Share News

పల్లెల్లో పలకరింపులు..

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:43 AM

పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

పల్లెల్లో పలకరింపులు..

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అధికార కాంగ్రెస్‌ పార్టీకి మెజార్టీ స్థానాలు దక్కాయి. అదే ఉత్సాహంతో మిగిలిన జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల నిర్వహణ వైపు సన్నాహాలు మొదలు కావడం, ఈనెల 23న పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ రాబోతుందని ప్రచారం కూడా జోరందుకుంది. ప్రభుత్వం ఇప్పటికే జడ్పీటీసీల స్థానాలు, ఎంపీపీలు, స్థానాలు ఖరారు చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు నిలిపివేయడంతో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. కోర్టు ఉత్తర్వుల మేరకే రిజర్వేషన్లు కల్పిస్తూ పంచాయతీ, మున్సిపాలిటీల ఎన్నికలు నిర్వహించినట్లే పరిషత్‌ ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీపరంగా బీసీలకు అధిక స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించనున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 జడ్పీటీసీలు, 12ఎంపీపీలు, 123 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్‌ రానున్న నేపథ్యంలో పల్లెల్లో ముందస్తుగానే ఎన్నికల వాతావరణం మొదలైంది. ఆశావహులు ప్రజలతో మమేకం కావడానికి, జడ్పీటీసీలు, ఎంపీపీ, ఎంపీటీసీల పదవులకు సిద్ధపడ్డ ఆశావహులు పల్లెల్లో పలకరింపులు మొదలుపెట్టారు. పెద్దల వద్దకు వెళ్లి మద్దతును కూడగట్టుకుంటున్నారు. కుల సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలతో సమాలోచనలు చేస్తున్నారు. అన్నా, అక్క, తమ్ముడు అంటూ ఇంటింటికి తిరుగుతున్నారు. జడ్పీటీసీల ఆశావహులు ఊరూరా తిరుగుతూ యోగక్షేమాలను పలకరిస్తూ ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించడంతో పరిషత్‌ ఎన్నికలను కూడా ఖచ్చితంగా నిర్వహిస్తారనే నమ్మకంతో ఆశావహులు చేస్తున్న సందడితో పల్లెల్లో ఎన్నికల కళ వచ్చేసింది.

పరిషత్‌ పోరుకు సిద్ధం

జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీల రిజర్వేషన్లు గతంలో ఖరారు చేసి చివరకు రద్దు కావడం జరిగింది. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఇప్పటికే సిద్ధంగా ఉండడంతో నోటిఫికేషన్‌ రావడం తరువాయిగా ఎన్నికల నిర్వహణ ముందుకు సాగనుంది. జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో 3.53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1.70 లక్షలు. మహిళలు 1.82 లక్షల మంది ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలు, పోలింగ్‌ సామగ్రిని సిద్ధం చేసింది. 12 జడ్పీటీసీలు, 123 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 712 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా ఏర్పాట్లు కూడా గతంలో చేశారు. ఎన్నికలు నిర్వహించినట్లు ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయాల్సి ఉంటుంది. ఈనెల 23న నోటిఫికేషన్‌పై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.

రిజర్వేషన్లపై ఆసక్తి

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ చైర్మన్‌ల రిజర్వేషన్లపై మళ్లీ ఆసక్తి మొదలైంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు బీసీ రిజర్వేషన్లు మళ్లీ పాత పద్ధతిలోనే రానున్నాయి. 50 శాతంలోపు రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉండే విధంగా నిర్ణయం తీసుకోనున్నారు. మిగిలిన జనరల్‌కు కేటాయించిన ఎస్సీ, ఎస్టీ, బీసీలే అధికంగా పోటీ చేసే అవకాశం ఉంది. పార్టీలు కూడా బీసీలకు ఎక్కువ శాతం సీట్లు కేటాయించే విధంగా ప్రకటనలు చేస్తున్నాయి. 2019 రిజర్వేషన్ల ప్రకారం జిల్లాలో 12 జడ్పీటీసీ స్థానాల్లో ఒకటి ఎస్టీ మహిళ, ఒకటి ఎస్సీ మహిళ, రెండు ఎస్సీ జనరల్‌, ఒకటి బీసీ మహిళ, ఒకటి బీసీ జనరల్‌, మూడు జనరల్‌ మహిళ, మరో మూడు జనరల్‌లకు కేటాయించారు. రిజర్వేషన్ల ప్రకారం ఆరు మహిళలకు, ఆరు జనరల్‌గా ఉన్నాయి. 123 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 68 మహిళలకు 58 జనరల్‌కు కేటాయించారు. ఇందులో ఎస్టీలకు ఆరు కేటాయించగా, 5 మహిళలకు, ఒకటి జనరల్‌గా ఉంది. 28 ఎస్సీలకు కేటాయించగా, 17 మహిళలకు, 11 జనరల్‌, 25 బీసీలకు కేటాయించగా, 14 మహిళలకు, 11 జనరల్‌ స్థానాలుగా ఉన్నాయి. 64జనరల్‌ స్థానాలు ఉండగా 29 మహిళలకు, 25 జనరల్‌గా కేటాయించారు. ఈసారి బీసీ డెడికేషన్‌ కమిటీ ఇచ్చే రిపోర్ట్‌ ప్రకారం రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి.

పార్టీల పెద్దల చుట్టూ ఆశావహులు

జిల్లాలో పరిషత్‌ ఎన్నికలు ముందుకు రావడంతో ఆశావహూలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలు పార్టీల బీ-ఫాములతోనే పోటీ చేయాల్సి ఉండడంతో టికెట్‌ దక్కించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. రిజర్వేషన్లు ఎలా ఉన్నా తమకే టికెట్‌ ఇవ్వాలని పద్ధతిలో ఉన్నారు. మహిళా రిజర్వేషన్‌ అయితే తమ సతీమణి, కోడలు, కూతుళ్లను బరిలో నిలిపే విధంగా టికెట్‌ ఆశిస్తున్నారు. రెండేళ్లుగా ఎదురుచూస్తున్న జిల్లా, మండల పరిషత్‌ పదవులు ఎవరిని వరిస్తాయనే చర్చ కూడా మొదలైంది.

Updated Date - Feb 20 , 2026 | 12:43 AM