Share News

రాజన్న క్షేత్రాన్ని మరిచారా..!

ABN , Publish Date - Aug 01 , 2026 | 12:19 AM

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ఏర్పాటను ప్రభుత్వ పెద్దలు విస్మరిస్తున్నారా లేదా మరిచిపోయారా అని రాజన్న భక్తులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడడంతోనే వేములవాడ రాజన్న క్షేత్రానికి పాలకమండలి వస్తుందని ఎదురుచూస్తున్న నిరాశ మిగులుతోంది.

రాజన్న క్షేత్రాన్ని మరిచారా..!

- వేములవాడ ‘రాజన్న’ ట్రస్ట్‌ పదవుల కోసం ఎదురుచూపులు

- యాదాద్రి బోర్డు ఏర్పాటుతో ఆశావహుల్లో మళ్లీ చర్చ

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ఏర్పాటను ప్రభుత్వ పెద్దలు విస్మరిస్తున్నారా లేదా మరిచిపోయారా అని రాజన్న భక్తులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడడంతోనే వేములవాడ రాజన్న క్షేత్రానికి పాలకమండలి వస్తుందని ఎదురుచూస్తున్న నిరాశ మిగులుతోంది. ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నామినేట్‌ పదవుల భర్తీ చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో కాస్త హడావుడి కనిపించింది. గ్రంథాలయ సంస్థల చైర్మన్లు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌లు, పలు కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాలు జరిగాయి. శ్రీరాజన్న క్షేత్రం ట్రస్ట్‌బోర్డుకు మాత్రం పాలకవర్గం ఏర్పాటు కాలేదు. తాజాగా యాదాద్రి బోర్డు ఏర్పాటుతో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి కూడా పాలకవర్గం వస్తుందని ఆశలు మొదలయ్యాయి. ప్రభుత్వం వేములవాడ దేవస్థానం అభివృద్ధిపై దృష్టి పెట్టడమే కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.127కోట్లతో దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ దేవస్థానం అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు పనులను వేగవంతం చేస్తున్నారు. ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు కూడా ఆది శ్రీనివాస్‌ సూచన మేరకే జరిగే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. వేములవాడలో శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నూతన నిర్మాణాలు జరుగుతుండడంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా శ్రీభీమేశ్వరాలయంలో దర్శనాలు, మొక్కులు చెల్లించుకునే విధంగా ఏర్పాటు చేశారు. రాబోయే శివరాత్రి వరకు ప్రధాన దేవాలయంలోని దర్శనాలు కల్పించాలని లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. కానీ పాలక మండలి వైపు మాత్రం దృష్టి పెట్టడం లేదు. స్వయంప్రతిపత్తిని కల్పించే దిశగా వేములవాడ ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు చేయాలని ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లుగా భావిస్తున్నారు. శ్రీరాజన్న క్షేత్రానికి మాత్రం పాలకవర్గం ఏర్పాటు విషయంలో మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత, కనీసం హామీలు కూడా రావడం లేదు.

14 ఏళ్లుగా ఉత్సవ కమిటీలే...

రాష్ట్రంలో అతి పెద్ద దేవాలయాల్లో వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం ముందు వరుసలోనే ఉంటుంది. మహాశివరాత్రి, శ్రీరామనవమి వేడుకలు, శివకల్యాణోత్సవాలు, ఇలా అనేక వేడుకలు దేవాలయాల్లో ప్రధానంగా జరుగుతుంటాయి. దేవస్థానానికి తెలంగాణ, ఆంధ్రా, రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌ లాంటి రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ప్రధానంగా మహాశివరాత్రికి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. 14 ఏళ్లుగా మహాశివరాత్రి సమయంలో మాత్రం ఉత్సవ కమిటీలను నియమించి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఉత్సవ కమిటీలను నియమించినా వారి ప్రమేయం నామామాత్రంగానే ఉంటుంది. అధికార యంత్రాంగం పెత్తనమే కొనసాగుతుంది. భక్తులకు అందించాల్సిన సేవలపై పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా ఉంటాయి. వేములవాడ దేవస్థానానికి 1963 నుంచి ట్రస్ట్‌బోర్డు నియామకాలు జరుగుతూ వస్తున్నాయి. 2009-2013 వరకు మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న చైర్మన్‌గా కొనసాగిన తరువాత పాలకవర్గాల ఊసే మర్చిపోయారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో వేములవాడ దేవస్థానం అభివృద్ధి కోసం వీటీడీఏను 2016లో ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చైర్మన్‌గా, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని వైస్‌చైర్మన్‌గా నియమించినా హైదరాబాద్‌ నుంచే కార్యకలాపాలు కొనసాగించారు. గత సంవత్సరం వీటీడీఏను వేములవాడకు తరలించారు. పరిధిని కూడా గత సంవత్సరం జిల్లావ్యాప్తం చేశారు. వీటీడీఏ కార్యాలయాన్ని కలెక్టరేట్‌లో ఏర్పాటు చేశారు. జిల్లాలో వేములవాడ దేవస్థానంతో పాటు టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌, చిన్నచిన్న దేవాలయాలతో పాటు పలు కార్పొరేషన్లకు డైరెక్టర్ల పదవులు ఎప్పుడు వస్తాయోనని ఆశావహులు ఎదురుచూస్తున్నారు.

వేములవాడ దేవస్థానం ఇప్పటివరకు ఉన్న చైర్మన్‌

చైర్మన్‌ కాలపరిమితి

సీహెచ్‌ వెంకటేశ్వర్‌రావు 1963 - 1977

ఎం కొండల్‌రావు 1977 - 1980

సీహెచ్‌ వెంకటేశ్వర్‌రావు 1981- 1984

ఉచ్ఛిడి మోహన్‌రెడ్డి 1984 - 1987

దుగ్గిరాల వెంకట్రావు 1988 -1990

ఉచ్ఛిడి మోహన్‌రెడ్డి 1992 - 1994

సీహెచ్‌ కమలాకర్‌రావు 1994 -1996

శికారి విశ్వనాథం 1998 - 1999

శికారి విశ్వనాథం 2002- 2004

ఆది శ్రీనివాస్‌ 2004- 2006

ఆది శ్రీనివాస్‌ 2007- 2009

బొమ్మ వెంకన్న 2009 - 2013

Updated Date - Aug 01 , 2026 | 12:19 AM