ధాన్యం కొనుగోళ్లలో మారని తీరు
ABN , Publish Date - May 27 , 2026 | 01:02 AM
రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం
- కేంద్రాలలోనే రాశులుగా ధాన్యం
- ముంచుకొస్తున్న వర్షాలతో రైతుల ఆందోళన
- ఇప్పటి వరకు 2.40 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
- మరో 1.16 మెట్రిక్ టన్నులు కొనాల్సి ఉందని అంచనా
- రైతుల వద్ద మరో 3 లక్షల టన్నులు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం.. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి.. అంటూ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను వారంలో రెండుసార్లు వీడియో కాన్ఫరెన్సుల్లో ఆదేశిస్తున్నా ... సాక్షాత్తు అధికారపార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి ... లారీల్లో కూర్చుండి.. కొనుగోళ్లను... ధాన్యం తరలింపును స్వయంగా పర్యవేక్షిస్తున్నా... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ రాత్రి వేళ కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తూ అవసరమైన ఆదేశాలిస్తున్నా... ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగడం లేదు. ముంచుకొస్తున్న వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
- పేరుకుపోతున్న ధాన్యం రాశులు
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులుగా పేరుకొని పోతుండగా రైతుల పొలాల్లో ఇంకా కొనుగోలు కేంద్రాలకు తేవలసిన ధాన్యం కుప్పలుగా పడిఉన్నాయి. అధికారుల అంచనాల మేరకే ఇంకా లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉన్నది. వాస్తవంగా పరిశీలిస్తే ఇంకా సుమారు 2 లక్షల టన్నుల పైచిలుకు ధాన్యం రైతుల వద్దే ఉన్నది. ఒకవైపు నైరుతి రుతుపవనాలు సమీపించడం, మరోవైపు అల్పపీడనాలతో అకాలవర్షాల బెడద ఉన్నట్లుగా వాతావరణ శాస్త్రజ్ఞుల హెచ్చ రిస్తుండడంతో రైతులు ధాన్యం ఎక్కడ తడిసిపోతుందోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గన్నీ బ్యాగులు లేక రైతులే బ్యాగులు కొనుక్కొని వస్తామన్నా తరుగు తీయనిదే తూకం వేసేది లేదంటున్న కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కొను గోలు చేసిన ధాన్యాన్ని తరలించేందుకు అందుబాటులో లేని లారీల కారణంగా కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ఆయా కేంద్రాల్లో ఉండే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి జవాబుదారులే అయినా కొనుగోలు కేంద్రాలలో నేరుగా ట్రక్‌షీట్ ఇవ్వకుండా రైసుమిల్లర్ల వద్దకు వెళ్లి అది తీసుకోవలసి రావడంతో 40 కిలోల బస్తాకు 3 కిలోల చొప్పున క్వింటాల్‌కు 10 కిలోల తరుగు ఇచ్చిన వారికే ట్రక్‌షీట్‌లు ఇస్తూ ధాన్యం తరలింపునకు మార్గం కల్పించడం తీవ్ర జాప్యానికి కారణమవుతున్నది. కొనుగోలు కేంద్రాలలో తూకం వేసి ధాన్యాన్ని ఖరీదు చేసినా కేవలం ఇన్ని బస్తాల ధాన్యం అంటూ స్లిప్ రాసి ఇస్తున్నారే తప్ప ఎంత ధాన్యం కొనుగోలు చేసింది ఇవ్వడం లేదు. రైసుమిల్లర్లు తాము తీసుకునే తరుగును మినహాయించుకొని మిగిలిన ధాన్యం కొనుగోలు చేసినట్లు ట్రక్‌చిట్ ఇస్తుండడంతో ఆమేరకే రైతులకు డబ్బు సివిల్ సప్లయిశాఖ పంపిస్తున్నది. దీనితో రైతులు క్వింటాల్‌కు 24 రూపాయల చొప్పున నష్టపోతున్నారు. ఎకరా పేరిట 700 నుంచి 800 రూపాయల మేరకు నష్టపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
- 2,65,000 ఎకరాల్లో వరి సాగు
ఈ యాసంగి సీజన్‌లో 2,65,000 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 45 వేల ఎకరాల్లో సీడ్ ఉత్పత్తి చేశారు. మిగిలిన 2,20,000 ఎకరాల్లో సాధారణ వరి సాగు చేయగా ఎకరాకు 35 క్వింటాళ్ల చొప్పున సుమారు 9లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. అయితే ప్రభుత్వం 3.64 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలలో విక్రయిస్తారని మాత్రమే అంచనా వేసింది. రైతుల నుంచి ఎకరాకు 32 క్వింటాళ్ల చొప్పున కొనేందుకు అంగీకరించింది. ఆ లెక్కన 2,20,000 ఎకరాల్లో ఎకరాకు 32 క్వింటాళ్ల చొప్పున 83లక్షల 84వేల క్వింటాళ్లు 8.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ సీజన్‌లో కొనుగోలు చేయాలి. ఇందులో లక్షన్నర టన్నులు ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసినా 7 లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు రావలసి ఉన్నది. అయితే జిల్లా అధికారులు 3.64 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. ఇప్పటి వరకు జిల్లాలో 2,47,046 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. అధికారుల అంచనాల మేరకైనా మరో 1,16,954 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇంకా రైతుల వద్ద నుంచి కొనాల్సి ఉన్నది. అనధికారిక లెక్కల ప్రకారం 3 లక్షల టన్నులకుపైగా ఇంకా రైతుల వద్దే ధాన్యం ఉన్నట్లు భావిస్తున్నారు.
- బోనస్ ఊసేలేదు
ఇప్పటి వరకు జిల్లాలో 35,622 మంది రైతులకు చెందిన 586 కోట్ల 29 లక్షల విలువ చేసే 2,47,046 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందులో 2,12,028 టన్నుల ధాన్యం కొనుగోలు అయినట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. అయితే ఇప్పటి వరకు 1,97,429 టన్నుల ధాన్యం అమ్మకాలకు మాత్రమే ట్రక్‌షీట్ జనరేట్ అయింది. రైతులు అందులో తమకు 1,87,834 టన్నుల ధాన్యం మిల్లులకు చేరిందని ధ్రువీకరణ చేశారు. ఈ లెక్కల ప్రకారం సివిల్ సప్లయ్ నుంచి 26,889 మంది రైతులకు లక్షా 86,491 టన్నుల వరి ధాన్యానికి 443 కోట్ల 14 లక్షల రూపాయలు బ్యాంకుల్లో జమ అయ్యాయి. కొనుగోలు చేసిన ధాన్యంకు సంబంధించిన 143 కోట్ల 15 లక్షల రూపాయలు రైతులకు బకాయి ఉన్నాయి. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యంలో 5,243 టన్నులు సన్నరకం వరిధాన్యం కాగా వీటికి క్వింటాల్‌కు 500 చొప్పున 2.62 కోట్ల రూపాయలను బోనస్‌గా చెల్లించాల్సి ఉన్నది. ఇప్పటి వరకు రైతులకు ఎలాంటి బోనస్ చెల్లించలేదు. వర్షాలు రాకముందే వారం రోజుల్లోగా తాము పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
- పది రోజులు దాటినా కొనుగోలు చేయడం లేదు
- రామకృష్ణ, రైతు, కేశవపట్నం
కేశపట్నం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకవచ్చి పదిరోజులు దాటింది. మార్కెట్‌లో కొనుగోలు జరుగడం లేదు. రైసుమిల్లులో ధాన్యం దిగుమతి చేసుకోకుండా రోజుల తరబడి ట్రాక్టర్లను ఉంచడంతో కొనుగోలు కేంద్రాలకు ట్రాక్టర్లను కిరాయికి పంపించడం లేదు. గోదాములు ఖాళీ లేవని గత ఐదు రోజుల నుంచి కొనుగోలు జరుపడం లేదు. ధాన్యంలో తేమ శాతం తగ్గి బరువు తగ్గుతుంది. ధాన్యం నూక అవుతుందని తరుగు తీస్తూ కామన్ కింద కొనుగోలు చేస్తున్నారు.
- 26 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదు
- దొడ్డ వెంకటేశ్వర్‌రెడ్డి, రైతు, వెదిర
కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి 26 రోజులు అవుతున్నప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడం లేదు. లైను రావడం లేదని, ఇతరత్రా కారణాలతో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఇక్కడే ఉండాల్సి వస్తోంది. వర్షం పడుతుందనే భయం ఒకవైపు, ఎండలు, తిండి తిప్పలు లేకుండా ఇబ్బందులు మరోవైపు. ధాన్యం కొనుగోళ్లను వేగం చేయాలి.