రామగుండం - మణుగూర్ రైల్వేలైన్‌కు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Apr 04 , 2026 | 01:51 AM
కోల్ కారిడార్‌ను కలిపేందుకు ఇరవై ఐదేళ్ల క్రితం ప్రతిపాదించిన రామగుండం-మణుగూర్ బ్రాడ్ గేజ్ రైల్వేలైన్ మార్గం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గత నెలలో కేంద్ర ప్రభుత్వం 2026-27 ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ రైలు మార్గానికి 2911 కోట్ల 84 లక్షల రూపాయలు, పెద్దపల్లి- నిజామాబాద్ డబుల్ లైన్ సర్వేకు రూ.3.56 కోట్లు కేటాయించారు.
- కేంద్ర బడ్జెట్‌లో రూ.2911. 84 కోట్ల నిధుల కేటాయింపు
- గతేడాది నాలుగు జిల్లాల్లో భూసేకరణకు గెజిట్ జారీ
- ఇరవై ఏళ్ల కిందటే ప్రతిపాదనలు
- అనుసంధానం కానున్న కోల్ కారిడార్
- లైన్ పూర్తయితే తగ్గనున్న 90 కిలోమీటర్ల దూరభారం
- పెద్దపల్లి- నిజామాబాద్ డబుల్ లైన్ సర్వేకు రూ. 3.56 కోట్లు
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
కోల్ కారిడార్‌ను కలిపేందుకు ఇరవై ఐదేళ్ల క్రితం ప్రతిపాదించిన రామగుండం-మణుగూర్ బ్రాడ్ గేజ్ రైల్వేలైన్ మార్గం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గత నెలలో కేంద్ర ప్రభుత్వం 2026-27 ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ రైలు మార్గానికి 2911 కోట్ల 84 లక్షల రూపాయలు, పెద్దపల్లి- నిజామాబాద్ డబుల్ లైన్ సర్వేకు రూ.3.56 కోట్లు కేటాయించారు. సర్వే పూర్తయిన రామగుండం-మణుగూర్ లైన్ నిర్మాణా నికి పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కావాల్సిన భూసేకరణ చేపట్టేందుకు గత ఏడాది మే నెలలో గెజిట్ జారీ చేసిన విషయం తెలిసిందే. 207.80 కిలోమీటర్ల దూరం గల ఈ రైల్వేలైన్ రాఘవాపూర్ నుంచి మంథని, భూపాలపల్లి, మేడారం, తాడ్వాయి, కాటాపూర్, గోపాల్‌రావుపేట్, రామానుజపురం మీదుగా మణుగూర్ వరకు నిర్మించనున్నారు. ఈ లైన్ నిర్మాణానికి ఇప్పటికే సర్వే పూర్తి చేసి రైలు మార్గంలో మట్టి నమూనాలు తీసి పరీక్షలు కూడా చేశారు. భూసేకరణ సేకరణ జరుగుతున్నది. ఈ లైన్ పూర్తయితే ప్రయా ణికులకు దూరభారం తగ్గడంతోపాటు బొగ్గు రవాణా ఖర్చులు తగ్గను న్నాయి. ఇది న్యూఢిల్లీ-చెన్నై గ్రాండ్ ట్రంక్ లైన్‌లో నాగ్‌పూర్-విజయవాడ సెక్షన్‌లో కీలక ప్రత్యామ్నాయ మార్గంగా మారనున్నది. దీంతో పాటు ప్రతిపాదించిన భద్రాచలం రోడ్- కొవ్వూర్ లైన్ పూర్తయితే విశాఖపట్నం లైన్‌కు కూడా అనుసంధానం చేసేందుకు అవకాశాలున్నాయి.
ఫ అనుసంధానం కానున్న కోల్ కారిడార్..
సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్న మణుగూర్, ఇల్లందు, కొత్తగూ డెం, జయశంకర్ భూపాలపల్లి, రామగుండం, గోదావరిఖని, మంచిర్యాల జిల్లాలో గల మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, తదితర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న కోల్ కారిడార్‌ను కలిపేందుకు 2004లో అప్పుడు ఎంపీగా ఉన్న గడ్డం వెంకటస్వామి ప్రతిపాదించారు. ఆ తర్వాత మాజీ ఎంపీలు డాక్టర్ జి వివేక్, బాల్క సుమన్, ఎంపీ జొర్లకుంట వెంకటేశ్ నేత, ప్రస్తుత ఎంపీ గడ్డం వంశీకృష్ణ నిధుల మంజూరు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకవచ్చారు. ప్రతీ బడ్జెట్లో దీని ప్రస్తావన వస్తున్న ప్పటికీ కేటాయింపులు ఏమిలేకపోవడం గమనార్హం. 2004 నుంచి 2009 వరకు యూపీఏ ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రిగా లాలూప్రసాద్ యాదవ్ ఉన్న సమయంలో 2009లో ఈ లైన్ కోసం సర్వే చేయాలని బడ్జెట్‌లో పెట్టారు. అప్పటి నుంచి బడ్జెట్ కేటాయింపులు లేనప్పటికీ, ఈ లైన్ నిర్మాణం ఉండదనుకొని ప్రజలు నిరాశకు గురవుతున్నప్పుడల్లా సర్వే కోసం కొన్ని నిధులు కేటాయిస్తూ వచ్చారు. 2023-24 బడ్జెట్లో కూడా ఫైనల్ లొకేషన్ సర్వే కోసం 360 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ సర్వే తుది దశకు చేరుకున్నది. మూడు రకాల లైన్లలో సర్వే చేశారు. ఇందులో ఏదీ దూరం తక్కువగా ఉంటుంది. భూసేకరణకు ఉన్న ఆటంకాలు ఏమిటీ, తదితర అంశాలను పరిశీ లించిన తర్వాత ఒక రూట్ క్లియర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు.
ఫ ప్రయాణికులకు సౌకర్యవంతంగా..
రామగుండం నుంచి పెద్దపల్లి మధ్యన గల రాఘవాపూర్ స్టేషన్ నుంచి ఈ లైన్‌ను 207.90 కిలోమీటర్ల దూరం గల మణుగూరుకు నిర్మించను న్నారు. బొగ్గు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్న భద్రాచలం ప్రాంతాలను ఈలైన్ అనుసంధానం చేయనున్నది. ప్రస్తుతం భద్రాచలం, మణుగూర్ వెళ్లాలంటే సింగరేణి రైలులో ప్రయాణించాల్సి ఉంటుంది. రామగుండం నుంచి కాజీపేట, డోర్నకల్, భద్రాచలం రోడ్ మీదుగా మణుగూర్ వరకు రైలు నడుస్తున్నది. ఈ మార్గం 291 కిలోమీటర్లు కాగా, రామగుండం- మణుగూర్ రైల్వే లైన్ పూర్తి చేస్తే దాదాపు 90 కిలోమీటర్ల వరకు దూర భారం తగ్గనున్నది. అంతేగాకుండా బొగ్గు రవాణా భారం కూడా తగ్గనున్నది. గత ఏడాది భూసేకరణకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడంతో ఆ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ బడ్జెట్‌లో 2911.83 కోట్లు కేటాయించడంతో నిర్మాణానికి ఇక అడుగులు పడినట్లేనని, ఈ లైన్ పూర్తయ్యే నాటికి 10 నుంచి 15 ఏళ్లు పట్టవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.