భళా..బాలిక
ABN , Publish Date - Apr 13 , 2026 | 12:52 AM
ఇంటర్మీడియేట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. సెకండ్ ఇంటర్ ఫలితాల్లో 75శాతం ఉత్తీర్ణత సాధించగా, ఫస్ట్‌ఇయర్ ఇంటర్ ఫలితాల్లో 62.81 శాతం మార్కులు సాధించినట్లు జిల్లా ఇంటర్మీడియేట్ నోడల్ అధికారి బొప్పరాతి నారాయణ తెలిపారు.
- ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటిన అమ్మాయిలు
- సెకండ్ ఇయర్‌లో 75శాతం, ఫస్ట్ ఇయర్‌లో 62.81 శాతం ఉత్తీర్ణత
జగిత్యాల అగ్రికల్చర్, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియేట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. సెకండ్ ఇంటర్ ఫలితాల్లో 75శాతం ఉత్తీర్ణత సాధించగా, ఫస్ట్‌ఇయర్ ఇంటర్ ఫలితాల్లో 62.81 శాతం మార్కులు సాధించినట్లు జిల్లా ఇంటర్మీడియేట్ నోడల్ అధికారి బొప్పరాతి నారాయణ తెలిపారు. గతేడాది జగిత్యాల జిల్లా రాష్ట్రంలో 18వ స్థానంలో నిలవగా, ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 24వ స్థానంతో సరిపెట్టుకుంది. కానీ ఈ యేడాది మాత్రం భారీగా పురోగతి సాధించి ప్రథమ సంవత్సర ఫలితాల్లో 13వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 10వ స్థానానికి చేరుకొని జిల్లా సత్తా చాటింది. జిల్లాలో మొత్తం 73 జూనియర్ కళాశాలలు ఉండగా, అందులో 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 13 మోడల్ స్కూళ్లు, ఏడు కేజీబీవీ, ఐదు సోషల్ రెసిడెన్షియల్, ఐదు మైనార్టీ రెసిడెన్షియల్. రెండు బీసీ రెసిడెన్షియల్‌లు, ఐదు టీఎస్‌డబ్ల్యూఆర్‌సీజేసీతో పాటు 21 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి.
- జిల్లాలో పరీక్ష ఫలితాలు ఇలా....
జిల్లాలో ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం పరీక్షలో 6,645మంది విద్యార్థులు పరీక్ష రాయగా 4,174 మంది ఉత్తీర్ణత (62.81 శాతం) సాధించారు. బాలురు 2,861మంది పరీక్ష రాయగా, 1,375మంది(48.06శాతం) ఉత్తీర్ణత నమోదుకాగా, బాలికలు 3,784మంది పరీక్ష రాయగా 2,799మంది (73.97 శాతం) ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 13వ స్థానంలో నిలిచారు.
ద్వితీయ సంవత్సర పరీక్షలో 5,792 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 4,338 మంది ఉత్తీర్ణత(74.9 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలురు 2,414మంది పరీక్ష రాయగా 1,562మంది (64.71శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 3,378మంది పరీక్ష రాయగా 2,776మంది (82.19శాతం) ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 10వ స్థానంలో నిలిచారు.
ద్వితీయ సంవత్సర పరీక్షల్లో ప్రైవేట్ విద్యార్థులు మొత్తం 740మంది పరీక్షరాయగా, 242మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 435మంది బాలురు పరీక్ష రాయగా, 131మంది పాసవగా, బాలికలు 305మందికి గానూ 111మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ప్రఽథమ సంవత్సరం వోకేషనల్ విభాగంలో 1,055మంది పరీక్ష రాయగా, 631మంది ఉత్తీర్ణత సాధించగా, ద్వితీయ సంవత్సరంలో 833మంది రాయగా, 602మంది ఉత్తీర్ణత సాధించారు. జగిత్యాల జిల్లాలో బాలికల హవా కొనసాగిందని పరీక్షల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది ఫలితాల కన్నా ఈ యేడాది ఇంటర్ ఫస్ట్‌ఇయర్‌లో 6.47ఉత్తీర్ణత శాతం, ద్వితీయ సంవత్సరంలో 6.17 ఉత్తీర్ణతా శాతం పెరగడం విశేషం.
- రాష్ట్ర ఉత్తీర్ణత శాతాన్ని మించి....
ఇంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయి ఉత్తీర్ణత శాతం 70శాతం నమోదు అవగా, జగిత్యాల జిల్లాలో రాష్ట్ర ఉత్తీర్ణత శాతానికి మించి 74.9శాతం నమోదు అవడంపై జిల్లా ఇంటర్మీడియేట్ శాఖ హర్షం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఉత్తీర్ణతశాతం మరింత మెరుగుపర్చేలా ప్రణాళికతో ముందుకుసాగుతామని అధికారులు తెలిపారు. కాగా పరీక్ష ఫలితాలపై కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్లు బీఎస్ లత, రాజాగౌడ్ విద్యార్థులకు, అధికారులకు అభినందనలు తెలిపారు.
మే 13నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
బొప్పరాతి నారాయణ, ఇంటర్మీడియేట్ నోడల్ అధికారి
ఇంటర్మీడియేట్ ఫలితాలు విడుదలైన తరుణంలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం మే 13నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రెండు సెషన్సలో పరీక్షలు ఉంటాయి. రీకౌంటింగ్, రీవెరిఫికేషనకు రేపటినుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.సప్లిమెంటరీ, రీకౌంటింగ్, రీవెరిఫికేషనకు ఏప్రిల్ 20లోగా ఫీజు చెల్లించాలి.