పాతాళానికి భూగర్భ జలాలు
ABN , Publish Date - Jul 04 , 2026 | 01:07 AM
నైరుటటరుతుపవనాల ప్రారంభంతో జూన్‌లో వర్షాలు కురుస్తాయి. వేసవిలో పడిపోయిన భూగర్భ జలాలు క్రమేపీ పెరుగుతాయి. జూన్‌లో వర్షాలు కురవకపోవడంతో మేతో పోల్చితే సగటున మరో అరమీటరు లోతునకు నీరు పడిపోయింది. దీంతో జిల్లాలోని పలు మండలాల్లో తాగు, సాగునీటికి ఇక్కట్లు మొదలయ్యాయి. మే
- అరమీటరు లోతుకు వెళ్లిన నీరు
- జిల్లా సగటు జలమట్టం 8.93 మీటర్లు
- గంగాధరలో 16.99 మీటర్ల లోతున నీరు
- కరీంనగర్ అర్బన్‌లో 15.04 మీటర్లు
- చొప్పదండిలో 13.46 మీటర్ల లోతులో నీరు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
నైరుటటరుతుపవనాల ప్రారంభంతో జూన్‌లో వర్షాలు కురుస్తాయి. వేసవిలో పడిపోయిన భూగర్భ జలాలు క్రమేపీ పెరుగుతాయి. జూన్‌లో వర్షాలు కురవకపోవడంతో మేతో పోల్చితే సగటున మరో అరమీటరు లోతునకు నీరు పడిపోయింది. దీంతో జిల్లాలోని పలు మండలాల్లో తాగు, సాగునీటికి ఇక్కట్లు మొదలయ్యాయి. మేలో జిల్లాలో సగటు జలమట్టం 8.44 మీటర్లు కాగా జూన్ మాసాంతానికి అది 8.93కు పడిపోయింది. గంగాధర మండలంలో అత్యధికంగా 16.99 మీటర్ల లోతుకు నీరు పడిపోగా కరీంనగర్ అర్బన్ మండలం, నగరంలో 15.04, చొప్పదండి మండలంలో 13.46 మీటర్ల లోతునకు నీటిమట్టం పడిపోయింది. కరీంనగర్ రూరల్ మండలంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా 4.21 మీటర్ల లోతున నీరు లభిస్తున్నది. ఈ మండలంలోనూ మేతో పోల్చితే 0.40 మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోయింది.
నార్ల పోయని రైతులు
వర్షాభావ పరిస్థితుల కారణంగా బావుల కింద నార్లు పోసుకునే రైతులు భూగర్భ జలమట్టం పడిపోవడంతో నార్లు కూడా పోయలేదు. మృగశిర, ఆరుద్ర కార్తెలు వర్షాలు లేకుండానే గడిచిపోయాయి. జూన్ 1 నుంచి సెప్టెంబరు చివరి వరకు నైరుతి రుతుపవనాల కారణంగా వర్షాకాలంగా భావిస్తారు. ఈ రుతుపవనాల క్యాలెండర్ మొదలై 33 రోజులు గడవగా తొమ్మిది రోజులు మాత్రమే వర్షాలు కురిశాయి. అదీ జిల్లా మొత్తంగా కాకుండా ఏదో ఒక చోట ఎంతో కొంత వర్షం కురుస్తూ వర్షపాతం నమోదైనా ఎక్కడా పత్తి విత్తనాలు వేసుకోవడానికిగానీ, నార్లు పోసుకోవడానికి వీలు కలుగలేదు. ఈ 33 రోజుల్లో జిల్లా మొత్తం కురవాల్సిన సగటు వర్షపాతం 141.4 మిల్లీమీటర్లు కాగా 97 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. 31శాతం లోటు వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం జిల్లాలో కరీంనగర్ అర్బన్, చొప్పదండి, గంగాధర, చిగురుమామిడి, మానకొండూర్, గన్నేరువరం మండలాల్లో భూగర్భ జలాలు అరమీటరు నుంచి 1.7 మీటర్ల వరకు పడిపోరయాయి. దీనితో ఆయా మండలాల్లో నీటి కరువు ఏర్పడింది. జూలై 3న అల్పపీడనం కారణంగా జిల్లాలో పలు మండలాల్లో వర్షాలు కురిశాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు 7.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ప్రస్తుతం జిల్లాలోని భూగర్భజలమట్టాలు ఇలా ఉన్నాయి.
గంగాధర 16.99, కరీంనగర్ 15.4, చొప్పదండి 13.46, తిమ్మాపూర్ 10.48, రామడుగు 10.28, చిగురుమామిడి 9.41, గన్నేరువరం 8.88, కొత్తపల్లి 8.74, హుజురాబాద్ 7.78, సైదాపూర్ 7.13, కేశవపట్నం 6.68, ఇల్లందకుంట 5.52, మానకొండూర్ 5.33, వీణవంక 5.10, జమ్మికుంట 5.09, కరీంనగర్ రూరల్ 4.21 మీటర్లు