Share News

మహిళలకు అండగా జీఆర్‌సీలు

ABN , Publish Date - Feb 25 , 2026 | 01:12 AM

మహిళలకు భద్రత కల్పించే దిశగా తెలంగాణ సర్కార్‌ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు పట్టణ కేంద్రాలకు పరిమితమైన భరోసా కేంద్రాల తరహాలో గ్రామీణ ప్రాంతాల మహిళలకు జెండర్‌ రిసోర్స్‌ సెంటర్‌(జీఆర్‌జీ)లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి.

మహిళలకు అండగా జీఆర్‌సీలు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

మహిళలకు భద్రత కల్పించే దిశగా తెలంగాణ సర్కార్‌ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు పట్టణ కేంద్రాలకు పరిమితమైన భరోసా కేంద్రాల తరహాలో గ్రామీణ ప్రాంతాల మహిళలకు జెండర్‌ రిసోర్స్‌ సెంటర్‌(జీఆర్‌జీ)లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. లింగ వనరుల కేంద్రాలుగా పిలిచే జీఆర్‌సీలు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో పోలీస్‌, మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఇతర శాఖలను భాగస్వామ్యం చేసింది. జిల్లా కేంద్రంలో ఉండే భరోసా కేంద్రానికి మహిళలు రావడానికి ఆర్థికంగా భారం కావడం, ఇతర సమస్యలు కూడా ఉండడంతో జెండర్‌ రిసోర్స్‌ సెంటర్లను త్వరలోనే ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలిదశలో చందుర్తి మండల కేంద్రంలో ప్రారంభించడానికి ఎంపిక చేశారు. కేంద్రం ఏర్పాటుకు రూ.5 లక్షల బడ్జెట్‌ కూడా ప్రభుత్వం కేటాయించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10,653 స్వయం సహాయక సంఘాలు ఉండగా, 1,09,532 మంది స్వశక్తి మహిళలు ఉన్నారు. వీరికి ఉపయోగపడే విధంగా జీఆర్‌సీలు పనిచేస్తాయి. జీఆర్‌సీ కేంద్రంలో గ్రామస్థాయిలో ఆరుగురు, మండల స్థాయిలో 10 మంది సభ్యులుగా ఉంటారు. స్వచ్ఛంద, సామాజిక సేవా దృక్పథం కలిగినవారు, మహిళల సమస్యలపై అవగాహన కలిగిన వారు, సమస్యలను పరిష్కరించే చొరవ, నైపుణ్యం ఉన్నవారిని సభ్యులుగా ఎంపిక చేస్తారు. ప్రభుత్వం వీరికి శిక్షణ కూడా ఇవ్వనున్నది.

ప్రతి మండలంలో కేంద్రంలో..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం చందుర్తి మండల కేంద్రంలో జీఆర్‌సీ కేంద్ర ఏర్పాటు చేయనున్నారు. తర్వాత కాలంలో ప్రతి మండలం కేంద్రంలో జీఆర్‌సీలను ఏర్పాటు చేస్తారు. గ్రామీణ మహిళలు గృహహింస, లింగ వివక్ష, లైంగిక వేధింపులు, సామాజిక, ఆర్థిక సమస్యలకు సంబంధించిన వాటిని పరిష్కరించే దిశగా జీఆర్‌సీలు పనిచేస్తాయి. జీఆర్‌సీలోని సామాజిక కార్యాచరణ కమిటీ మహిళలకు పూర్తిగా అండగా నిలుస్తాయి. మండలంలోని మహిళకు పరిచయస్తులు సభ్యులుగా ఉండడం వల్ల బాధితులు తమ సమస్యలు నిర్భయంగా చెప్పుకోగలరని భావిస్తున్నారు. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జీఆర్‌సీలో సామాజిక కార్యాచరణ కమిటీ సభ్యులు అందుబాటులో ఉంటారు. ప్రతి కేంద్రంలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటుచేసి వాటిలో వచ్చే వినతులను విచారిస్తారు. అంతేకాకుండా మహిళల చట్టాలపై అవగాహన కల్పిస్తారు.

ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో జీఆర్‌సీలు..

జెండర్‌ రిసోర్స్‌ సెంటర్‌ ద్వారా మహిళా సాధికారత, లింగ సమానత్వం ప్రోత్సహించడంలో కీలకంగా పనిచేస్తుంది. సమాజంలో అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని, ఆర్థిక, సామాజిక అభివృద్ధిని పెంపొందించడానికి దోహదపడుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని స్వయం సహాయక సంఘాలు, మండల, జిల్లా సమైక్యలను బలపరుస్తూ సుస్థిరమైన కల్పించడానికి కృషి చేస్తుంది. మహిళలు ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాలను కూడా పెంపొందిస్తాయి. సంబంధించిన ప్రభుత్వ పథకాలు, చట్టాలు, ఇతర విషయాలు తెలుసుకోవడానికి కూడా జీఆర్‌సీలు సమాచార కేంద్రాలుగా చేస్తాయి. ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌, కేరళ, గుజరాత్‌ రాష్ట్రాల్లో పనిచేస్తున్నాయి. జీఆర్‌సీల వల్ల ఫలితాలు ఉండడంతో తెలంగాణలో కూడా వచ్చే నెలలో ప్రారంభ కానున్నాయి.

Updated Date - Feb 25 , 2026 | 01:12 AM