Share News

చేనేత పోరుకు కసరత్తు

ABN , Publish Date - Mar 30 , 2026 | 01:12 AM

చేనేత పోరుకు కసరత్తు మొదలైంది.

చేనేత పోరుకు కసరత్తు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

చేనేత పోరుకు కసరత్తు మొదలైంది. ప్రభుత్వం మరోసారి చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహణకు దృష్టి సారించింది. చేనేత కార్మికులకు ఉపాధినిస్తూ పరిశ్రమ అభివృద్ధికి వారధిగా నిలుస్తున్నా చేనేత సహకార సంఘాలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని విమర్శలు ఉన్నాయి. చేనేత జౌళి శాఖ రంగాల్లో ఉన్న సొసైటీల ఎన్నికల గడువు ముగిసి ఏడేళ్లు దాటిపోయినా పర్సన్‌ ఇన్‌చార్జిలతోనే సుదీర్ఘంగా కాలం వెల్లదీస్తున్నారు. 2024 సంవత్సరం జూన్‌లో చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు కాస్త హడావిడి చేయడంతో కార్మికులు ఎన్నికలు జరుగుతాయని భావించారు. ఏర్పాట్ల వరకు వెళ్లి ఎన్నికల ఊసే మరిచారు. నేతన్నలకు ఉపాధి కేంద్రాలుగా ఉన్న చేనేత సంఘాల ఎన్నికలపై మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శల మధ్య ఎట్టకేలకు ఎన్నికల నిర్వహణకు కసరత్తు మొదలుపెట్టారు. ఐదేళ్లకొకసారి నిర్వహించాల్సిన చేనేత సహకార సంఘాల ఎన్నికలు 2013లో చివరిసారిగా నిర్వహించారు. వీరి పదవీకాలం 2018 ఫిబ్రవరితో ముగిసింది. తర్వాత 16సార్లు గడువు పొడించారు. తాజాగా ఏన్నికల నిర్వహణ ఏప్రిల్‌ 4 నుంచి మే 15వ తేదీ వరకు దాదాపు 33 రోజులపాటు ఓటర్‌ జాబితా ప్రక్రియ పూర్తిచేసే విధంగా షెడ్యూల్‌ విడుదల చేసింది. రెండు సంవత్సరాల క్రితం సహకార ఎన్నికలపై హడావిడి చేసి ఓటర్‌ జాబితా సైతం సిద్ధం చేసినా వాయిదా పడింది. ఈసారైనా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని నేత కార్మికులు భావిస్తున్నారు.

ఓటర్‌ జాబితా షెడ్యూల్‌ ఇలా..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చివరకు 13 సొసైటీలు మిగిలినా, అందులో ఆరు చేనేత సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. వీటితో పాటు నాలుగు పవర్‌లూమ్‌ సహకార సంఘాలు ఉన్నాయి. సంఘాల పరిధిలో ఉన్న సభ్యుల ఓటు హక్కు జాబితాను సిద్ధం చేసే విధంగా చేనేత జౌళి శాఖ కమిషనర్‌ షెడ్యూల్‌ జారీ చేశారు. సొసైటీలకు సంబంధించి 90 రోజుల కంటే ఎక్కువగా బకాయి ఉన్న సభ్యులను డిఫాల్ట్‌గా భావించి ఓటర్‌ జాబితా నుంచి వారిని తొలగించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఏప్రిల్‌ 4 నుంచి మొదలు పెట్టనున్నారు. 13వ తేదీ వరకు సంఘాల్లోని బకాయిదారుల జాబితాను నోటీస్‌ బోర్డుపై ప్రచురిచడంతో పాటు బకాయిదారులకు నోటీసులు అందిస్తారు. 15వ తేదీ నుంచి 17వతేదీ వరకు ఓటర్‌ జాబితా తయారుచేస్తారు. 18 నుంచి 25వతేదీ వరకు ఓటర్‌ జాబితాను ప్రచురించి అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఏప్రిల్‌ 27,28,29 తేదీల్లో అభ్యంతరాలు పరిశీలించి జాబితాను సవరిస్తారు. అనంతరం ఏప్రిల్‌ 30, మే 1 తేదీల్లో ఓటర్‌ జాబితాను చేనేత జౌళి శాఖ ఏడీకి అందిస్తారు. మే 2 నుంచి 5 తేదీ వరకు ఓటర్‌ జాబితాలను జిల్లా కార్యాలయంలో పరిశీలిస్తారు. అనంతరం ఓటర్‌ జాబితాపై 6,7,8 తేదీల్లో ఓటర్‌ జాబితా పై అభ్యంతరాలను స్వీకరిస్తారు. మే 1,12 తేదీలో ఓటర్‌ జాబితాలను సహకార సంఘాలకు పంపిస్తారు. 13.14.15 తేదీల్లో రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీకి ఎన్నికల నిర్వహణకు పంపిస్తారు. దీని ప్రకారం జూన్‌ మాసంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

ప్రశ్నార్థకంగా చేనేత సంఘాల ఉనికి...

చేనేత మగ్గం వారి జీవనాధారం. కంటిచూపు అనకపోయినా, వినికిడి జ్ఞానం కోల్పోతున్నా కాసేపు పనిచేస్తేనే ఒళ్లంతా నిస్సత్తువగా మారుతున్న వృద్ధాప్యంలో చేనేత మగ్గాలపైనే ఉపాధి పొందుతున్నారు. యువకులు మరమగ్గాల వైపు వెళ్లడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత మగ్గాలు లయ తప్పాయి. వేల సంఖ్యలో ఉన్న మగ్గాలు ఇప్పుడు వందల సంఖ్యలోకి చేరాయి. చేనేత సహకార సొసైటీలు మూలనపడ్డాయి. ప్రస్తుతం జిల్లాలో రికార్డుల ప్రకారం 13 సొసైటీలు ఉన్నాయి. ఆరు సొసైటీలు మాత్రమే పనిచేస్తున్నాయి. చేనేత మగ్గాల స్థానంలో మరమగ్గాలు చేరాయి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 30,352 వేల మరమగ్గాలపై వస్త్ర ఉత్పత్తి జరుగుతుంది. 1984లో సిరిసిల్ల జిల్లాలో చేనేత మగ్గాలు ఆరు వేల వరకు ఉండగా, ఇప్పడు 169 మగ్గాలకు చేరుకున్నాయి. ఈ మగ్గాలపై 325 మంది కార్మికులు మాత్రమే ఉపాధి పొందుతున్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం చేనేత అభయహస్తం పథకాలను అమలు చేస్తోంది. నేతన్న పొదుపు, నేతన్న భద్రత, నేతన్నకు భరోసా పథకాలను అందిస్తున్నారు. నూలు సబ్సిడీని ఇస్తున్నారు. వివిధ పథకాల్లో 214 మంది కార్మికులు ఉన్నారు. చేనేత కళను బతికించడానికి కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం 2017లో చేనేత లక్ష్మి పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ శాఖల ఉద్యోగులు 2,662 మంది పథకంలో చేరారు. చేనేత లక్ష్మి పథకంలో చేరిన ఉద్యోగులు వస్త్రాలు కొనుగోలు చేశారు. వేములవాడ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం చేనేత క్లస్టర్‌గా గుర్తించింది. క్లస్టర్‌ కింద రూ.1.19 కోట్ల నిధులను మంజూరుచేసింది. దీనిలో భాగంగా రూ.50 లక్షలతో మౌలిక వసతుల కేంద్రం ఆధునిక డిజైన్‌తో కార్మికులకు శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది. మొదటి విడతలో రూ 19.10 లక్షలు విడుదల చేయగా 300మంది లబ్ధిదారులు కొత్త డిజైన్ల అభివృద్ధి, చేనేత శిక్షణను పొందారు. జిల్లాలో 169 మగ్గాలు ఉండగా అందులో కొన్ని వినియోగంలో లేవు. జిల్లాలో సిరిసిల్లలో 76 మగ్గాలు, వేములవాడలో 4, వేములవాడ మండలంలో 7, చందుర్తిలో 8, బోయినపల్లిలో 27, తంగళ్లపల్లిలో 34, ఇల్లంతకుంటలో 4, గంభీరావుపేటలో 1, కోనరావుపేటలో 14 ఉన్నాయి. ఇందులో సిరిసిల్లలో మహేశ్వర సొసైటీ, సిరిసిల్ల సొసైటీ, జగదాంబ సోసైటీ, వేములవాడ, హన్మాజీపేట, మామిడిపెల్లి సొసైటీలతోపాటు ఖాదీగ్రామోద్యోగ్‌, తంగళ్లపల్లి సొసైటీల్లో చేనేత మగ్గాలు కార్మికులకు ఉపాధిని అందిస్తున్నాయి. చేనేత కార్మికుడికి పదిహేను రోజుల పాటు కష్టపడితే రూ.500 నుంచి రూ.800 వరకే కూలి లభిస్తోంది. చేనేత మగ్గాలకు కండెలు చుట్టే వృద్ధ మహిళలు ఒక నూలు లడి చుడితే రూ.6 నుంచి 10 రూపాయలు మాత్రమే లభిస్తాయి. పొద్దంతా చుడితే 50 రూపాయలు మాత్రమే గిట్టుబాటు అవుతుంది. చీరలోని గొప్పతనాన్ని చాటుతూ అగ్గిపెట్టెలో సైతం అమిరే చీర, కుట్టులేని దుస్తులు, మగ్గంపై మనుషుల చిత్రాలను నేసి ప్రపంచాన్ని అబ్బురపరిచిన సిరిసిల్ల చేనేత పరిశ్రమ ఉనికిని మాత్రం కొందరు యువకులు బతికించే ప్రయత్నం చేస్తున్నారు.

Updated Date - Mar 30 , 2026 | 01:12 AM