నిలిచిన ఆరోగ్య సేవలు..
ABN , Publish Date - Oct 28 , 2026 | 01:11 AM
ఉద్యోగుల నిరవధిక సమ్మెతో ఆరోగ్య సేవలు నిలిచిపోయాయి. ఎన్‌హెచ్‌ఎం ద్వారా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రధాన ఆస్పత్రులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు సిబ్బంది, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్య సేవకులుగా నిలుస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల నిరవధిక సమ్మెతో ఆరోగ్య సేవలు నిలిచిపోయాయి. ఎన్‌హెచ్‌ఎం ద్వారా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రధాన ఆస్పత్రులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు సిబ్బంది, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్య సేవకులుగా నిలుస్తున్నారు. కరోనా కాలంలో వైరస్ మహమ్మారిని లెక్కచేయకుండా ఎంతోమంది ప్రాణాలను కాపాడడానికి ఆరోగ్య సైనికులుగా ముందు వరుసలో నిలిచిన వీరి కొలువులకు భద్రత కూడా లేదు. కనీసం న్యాయమైన తమ డిమాండ్లు తీర్చాలంటూ 16 రోజులుగా నిరవధికంగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇంతనిర్లక్ష్యమా అంటూ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎన్‌హెచ్‌ఎంలో రెండు దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది చాలీచాలని వేతనాలు, ఉద్యోగ భద్రత లేక అనేక కష్టాలను భరిస్తూ తమ సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టారు. 16 రోజులుగా జిల్లాలో ఎన్‌హెచ్‌ఎంలో 78 కేడర్లలో పనిచేస్తున్న 280 మంది సిబ్బంది నిరవధిక సమ్మెలోకి వెళ్లడంతో ఆరోగ్య సేవలు నిలిచిపోయాయి. జిల్లాలో కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 89 సబ్ సెంటర్లు, రెండు పట్టణ కేంద్రాలు, జిల్లా ఆస్పత్రి, వేములవాడ ఏరియా ఆసుపత్రి, రెండు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పీపీ యూనిట్, ఆయుష్ విభాగాలు, ఆయుర్వేద, యునాని, హోమియో కేంద్రాలతో పాటు మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలు, రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమాల్లో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల ఆరోగ్య పరీక్షలు చేయడం, గర్భిణులు, పిల్లలకు వ్యాక్సినేషన్ వంటి అనేక సేవలను సిబ్బంది అందిస్తున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ సిబ్బంది సమ్మెలకు వెళ్లడంతో ఆరోగ్య సేవ పూర్తిగా నిలిచిపోయాయి. కలెక్టరేట్ ముందు సమ్మెలో భాగంగా శిబిరం కొనసాగిస్తున్నారు.
విపత్కర కాలంలో ఎన్నో సేవలు...
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించిన జాతీయ మిషన్ డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు ఇతర కోఆర్డినేటర్లు, అకౌంటెంట్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, విభిన్న విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది భాగస్వాములు అయ్యారు. 20 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం, ప్రసూతి సెలవులు, ఉద్యోగ భద్రత కల్పిస్తూ తమను క్రమబద్ధీకరించాలని సమ్మె నోటీసు ప్రభుత్వానికి ఇచ్చినా స్పందించకపోవడంతో నిరవధిక సమ్మె బాట పట్టారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించడమే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు పెంచడం, మరణాల రేటు తగ్గించడం, క్షయ నిర్మూలనలో జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో వీరి శ్రమ ఎంతో ఉంది. నిరంతరం సేవలందిస్తున్న ప్రభుత్వం తమపై నిర్లక్ష్యం వహిస్తోందని వాపోతున్నారు.
ప్రసూతి సెలవులకు నోచుకోని తీరు
జాతీయ ఆరోగ్య మిషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవుల సమయంలో జీతాలు చెల్లించకపోవడం అత్యంత అన్యాయంగా అన్ని వర్గాలు భావిస్తున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థల్లో కూడా వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు అమలు అవుతుంటే నో వర్క్.. నో పేతో వేతనాల్లో కోత విధిస్తున్నారని మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పరిమితంగా ఉన్న వేతనాలతో పెరుగుతున్న నిత్యవసరాల ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల చదువులు ఇతర ఖర్చులు కుటుంబాల పోషణ కూడా కష్టంగా మారిందని ఉద్యోగులు వాపోతున్నారు. తగిన వేతన సవరణలు చేపట్టాలని అన్ని కేడర్ల సమస్యలను సమగ్రంగా పరిశీలించాలని కోరుతున్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో కీలకంగా ఉన్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిశీలించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఉద్యోగ భద్రత, వేతనాల్లో ఉన్న వ్యత్యాసాలను మార్చాలని, అర్హతలు, బాధ్యతలు, సేవలను పరిగణనలోకి తీసుకొని డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు.
న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి
- డాక్టర్ విక్రమ్
ప్రభుత్వం ఎన్‌హెచ్ ఎం ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి. సమస్యలు పరిష్కారం జరిగే వరకు సమ్మె కొనసాగిస్తాం. ప్రభుత్వానికి ముందస్తు నోటీసు ఇచ్చినా స్పందన లేకపోవడంతో నిరవధిక సమ్మె చేపట్టాం. 16 రోజులు దాటినా ప్రభుత్వం స్పందించడం లేదు.
వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి
- డాక్టర్ శిరీష
మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను ఇవ్వాలి. ప్రభుత్వ ఇతర శాఖలలో వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఉన్నప్పటికీ ఆరోగ్య సేవలందిస్తున్న ఎన్‌హెచ్‌ఎం మహిళా ఉద్యోగులకు సెలవు లేకపోవడం బాధాకరం. ఉద్యోగులుగా గుర్తించి సమస్యలను పరిష్కరించాలి.
ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి..
- డాక్టర్ వినూత్న
ఎన్‌హెచ్‌ఎం పరిధిలోని ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 100శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలి. సిబ్బంది అందరిని స్టేట్ హెల్త్ సొసైటీ పరిధిలో కొనసాగిస్తూ ప్రతినెల 1వ తేదీన వేతనాలు అందేలా చూడాలి. విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ఉద్యోగులు మరణిస్తే వారి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కల్పించాలి.