చారిత్రక ‘కోట్ల’
ABN , Publish Date - Mar 17 , 2026 | 01:32 AM
గంగాధర మండలంలోని కోట్ల నర్సింహులపల్లెలో 2018 సంవత్సరంలో ఒగ్గు అంజయ్య అనే రైతు తన పొలంలో దుక్కిదున్నుతుండగా 23వ తీర్థంకరుడైన పార్శ్శ్వనాథుడి విగ్రహం బయటపడింది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
గంగాధర మండలంలోని కోట్ల నర్సింహులపల్లెలో 2018 సంవత్సరంలో ఒగ్గు అంజయ్య అనే రైతు తన పొలంలో దుక్కిదున్నుతుండగా 23వ తీర్థంకరుడైన పార్శ్శ్వనాథుడి విగ్రహం బయటపడింది. అదే పొలంలో 2020 జూన్ 13న 24వ (చివరి) తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడి విగ్రహం బయటపడింది. ఈ విగ్రహాలను క్రీస్తుశకం 9వ శతాబ్దానికి చెందినవిగా అంచనా వేశారు. ఈ ప్రాంతాన్ని క్రీస్తుశకం 750 నుంచి 972 వరకు వేములవాడ చాణిక్యులు, రాష్ట్రకూటులు పాలించారని, వారి హయాంలో హిందూ, జైన మతాల విస్తరణ జరిగిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇదే గ్రామంలో కాకతీయుల కాలం నాటి నందగిరి వీర భద్రస్వామి ఆలయం, గ్రామాన్ని ఆనుకొని ఉన్న దేవుని గుట్టపై ప్రసన్న లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, సీతారామచంద్రస్వామి ఆలయం, మరో గుట్టపై శివాలయం, కోనేరు ఉన్నాయి. మూడేళ్ల వ్యవధిలో ఒకే పొలంలో ఇద్దరు జైన తీర్థంకరుల విగ్రహాలు బయట పడడం, గ్రామంలో వివిధ దేవాలయాలు, కోట, కోనేరు ఉండడంతో ఈ ప్రాంతం పురావస్తు సంపదకు నిలయంగా ఉండవచ్చని, పురావస్తుశాఖ పరిశోధనలు జరిపితే ఎన్నో చారిత్రక ఆధారాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. విగ్రహాల తరలింపు కోసం గ్రామస్థులు అంగీకరించలేదనే కారణంతో జైన విగ్రహాల బాధ్యతను తప్పించుకున్న పురావస్తుశాఖ ఆ తర్వాత పరిశోధన చేసే విషయాన్నే మరిచిపోయింది.
ఫ ఎకరం స్థలంలో ఆలయ నిర్మాణం
జైన సమాజం తమ తీర్థంకరులైన వర్ధమాన మహావీరుడు, పార్శ్వనాథుల ఆలయాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చింది. విగ్రహాల తరలింపు కోసం జైన మతానికి చెందిన పెద్దలు, వివిధ రాష్ట్రాల నుంచి కోట్ల నర్సింహులపల్లెకు వచ్చి ప్రయత్నాలు చేశారు. ఆ విగ్రహాలతో అక్కడే ఆలయాన్ని నిర్మించాలని గ్రామస్తులు పట్టుబట్టడంతో 30 లక్షల రూపాయలు వెచ్చించి ఎకరం స్థలాన్ని కొనుగోలు చేశారు. అక్కడే నిర్మాణాన్ని చేపట్టారు. ప్రస్తుతం ఆ విగ్రహాలను ఒక్క చిన్న రేకుల షెడ్డులో ఉంచారు. జైన మతస్తులు, వారి గురువులు ఆగ్రామానికి వచ్చిన సందర్భంలో ఆ విగ్రహాలకు పూజలు చేస్తున్నారు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేసి నిత్యపూజలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫ పట్టించుకోని పురావస్తు శాఖ
పురాతన చారిత్రక కట్టడాలు, ఆలయాలు, పురాతన వస్తువులను సంరక్షించడానికి ఏర్పాటుచేసిన సంస్థ పురావస్తుశాఖ. చారిత్రక తవ్వకాలు, శాసనాల పరిశోధన, బౌద్ధ, జైన, హిందూ, ఇస్లామిక్, వలస రాజ్యాల కాలం నాటి స్మారక చిహ్నాల పరిరక్షణ ఈ సంస్థ పరిధిలోకే వస్తుంది. కానీ ఈ సంస్థ గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లెలో బయటపడ్డ జైనుల విగ్రహాల విషయంలో మాత్రం తన బాధ్యతను విస్మరించిందనే విమర్శలున్నాయి. ఈ గ్రామంలో జైన తీర్థంకరులు వర్ధమాన మహావీరుడు, పార్శ్వనాథుడి విగ్రహాలు బయటపడ్డాయి. గ్రామస్థులు సహకరించడం లేదని వాటిని అక్కడే ఉంచి తన బాధ్యత ముగిసిందని పురావస్తు శాఖ చేతులు దులుపుకుంది. జైన సమాజం ఆ విగ్రహాలకు ఆలయ నిర్మించి జైన క్షేత్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నది. గ్రామంలోనే ఎకరం భూమిని కొనుగోలు చేసిన జైనులు వర్ధమాన మహావీరుడు, పార్శ్వనాథుల విగ్రహాలు నెలకొల్పేందుకు కోటి రూపాయల అంచనా వ్యయంతో గుడి నిర్మాణం చేపట్టారు. రాజస్థాన్ నుంచి తెచ్చిన పాలరాతితో ఈ జైన మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఆలయంతోపాటు నిత్యం అక్కడికి వచ్చే భక్తులకు ఆహారం అందించేందుకు వంటశాల, భోజనశాల, జైన గురువులు వచ్చిన సందర్భంలో బస చేసేందుకు వసతి గృహాలను నిర్మిస్తున్నారు.
ఫ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దండి..
- రాచమల్ల రవి, గ్రామ సర్పంచ్, కోట్ల నర్సింహులపల్లె
కోట్ల న ర్సింహులపల్లె పరిసరాల్లో చారిత్రక సంపద నిక్షిప్తమై ఉన్నది. గతంలో ఇక్కడ వినాయక విగ్రహం, వరాహమూర్తి విగ్రహం లభించాయి. గ్రామం చుట్టూ పలు ఆలయాలున్నాయి. ఓ పొలంలో జైన తీర్థంకరుల విగ్రహాలు బయటపడ్డాయి. గ్రామంలో పరిసరాల్లో చారిత్రక పరిశోధనలు జరిపి ఏ విగ్రహం బయటపడ్డా ఇక్కడే ఉంచి ఆలయాలు నిర్మించాలి. గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి.