Share News

వైభవంగా కృష్ణాష్టమి

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:15 AM

నగరంలోని దేవాలయాల్లో శుక్రవారం కృష్ణాష్టమి పూజలు వైభవంగా నిర్వహించారు. చిన్నారులు కృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలతో సందడి చేశారు.

వైభవంగా కృష్ణాష్టమి

కరీంనగర్‌ కల్చరల్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : నగరంలోని దేవాలయాల్లో శుక్రవారం కృష్ణాష్టమి పూజలు వైభవంగా నిర్వహించారు. చిన్నారులు కృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలతో సందడి చేశారు. సాయినగర్‌ మురళీకృష్ణ మందిరంలో సుందర సత్సంగ్‌ ఆధ్వర్యంలో గోపూజ, అభిషేకం, సర్వదర్శనం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, సాయంత్రం నుంచి చిన్నారుల శ్రీకృష్ణ, రాధ, గోపికల వేషధారులచే శోభాయాత్ర, బహుమతుల ప్రదానం, రాత్రి 12 గంటల వరకు భజనలు, నృత్య ప్రదర్శనలు, ఉయ్యాల సేవ, ఉట్టి కొట్టుట, 108 ప్రసాదాల సమర్పణ, వితరణ జరిగాయి. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు బొడ్ల కృష్ణ, ఇ సురేందర్‌రావు సభ్యులు పాల్గొన్నారు. అశోక్‌నగర్‌ మళయాళ సద్గురు గీతామందిరంలో మఠాధిపతి విష్ణుసేవానందగిరిస్వామి ఆధ్వర్యంలో అభిషేక అర్చనలు, అలంకారం, సహస్రనామార్చన, తులాభారం, స్వామీజి ప్రవచనం జరిగాయి. సాయంత్రం భజనలు, శోభాయాత్ర, 108 రకాల నైవేద్యాలు, డోలోత్సవం నిర్వహించారు. గీతా భక్త సమాజం ఆధ్వర్యంలో భగవద్గీత, విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది. ఉజ్వల పార్క్‌ వద్ద గల ఇస్కాన్‌ దేవాలయంలో సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భజనలు, నృత్యాలు జరిగాయి. ఇస్కాన్‌ కరీంనగర్‌ బాధ్యుడు నరహరి ప్రభుదాస్‌ శ్రీకృష్ణ తత్వాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో కన్న కృష్ణ, డాక్టర్‌ ఎల్‌ రాజభాస్కర్‌రెడ్డి, తుమ్మల రమేశ్‌రెడ్డి, డాక్టర్‌ బుర్ర మధుసూదన్‌రెడ్డి, కొమురవెల్లి వేంకటేశం పాల్గొన్నారు. పాతబజార్‌ గౌరీశంకరాలయంలో చెన్నకేశవస్వామికి అభిషేక, అర్చనలు జరిపారు.

Updated Date - Sep 05 , 2026 | 12:15 AM