Share News

గ్రామసభలు గాడి తప్పొద్దు

ABN , Publish Date - Sep 09 , 2026 | 01:32 AM

ఉపాధి పనుల ఎంపిక కోసం నాలుగు రోజులుగా జిల్లాలో మళ్లీ గ్రామసభలను నిర్వహిస్తున్నారు. వికసిత్‌ భారత్‌-2047 లక్ష్య సాధనలో భాగంగా గ్రామీణాభివృద్దిలో ఉపాధిహామీ పథకం ప్రాధాన్యాన్ని పెంచాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.

గ్రామసభలు గాడి తప్పొద్దు

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌)

ఉపాధి పనుల ఎంపిక కోసం నాలుగు రోజులుగా జిల్లాలో మళ్లీ గ్రామసభలను నిర్వహిస్తున్నారు. వికసిత్‌ భారత్‌-2047 లక్ష్య సాధనలో భాగంగా గ్రామీణాభివృద్దిలో ఉపాధిహామీ పథకం ప్రాధాన్యాన్ని పెంచాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. వీలైనంత ఎక్కువ మందికి ఏడాదిలో 125 రోజుల పనిదినాలను కల్పించాలని సూచనలు జారీ చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లాలకు పనుల ఎంపిక చేపట్టాలనే ఆదేశాలు అందాయి. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను పంపించింది. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభానికి ముందు క్షేత్రస్థాయిలో పనుల అంచనాను గ్రామాలవారీగా నిర్వహించారు. చాలాచోట్ల ఆశించిన విధంగా ఉపాధి లభించడానికి ఈ పనులు సరిపోలేదు. మొక్కుబడి తంతుగా అప్రాధాన్య పనులను గుర్తించారనే విమర్శలు కూలీల నుంచి వినిపించాయి.

ఫ నాలుగు కేటగిరీల్లో గుర్తింపు

నీటి భద్రత, గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధి పెంపు, విపత్తుల నిర్వహణ.. ఇలా నాలుగు కేటగిరీల్లో గ్రామంలో కొత్త పనులను ఎంపిక చేస్తారు. ఇందుకోసం ఎంపీడీవో నాయకత్వంలో మరో ఇద్దరు అధికారులతో ప్రణాళిక టీమ్‌ను ప్రతి మండలంలో ఏర్పాటు చేశారు. ఊళ్లలో ఉన్న వాస్తవ స్థితిగతుల్ని అంచనా వేస్తూ ఉపాధి పనులను మరింతగా కూలీలకు అందించేలా కార్యాచరణను సిద్ధం చేయాలి. ఇందుకు మూడు విడతలుగా గ్రామసభలను నిర్వహించి ప్రజల ఆమోదం పొందాలి. వీబీ జీరాంజీ పథకంలో భాగంగా వికసిత్‌ గ్రామపంచాయతీ ప్రణాళిక(వీజీపీపీ)లను సిద్ధం చేసి 15 రోజుల్లోగా కలెక్టరు ఆమోదానికి పంపాలి. క్షేత్రస్థాయిలో వీటి ఎంపిక విషయంలో ఉపాధిహామీ సిబ్బంది ఏ మేరకు శ్రద్ధను కనబరుస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ చాలా గ్రామాలకు అసలు ఈ తరహాలో పనులను మళ్లీ గుర్తిస్తున్నామనే సంకేతాలు చేరలేదు.

ఫ ఎక్కువ కుటుంబాలకు మేలు జరిగేలా..

జిల్లాలోని 323 గ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఏప్రిల్‌ నుంచి 5 నెలలు పూర్తియింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న కూలీల్లో 45 కుటుంబాల్లోని జాబ్‌కార్డుదారులకు మాత్రమే వంద రోజుల పని దక్కింది. జిల్లా వ్యాప్తంగా యాక్టివ్‌ జాబ్‌ కార్డు ఉన్న వారు 1.16 లక్షల మంది ఉన్నారు. 40వేలకుపైగా కుటుంబాల వాళ్లు ఉపాధి హామీ పనులనే నమ్ముకుని జీవనం గడుపుతున్నారు. గతేడాది చాలా కుటుంబాలకు వందరోజుల పని అందని ద్రాక్షగానే మిగిలింది. ఈసారి 125 రోజులు పని అందించాలని కేంద్ర సర్కారు నిశ్చయించడంతో ఈ దిశగా గ్రామసభల్లో గట్టి ప్రయత్నాలు జరగాలి. ప్రజలను భాగస్వామ్యులను చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పనులను గమనిస్తూ నిర్ణయాలు తీసుకుంటేనే కూలీలకు ఏడాది పొడువునా చేతినిండా పని దొరకనుంది. ఈ దిశగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి.

Updated Date - Sep 09 , 2026 | 01:32 AM