Share News

అక్రమ లే అవుట్లకు పచ్చజెండా!

ABN , Publish Date - Sep 09 , 2026 | 01:29 AM

జిల్లాలో రెండేళ్లుగా స్తబ్దంగా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మళ్లీ ఊపందనుకుంటోంది. జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణంతో ఆయా పట్టణాల శివారులో కొత్త వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు.

అక్రమ లే అవుట్లకు పచ్చజెండా!

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో రెండేళ్లుగా స్తబ్దంగా ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మళ్లీ ఊపందనుకుంటోంది. జిల్లా కేంద్రమైన పెద్దపల్లి పట్టణంతో ఆయా పట్టణాల శివారులో కొత్త వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటిలాగానే రియల్‌ వ్యాపారులు నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల అడ్డగోలు దోపిడీకి, అధికారుల ఉదాసీనత తోడవడంతో డీటీసీపీ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌) అనుమతులు లేకుండానే అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. చట్ట ప్రకారం లేఅవుట్లు వేయాలంటే ప్రభుత్వానికి సమర్పించాల్సిన పత్రాలు, చెల్లించాల్సిన ఫీజులు, కమ్యూనిటీ అవసరాలకు కేటాయించాల్సిన స్థలాలను గాలికొదిలేసి రియల్టర్లు వ్యాపారం సాగిస్తున్నారు.

ఫ కమ్యూనిటీ అవసరాలు గల్లంతు..

నిబంధనల ప్రకారం ఏ లేఅవుట్‌లోనైనా కనీసం 30, 40 అడుగుల రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌ లైన్లతోపాటు పార్కులు, సామాజిక అవసరాల (కమ్యూనిటీ హాల్స్‌, పాఠశాలలు) కోసం 10 శాతం స్థలాన్ని స్థానిక సంస్థలకు గిఫ్ట్‌డీడ్‌ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి అనుమతులు లేకుండా అంగుళం భూమి కూడా వదలకుండా ప్లాట్లుగా మార్చేస్తున్నారు. కమ్యూనిటీకి కేటాయించాల్సిన 10 శాతం స్థలాన్ని సైతం విక్రయించి లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. పెద్దపల్లి పట్టణంలోని చీకురాయి ప్రాంతంలో ఒక పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు రెండు కొత్త వెంచర్లను ఏర్పాటు చేశారు. ఈ వెంచర్లలో 30, 40 అడుగుల వెడల్పుతో లేఅవుట్‌ చేసి రోడ్లు వేసినప్పటికీ, డీటీసీపీ అనుమతులు మాత్రం తీసుకోలేదు. సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో 170 నుంచి 180 వరకు ప్లాట్లు ఏర్పాటు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. డీటీసీపీ అనుమతులు లేకపోయినా కమ్యూనిటీ అవసరాల కోసం ఎక్కడ కూడా స్థలాన్ని వదలలేదు. యథేచ్ఛగా నిబంధనలు తోసిపుచ్చి గజానికి 13 వేల నుంచి 15 వేల రూపాయల చొప్పున ప్లాట్లు విక్రయిస్తున్నా కూడా పట్టించుకునే అధికారులే కరువయ్యారు. మున్సిపల్‌ అధికారులైతే అటువైపు కన్నెత్తయినా చూడడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

ఫ అమాయకులకు ’ఎల్‌ఆర్‌ఎస్‌‘ ఉచ్చు!

వెంచర్లలో దారులు బాగానే ఉన్నాయి కదా అని ప్లాట్లను కొనుగోలు చేస్తున్న ప్రజలు నిబంధనల గురించి తెలుసుకోవడం లేదు. డీటీసీపీ అనుమతులు ఉన్నాయా లేదా అని ఎవరు అడగడం లేదు. పెద్దపల్లి జిల్లా ఏర్పాటైన తర్వాత నుంచి అనేక వెంచర్లు ఏర్పాటు చేయగా, వాటిలో డీటీసీపీ అనుమతులు ఉన్నవి పది కూడా దాటవు. ఆ వెంచర్లలో ప్లాట్లను కొనుగోలు చేసిన వాళ్లు తీరా ఇల్లు కట్టుకుందామని వెళ్తే పంచాయతీ, మున్సిపాలిటీ అధికారులు అనుమతులు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం) కింద వేలాది రూపాయల రుసుం చెల్లిస్తే తప్ప ఇళ్ల నిర్మాణానికి పచ్చజెండా ఊపడం లేదు. రియల్టర్లు చేసిన అక్రమాలకు, అమాయక కొనుగోలుదారుల జేబులు గుళ్ళ అవుతున్నాయి.

ఫ కళ్లెదుటే కనబడుతున్నా పట్టించుకోని అధికారులు..

కళ్లముందే ఎకరాలకు ఎకరాల వ్యవసాయ భూములు అక్రమంగా వెంచర్లుగా మారుతున్నా సంబంధిత పంచాయతీ, మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. వెంచర్‌ ఆరంభంలోనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన యంత్రాంగం, రియల్టర్ల నుంచి అందుతున్న నజరానాలకు ఆకర్షితులై మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై కలెక్టర్‌ తక్షణమే స్పందించి, అనుమతులు లేని లేఔట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Sep 09 , 2026 | 01:29 AM