Share News

పచ్చదనం.. ప్రగతివనం

ABN , Publish Date - Jun 18 , 2026 | 01:22 AM

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి వానాకాలం సీజన్‌లో వనమహోత్సవం పేరుతో ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈసారి కూడా జిల్లాలో వనమహోత్సవాన్ని చేపట్టేందుకు అధికార యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. గురువారం ముఖ్యమంత్రి వనమహోత్సవ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడంతోనే జిల్లాలో కూడా పచ్చదనానికి బాటలు వేస్తూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

పచ్చదనం.. ప్రగతివనం

- నేడు వనమహోత్సవం

- పొంచి ఉన్న ఎల్‌నినో ముప్పు

- వర్షాభావ పరిస్థితులపై అధికారుల్లో ఆందోళన

- జిల్లాలో 8.65 లక్షల మొక్కల లక్ష్యం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి వానాకాలం సీజన్‌లో వనమహోత్సవం పేరుతో ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈసారి కూడా జిల్లాలో వనమహోత్సవాన్ని చేపట్టేందుకు అధికార యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. గురువారం ముఖ్యమంత్రి వనమహోత్సవ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడంతోనే జిల్లాలో కూడా పచ్చదనానికి బాటలు వేస్తూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సారి ఎల్‌నినో గండం పొంచి ఉండడంతో వనమహోత్సవాన్ని విజయవంతం చేయడం ఎలా అనే ఆందోళన పట్టుకుంది. ఎల్‌నినో ప్రభావంతో సాధారణ వర్షపాతం తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో వనమ హోత్సవంలో నాటిన మొక్కలకు తగినంత నీరు అందక మొక్కలు జీవించే శాతం తగ్గుతుందని కలవర పడుతున్నారు. మొక్కల పెరుగుదలపై కూడా ప్రభావం చూపుతోందని భావిస్తున్నారు. మరోవైపు ఎల్‌నినో వల్ల వర్షాలు తగ్గితే నాటిన మొక్కలు ఎండిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు మొక్కలకు గుంతలు తవ్వాలన్నా కష్టమేనని చెబుతున్నారు. ఉపాధి హామీ కూలీలు కూడా చెరువుల్లో పూడికతీతకు వెళ్తున్న రీతిలో మొక్కలకు గుంతలు తవ్వడానికి ముందుకు రావడంలేదని తెలుస్తోంది. నేల గట్టిగా ఉండడం వల్లనే గుంతలు తవ్వే పనులు చేయడానికి కూలీలు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 18 నుంచి వనమహోత్సవ కార్యక్రమాన్ని జిల్లాలో 8,65,200 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యం ఉన్నది. జిల్లాలోని 260 గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాలిటీల పరిధిలో 14 శాఖల ద్వారా మొక్కలు నాటాలని నిర్ణయించారు. గత 11వ విడత హారితహారంలో మొక్కలు నాటడానికి 10.38 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుని పూర్తి చేశారు. 12వ విడత హరితహారంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 260 గ్రామ పంచాయతీల పరిధిలోని నర్సరీల్లో 9 లక్షల మొక్కలు పెంచారు. నర్సరీలలో ఉన్న మొక్కలను ఆయా గ్రామాల్లో నాటనున్నారు. ఇండ్లలో నాటేందుకు పూలు, పండ్ల మొక్కలను అందించనున్నారు.

- అత్యధికంగా డీఆర్‌డీవోకు 5.70 లక్షల లక్ష్యం

మొక్కలు నాటేందుకు ప్రభుత్వ శాఖల వారీగా లక్ష్యాలను కేటాయించారు. ఈ సారి 8.65 లక్షల మొక్కలు నాటే లక్ష్యంలో అత్యధికంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 5.70 లక్షల మొక్కలు నాటే లక్ష్యంగా పెట్టుకున్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో లక్ష, వేములవాడ మున్సిపాలిటీలో 50 వేలు, వ్యవసాయ శాఖలో 25 వేలు, అటవీ శాఖ 75000, ఎక్సైజ్‌ శాఖ 20 వేలు, విద్యాశాఖ 2 వేలు, ఉద్యానవన శాఖ 5 వేలు, అర్‌అండ్‌బీ శాఖ 4 వేలు, నీటి పారుదల శాఖ 7 వేలు, వైద్య అరోగ్య శాఖ 2 వేలు, పోలీస్‌ శాఖ 4 వేలు, మైనింగ్‌ శాఖ 200 ,విద్యాశాఖ 2వేలు, పరిశ్రమల శాఖ వెయ్యి చొప్పున మొక్కలు నాటే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు డీఆర్‌డీఏ ద్వారా 2020 -21లో 28,53,745 మొక్కలు నాటగా 27,29,701 మొక్కలు. 2021- 2022లో 2678762 మొక్కలు, 2022-23 సంవ త్సరంలో 1917248 మొక్కలు, 2023- 24 సంవత్సరంలో ఉపాధి హామీ కింద 6,92,099 మొక్కలు నాటారు. 2024-2025 సంవత్సరంలో 6.06 లక్షల మొక్కలు నాటారు. 2025-26 సంవత్సరానికి 6.77 లక్షల లక్ష్యంగా మొక్కలు నాటారు.

Updated Date - Jun 18 , 2026 | 01:22 AM