Share News

వేడెక్కిన రాజకీయం

ABN , Publish Date - Jan 24 , 2026 | 12:46 AM

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ వెలువడకముందే పట్టణాల్లో రాజకీయాలు వేడెకుతున్నాయి. రిజర్వేషన్లు ఖరారు కావడంంతో ఆశావహులు టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

వేడెక్కిన రాజకీయం

జగిత్యాల, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ వెలువడకముందే పట్టణాల్లో రాజకీయాలు వేడెకుతున్నాయి. రిజర్వేషన్లు ఖరారు కావడంంతో ఆశావహులు టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కొందరైతే ఏకంగా వార్డుల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్తూ ఓటర్ల మద్దతు కూడగట్టుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పక్షాలు సైతం మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడం కోసం ఎత్తులు వేస్తున్నాయి. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురి మున్సిపాలి టీల్లో గల వార్డుల్లో ఆశావహుల సందడి నెలకొంది.

ముందస్తు ప్రచారం..

ఎన్నికల సంఘం మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతుండడంతో ఆశావహులు అలర్ట్‌ అయ్యారు. షెడ్యూల్‌ వెలువడకముందే ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు కనిపించని వారు ఇంటింటికీ తిరుగుతుంటే ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎన్నికల బరిలో నిలవడానికి సిద్ధమైన వారిలో చాలా మంది వారం, పది రోజులుగా గల్లీలో తిరుగుతున్నారు. ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆరాట పడుతున్నారు. ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్న కొందరు కొంతకాలంగా వార్డుల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

ప్లాన-బీతో సిద్ధం ...

రిజర్వేషన కలిసి వచ్చినప్పటికీ టికెట్‌ రాజకీయం కలిసి రాకుంటే ఏం చేయాలా అన్న దానికి ప్లాన బీ తో రెడీగా ఉన్నారు. వార్డులో ఇతర ఆశావహునికి తాము కోరుకున్న పార్టీ టికెట్‌ వస్తే ఇండిపెండెంట్‌గా నైనా, కండువా మార్పు చేసైనా బరిలో దిగాలన్న ఆలోచనతో ముందుస్తుగానే ప్రచారం మొదలు పెట్టారు. ఎన్నికల షెడ్యూల్‌ ఎప్పుడు వెలువడినా రంగంలోకి దిగేందుకు అవసరమైన అంగబలం, అర్ధబలం రెడీ చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేసుకునేందుకు ఫొటోలు, వీడియోలతో సిద్ధంగా ఉన్నారు.

పలకరిస్తూ.. పనులు చేస్తూ...

జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో తుది ఓటరు జాబితాలను ప్రకటించడం, వార్డుల వారీగా, పోలింగ్‌ స్టేషన్ల వారీగా జాబితాలు సిద్ధం కావడం, మున్సిపల్‌ చైర్మన, వార్డు కౌన్సిలర్ల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలవడానికి ఆసక్తితో ఉన్న వారంతా జనం బాట పట్టారు. కొందరు మాజీ కౌన్సిలర్లు, ఆశావహులు ఖాళీ స్థలాల్లో పెరిగిపోయిన చెట్లు, పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయిస్తున్నారు. కొందరు డ్రైనేజీలు శుభ్రం చేయించగా, మరికొందరు విద్యుత దీపాలు, పైప్‌లైనల మరమ్మతులు చేయించడంపై దృష్టి సారించారు. ఇంతకాలం ముఖం చూపని వారు పొద్దున లేవగానే గల్లీలు తిరుగుతూ అందరినీ పలకరిస్తుండడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

అభివృద్ధి పనుల్లో బిజీబిజీ...

మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడంతో సీసీ రోడ్లు, డ్రైయినేజీలు, ఆలయాలు, చర్చిలు, మజీద్‌లు, కుల సంఘ భవనాలు, మహిళా సంఘ భవనాలు నిర్మాణాలపై దృష్టి సారించారు. అధికార పార్టీకి చెందిన నాయకులు, మాజీ కౌన్సిలర్ల కనుసన్నల్లోనే పనులు జరుగుతున్నాయి. ప్రారంభోత్సవాల్లో కాంగ్రెస్‌ నేతలు పాల్గొని అభివృద్ధి పనులు తమ ద్వారానే జరుగుతున్నట్లు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో పనులను వేగవంతం చేశారు.

అప్పుడే తాయిలాలు..

జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో కొందరు ఆశావహులు ఇటీవల సంక్రాంతి పండుగ కోసం రంగుల ప్యాకెట్లను ఇంటింటికి పంపిణీ చేశారు. మరికొందరు వార్డుల్లో ముగ్గుల పోటీలు నిర్వహించి మహిళలకు బహుమతులు అందించారు. పండుగ పూట మాంసం, మందు కూడా పంపిణీ చేశారు. పలు పండగలు, సెలవుల సందర్భంగా పట్టణాలకు వచ్చిన యువకులతో మాట్లాడి మంచి చెడులను చర్చించారు. ఓటు వేసేందుకు తప్పకుండా రావాలని మార్యాదలు సైతం చేశారు. కొన్నిరోజులుగా వార్డుల్లో పలు కుల సంఘాలు, యువజన సంఘాలు, వినాయక నవరాత్రోత్సవాల కమిటీలు, సంక్షేమ సంఘాలు, మహిళా సంఘాలు, బీడీ కార్మికులు, ఫించనదారులు, ఉద్యోగులు ఇలా పలు వర్గాల వారీగా మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. కొన్ని వార్డుల్లో ఒకే పార్టీ నుంచి ముగ్గురు, నలుగురు టికెట్లు ఆశిస్తున్నారు. ఆశావహులు వార్డుల్లో పర్యటిస్తుండడంతో కాలనీల్లో సందడి నెలకొంది.

Updated Date - Jan 24 , 2026 | 12:46 AM