ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి
ABN , Publish Date - May 10 , 2026 | 12:38 AM
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని మ్యాచర్ వచ్చిన వెంటనే తూకం వేసి రైస్‌మిల్లులకు తరలించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ సత్యప్రసాద్
ధర్మపురి, మే 9 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని మ్యాచర్ వచ్చిన వెంటనే తూకం వేసి రైస్‌మిల్లులకు తరలించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ధర్మపురి మండలంలోని పెద్దనక్కలపేట, దొనూర్, తిమ్మాపూర్ గ్రామాల్లో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సంబంధిత అధికారులు, సెంటర్‌ల నిర్వాహకులతో మాట్లాడి ధాన్యం నిల్వలు, తూకం వేసి రైస్‌మిల్స్‌కు పంపించిన వివరాలు అడిగి తెలసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ధాన్యం తూకం, నిల్వ, రవాణా ప్రక్రియల్లో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదని ఆయన అన్నారు. రైతులకు సమగ్ర సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన తెలిపారు. అకాల వర్షాలు ఉన్నందున వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కొనుగోలు కేంద్రాల వద్ద గన్ని సంచులు, తార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆయన అన్నారు. కొనుగోలు చేసి వెంటనే డాటా ఎంట్రీ చేసి రైతులకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా చూడాలని ఆయన అన్నారు. రైస్‌మిల్లుల వద్ద త్వరగా అన్లోడింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఆయన వెంట ధర్మపురి మండల తహసీల్దార్ ఏరుకొండ శ్రీనివాస్, ఆర్‌ఐ భాస్కర్‌రావు, సెంటర్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి
వెల్గటూర్: అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్య ప్రసాద్ సూచించారు. శనివారం వెల్గటూర్ మండలం శాఖాపూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్ని మ్యాచర్ వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు గన్నీ సంచులు, టార్పాలిన్‌లు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతులకు ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా చూడాలని అన్నారు. మిల్లుల వద్ద త్వరగా అన్లోడింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శేఖర్, పీఏఎస్ చైర్మన్ గోలి రత్నాకర్, పీఏసీఎస్ సీఈవో పూర్ణచందర్, సిబ్బంది, నిర్వాహకులు పాల్గొన్నారు.