అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Jun 21 , 2026 | 01:06 AM
జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాదాపు ఐదేళ్ల తర్వాత అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో నిరు ద్యోగ మహిళలు, యువతుల్లో ఆశలు చిగురించాయి. జిల్లాలో మొత్తం 64 అంగన్‌వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు శనివారం కలెక్టర్ కోయ శ్రీహర్ష నోటిఫికేషన్ జారీ చేశారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించ నుండగా జూలై 6వ తేదీ వరకు అవకాశం కల్పించారు. జిల్లాలో మొత్తం 706 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో పెద్దపల్లి ప్రాజెక్టు పరిధిలో 305, మంథని ప్రాజెక్టు పరిధిలో 196, రామగుండం ప్రాజెక్టు పరిధిలో 205 కేంద్రాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పెద్దపల్లి ప్రాజెక్టులో 17 మంథని ప్రాజెక్టులో 43, రామగుండం ప్రాజెక్టులో 4 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ 64 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారం భించింది. ఐదేళ్లుగా ఆయా కేంద్రాల్లో టీచర్లు లేక పక్కన గల కేంద్రాల టీచర్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు, అలాగే జిల్లాలో దాదాపు 220 వరకు ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం మరొక నోటిఫికేషన్ జారీ కానున్నది.
ఫ ఐదేళ్ల తర్వాత నోటిఫికేషన్..
రాష్ట్రంలో చివరిసారిగా 2017లో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అయితే వివిధ కారణాలతో నియామక ప్రక్రియ ఆలస్యమై 2021లో పూర్తి చేశారు. ఆ తర్వాత పదవీ విరమణలు, రాజీనామాలు ఇతర కారణాలతో అనేక పోస్టులు ఖాళీ అయ్యాయి. ఈ ఖాళీల భర్తీ కోసం నిరు ద్యోగ మహిళలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రభు త్వం హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేలకుపైగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించి నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే జిల్లాలోనూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఫఇంటర్ అర్హత.. స్థానికులకే అవకాశం
అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. సంబంధిత కేంద్ర పరిధిలో స్థానికులై ఉండడం తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ హ్యాబిటేషన్లలోని కేంద్రాలకు ఆయా సామాజిక వర్గాలకు చెందిన మహిళలకే అవకాశం కల్పించగా, మిగతా కేంద్రాల్లో రోస్టర్ విధానాన్ని అమలు చేయనున్నారు. నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ చైర్‌పర్సన్‌గా, సంబంధిత ఆర్డీవో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సభ్యులుగా, జిల్లా సంక్షేమ అధికారి కన్వీనర్‌గా కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
అభ్యర్థులకు ఇంటర్మీడియట్ మార్కులకు 70 వెయి టేజీ మార్కులు కేటాయించగా, వితంతువులకు 5, అనాథలకు 10, దివ్యాంగులకు 5, ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించారు. మొత్తం వెయిటేజీ ఆధా రంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. నోటిఫికేషన్ విడుదల కావడంతో అంగన్‌వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలు దరఖాస్తుల ప్రక్రియపై దృష్టి సారించారు. జిల్లాలోని ఖాళీల భర్తీతో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ మరింత మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఫప్రాజెక్టుల వారీగా ఖాళీలు..
పెద్దపల్లి ప్రాజెక్టు పరిధిలో 17 టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా, వాటిలో అంగన్‌వాడీ కేంద్రాల వారీగా ఇలా ఉన్నాయి. సుల్తాన్‌పూర్-1, శివపల్లి-1. సుల్తానాబాద్-1, దేవునిపల్లి, గోపాల్‌రావుపేట్-1, కొత్తూర్-1, పెద్దాపూర్, సుద్దాల-3. అబ్బాపూర్-1, ఎలిగేడు-2, కొదురుపాక, మర్రిపల్లి, కమ్మర్‌ఖాన్‌పేట్-1, శ్రీరాంపూర్ -2, మియాపూర్, నర్సాపూర్ 1, సుల్తాన్‌పూర్ -2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రామగుండం ప్రాజెక్టు పరిధిలో వేమునూర్, కుందనపల్లి, ఎక్లాస్‌పూర్-1, ఎల్కలపల్లి-3 ఖాళీగా ఉన్నాయి. మంథని ప్రాజెక్టు పరిధిలో 43 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో కల్వచర్ల-3, లద్నాపూర్-2, ఉప్పరాల కేసారం-1. ఉప్పట్ల-2, కేశనపల్లి-1, లద్నాపూర్-3, గుమునూర్-1, బేగంపేట్-2, నాగారం-1, పెంచికల్‌పేట్-1, పారుపల్లి-2, ఎక్లాస్‌పూర్-3, వెంకటాపూర్-2, రత్నాపూర్-3, లక్కేపూర్-1, కల్వచర్ల-1, పెద్దంపేట-1, బేగంపేట్-1, బేగంపేట్-3, బేగంపేట్-4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెంకట్రావుపల్లి-6, శ్రీరాంనగర్, సిరిపురం-1, మల్లేపల్లి, చిన్న ఓదాల, అడవి శ్రీరాంపూర్, రత్నాపూర్-1, మంథని-8, ఎక్లాస్‌పూర్-1, కమాన్‌పూర్-3, కమాన్‌పూర్-6 ఖాళీగా ఉన్నాయి. మంథని-15, బోయినిపేట, శుక్రవారంపేట, వెంకట్రావుపల్లి-5, ఖాన్‌సాయిపేట, ఎక్లాస్‌పూర్-2, ఓడేడు-1, ఇప్పలపల్లి, అడవి శ్రీరాంపూర్-2, మైదంబండ, మంథని-12 అంగన్‌వాడీ కేంద్రం టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.