వర్కర్లకు కల్పించాలి. ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఫిక్స్‌డ్‌ వేతనాలను అమలు చేయాలి

డిసెంబర్‌ 15 నుంచి నిరవధిక సమ్మె

- గుమ్మడి జయశీల, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆశా వర్కర్స్‌ యూనియన్‌

ఆశా వర్కర్ల సమస్యల సాధన కోసం డిసెంబర్‌ 15 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లాలని రాష్ట్ర సదస్సు నిర్ణయించింది. ఇందులో భాగంగా నవంబర్‌ 3 నుంచి సమ్మె నోటీసులు ఇవ్వడం, ధర్నాలు, వినతిపత్రాలు అందించే కార్యక్రమాలు చేపట్టాం. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెర వేర్చాలి. ఆరోగ్య శాఖలో ఎంతో కీలకంగా పనిచేస్తున్న ఆశా వర్కర్లను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనాలు లేక కుటుంబ పోషణ భారంగా ఆశావర్కర్లు గడుపుతున్నారు.

ఆశాలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి

- భారతి, గౌరవ అధ్యక్షురాలు ఆశా వర్కర్‌ యూనియన్‌

ఆశాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఆశాలకు ప్రమోషన్‌ సౌకర్యం కల్పించాలి. రెండవ పీఆర్‌సీలో ఆశా వర్కర్లకు రూ 30 వేల కనీస వేతనం నిర్ణయించాలి. డీఏలు వర్తింప చేయాలి. క్యాజువల్‌ సెలవులతో పాటు ప్రసూతి సెలవులు ఇవ్వాలి. ఇన్సూరెన్స్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ వర్తింప చేయాలి

Updated Date - Nov 17 , 2026 | 01:13 AM