Share News

భారీ వర్షం.. అతలాకుతలం

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:51 AM

జిల్లాలో గురువారం సాయంత్రం కురిసిన వర్షం ప్రజలను అతలాకుతలం చేసింది.

భారీ వర్షం.. అతలాకుతలం

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం సాయంత్రం కురిసిన వర్షం ప్రజలను అతలాకుతలం చేసింది. దాదాపు గంటసేపు భారీ వర్షం కురడంతో నగరంలోని భగత్‌నగర్‌, అంబేద్కర్‌ స్టేడియంలోని రూరల్‌ ఏసీపీ కార్యాలయం, రిజిస్ట్రేషన్‌ కార్యాలయం, సుభాష్‌నగర్‌, ఆదర్శనగర్‌, సివిల్‌ హాస్పిటల్‌ చౌరస్తా తదితర ప్రాంతాల్లో వరద కాలువల నుంచి వరద నీరు రోడ్లపైకి చేరి సమీపంలోని ఇళ్లలోకి వెళ్లాయి. పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్లు, విద్యుత్‌ తీగలపై పడ్డాయి. బస్టాండ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ బోర్డులు, ఫ్లెక్సీలు చినిగి విద్యుత్‌ తీగలపై పడ్డాయి. దీంతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. మున్సిపల్‌, ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు, సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి చెట్ల కొమ్మలు, ఫ్లెక్సీలను తొలగించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి, తిమ్మాపూర్‌, మానకొండూర్‌, గన్నేరువరం, శంకరపట్నం, హుజురాబాద్‌, వీణవంక, సైదాపూర్‌ మండలాల్లో వర్షం కురిసింది. వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా వెళ్ళేందుకు కాలువలపై స్లాబ్‌ వేయించి ఇళ్లలోకి నీరు రాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు అన్నారు. భగత్‌నగర్‌ సాయికృష్ణ థియేటర్‌ ప్రాంతంలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. అక్కడికి వెళ్లిన సునీల్‌రావు ప్రజల ఇబ్బందులను పరిశీలించారు. 26వ డివిజన్‌ పరిధిలోని ఆదర్శనగర్‌, సుభాష్‌నగర్‌ ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే సమాచారంతో కార్పొరేటర్‌ వైద్యుల అంజన్‌కుమార్‌ అక్కడికి చేరుకొని బాధితులను పరామర్శించి మున్సిపల్‌ సిబ్బందిని పిలిపించి సహాయక చర్యలను చేపట్టారు.

ఫ కరీంనగర్‌ రూరల్‌: భారీ వర్షానికి కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌లో నిలువ ఉన్న మక్కలు, ధాన్యం సంచులు తడిసిపోయాయి. పది సంచుల మక్కల బస్తాలు వరదలో కొట్టుకుపోయాయి. కరీంనగర్‌ వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రంలో లోడింగ్‌కు సిద్దంగా ఉన్న ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. మార్కెట్‌ యార్డులో దాదాపు 2500 క్వింటాళ్ల ధాన్యం లోడింగ్‌ కాక పోవడంతో నిలువ ఉంచారు. వర్షం ధాటికి బస్తాలు తడవగా, కాంటాలు కాక సంచుల్లో నింపని 20 బస్తాల ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. మండలంలోని నగునూర్‌ కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం తడిసింది.

ఫ హుజూరాబాద్‌: పట్టణంలో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పట్టణంలో 16.8, మండలంలోని బోర్నపల్లిలో 58.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రుతు పవనాలు రాకముందే వర్షం కురియడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఫ వీణవంక: మండల వ్యాప్తంగా గురువారం వర్షం కురిసింది. ఉక్కపోతతో బాధపడిన ప్రజలు వాతవరణం చల్లబడడంతో ఉపశమనం పొందారు.

ఫ వెల్ది-లక్ష్మీపూర్‌ మధ్య విరిగిపడ్డ చెట్టు

మానకొండూర్‌: మండలంలోని వివిద గ్రామాలలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మండలంలోని వెల్ది-లక్ష్మీపూర్‌ గ్రామాల మధ్య రోడ్డుపై చెట్లు విరిగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి.

Updated Date - Jun 05 , 2026 | 12:51 AM