చివరి దశకు ధాన్యం కొనుగోళ్లు
ABN , Publish Date - Jan 02 , 2026 | 12:49 AM
ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు చివరి దశకు చేరుకున్నాయి.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు చివరి దశకు చేరుకున్నాయి. పౌరసరఫరాల శాఖ లక్ష్యానికి చేరువైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 239 కేంద్రాలను ప్రారంభించగా, 237 కేంద్రాల్లో కొనుగోళ్లు ముగిసిపోవడంతో కేంద్రాలను మూసివేశారు. జిల్లాలో రెండు కేంద్రాలు మానాల, బడితండాలో కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. వానాకాలం సీజన్లో 1.84 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. దీని ద్వారా 4.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా 2.70 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుంది. కొనుగోలు లక్ష్యం చేరువగా ఇప్పటివరకు 2.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యం విక్రయించిన 47349 మంది రైతుల ఖాతాల్లో రూ 632.68 కోట్లు ధాన్యం డబ్బులు జమ చేశారు.
ఇప్పటివరకు 2.68 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు..
జిల్లాలో వానాకాలానికి సంబంధించిన ధాన్యం దిగుబడి అంచనా 4.54 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని వేశారు. ఇందులో పౌరసరఫరాల శాఖ 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 47,603 మంది రైతుల నుంచి 2,68,056 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లాలోని 260 గ్రామపంచాయతీలు ఉండగా, 239 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వీటి ద్వారా ఐకెపీ 159 కేంద్రాల ద్వారా 1,59,110 మెట్రిక్ టన్నులు, 72 సింగిల్ విండోల ద్వారా 1,00,059 మెట్రిక్ టన్నులు, డీసీఎంఎస్ ఒక కేంద్రం ద్వారా 2,970 మెట్రిక్ టన్నులు, ఏడు మెప్మా కేంద్రాల ద్వారా 5,916 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఈసారి రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండానే కొనుగోళ్లు పూర్తిచేశారు. పౌరసరఫరాల శాఖ 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా వేయగా, 2.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది.
రైతులకు రూ 632.68 కోట్లు చెల్లింపు..
జిల్లాలో 47,608 మంది రైతుల నుంచి 2,68,056 మెట్రిక్ టన్నుల ధాన్యం పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేసింది. రైతులకు రూ.640.39 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు 47,349 మంది రైతుల ఖాతాల్లో రూ.632.68 కోట్లు జమ చేశారు. ఐకేపీ ద్వారా రూ.380.11 కోట్లు, సింగిల్‌విండోల ద్వారా రూ.239.04 కోట్లు, డీసీఎంఎస్ ద్వారా రూ.7.10 కోట్లు, మెప్మా ద్వారా రూ.14.14 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
ఖరీఫ్ సన్న ధాన్యానికి బోనస్ రూ.4.14 కోట్లు చెల్లింపు
ప్రభుత్వం సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ డబ్బులు యాసంగికి సంబంధించి పెండింగ్‌లో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన బోనస్ డబ్బులు మాత్రం రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 వేల ఎకరాల్లో సన్న రకం వడ్లు పండించారు. పౌర సరఫరాల శాఖ 13,060 మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన క్వింటాలుకు రూ.500 బోనస్ సంబంధించి రూ.4.14 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. రూ.2.28 కోట్లు పెండింగ్‌లో ఉంది.