సవాల్‌గా ధాన్యం కొనుగోళ్లు..
ABN , Publish Date - Mar 25 , 2026 | 12:30 AM
ఈ యాసంగి సీజన్‌లో సాగైన ధాన్యాన్ని కొనుగోలు చేయడం ప్రభుత్వానికి సవాల్‌గా మారనున్నది. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా బియ్యం సేకరణ కోటా తగ్గించడం, అలాట్‌మెంట్ లేనిదే సీఎంఆర్ కింద రైస్‌మిల్లర్లు ధాన్యాన్ని తీసుకోమని చెబుతుండడంతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేది ఎలా అని ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఈ యాసంగి సీజన్‌లో సాగైన ధాన్యాన్ని కొనుగోలు చేయడం ప్రభుత్వానికి సవాల్‌గా మారనున్నది. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా బియ్యం సేకరణ కోటా తగ్గించడం, అలాట్‌మెంట్ లేనిదే సీఎంఆర్ కింద రైస్‌మిల్లర్లు ధాన్యాన్ని తీసుకోమని చెబుతుండడంతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేది ఎలా అని ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నది. ధాన్యం నిల్వల కోసం ప్రత్యామ్నాయం చూడాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు కలెక్టర్లను ఆదేశించడంతో జిల్లాలో గల గోదాములను కలెక్టర్ ఆ శాఖాధికారులతో కలిసి అన్వేషణలో పడ్డారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో దొడ్డు రకం 1,65,461 ఎకరాలు, సన్న రకం 12,454 ఎకరాలు, మొత్తం 1,77,915 ఎకరాల్లో వరి పంట సాగయ్యింది. ఎకరానికి సగటున 27.79 క్వింటాళ్ల వరకు మొత్తం 4,94,425 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో విత్తనోత్పత్తి కోసం 1,557 టన్నుల ధాన్యం పోతుందని, తమ అవసరాల కోసం నేరుగా మిల్లర్లు, ఇతర వ్యాపారులు 42,868 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే జిల్లాలో ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 4 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకోసం 334 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నది. అయితే యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరగనున్నాయి. వెంటవెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను రానున్నది. అక్కడ కాంటా పెట్టిన తర్వాత గోదాములకు తరలించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి.
ఫ బియ్యం కోటాను తగ్గించిన ఎఫ్‌సీఐ..
యాసంగి సీజన్‌కు సంబంధించి రాష్ట్రం నుంచి 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరిస్తామని ఎఫ్‌సీఐ తేల్చి చెప్పింది. ఇది కాస్త మరో 50 వేల టన్నులకు పెరిగే అవకాశాలున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్‌లో సాగు చేసిన ప్రకారం 95 లక్షల నుంచి కోటి మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడులు వస్తాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అంచనా వేసింది. ‘రైతులు పండించిన ప్రతీ గింజా కొనుగోలు చేస్తాం’ అని అసెంబ్లీ వేదికగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా తీసుకునే బియ్యం పోనూ మిగతా ధాన్యాన్ని నిల్వ చేసేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆ శాఖ ఉన్నతాధికారులు సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. రైస్‌మిల్లర్లు మాత్రం బాయిల్డ్ బియ్యం అలాట్‌మెంట్ ఇస్తేనే ధాన్యాన్ని సీఎంఆర్ కింద తీసుకుంటామని చెబుతున్నారు. జిల్లాలో 4 లక్షల 50 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యం పెట్టుకోగా, ఎఫ్‌సీఐ నిర్ధేశించే బియ్యం కోటా ప్రకారం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కింద బ్యాంకు డిపాజిట్లు ఇచ్చే రైస్‌మిల్లర్లకు కేటాయించనున్నారు. మిగతా ధాన్యాన్ని నిల్వ చేసేందుకు ప్రత్యామ్నాయంగా చర్యలు చేపడుతున్నారు.
ఫ గోదాముల కోసం అన్వేషణ..
జిల్లాలో వివిధ విభాగాల కింద గల గోదాములను అధికారులు పరిశీలిస్తున్నారు. జిల్లాలో పెద్దపల్లిలో ఒక ఎస్‌డబ్ల్యూసీ, వ్యవసాయ మార్కెట్ యార్డుల ద్వారా గర్రెపల్లి, ధర్మారం, సుల్తానాబాద్, మంథని, కాల్వశ్రీరాంపూర్, పెద్దపల్లి, పొత్కపల్లి, ఇంటిగ్రేటెడ్ గోదాములు రాఘవాపూర్, రంగాపూర్, సుల్తానాబాద్, కాట్నపల్లి, సుద్దాల 1, సుద్దాల 2, సుద్దాల 3, పెద్దబొంకూర్, గర్రెపల్లిలో ఒక సీడబ్ల్యూసీ, ఐకేపీ ద్వారా వెయ్యి టన్నులు గల గోదాములు, సింగిల్‌విండోల ద్వారా వెయ్యి టన్నుల సామర్థ్యం గల గోదాములు ఉన్నాయి. మొత్తం వీటి సామర్థ్యం 5,11,400 మెట్రిక్ టన్నులు కాగా, ప్రస్తుతం వాటిలో 4,28,333 టన్నుల నిల్వలు ఉన్నాయి. 83,067 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసేందుకు స్థలం ఉందని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెల నుంచి మూడు నెలలకు సంబంధించి రేషన్ బియ్యాన్ని ఒకేసారి వచ్చే నెలలో వినియోగదారులకు ఇవ్వనున్నందున జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు సరఫరా చేసేందుకు అలాట్‌మెంట్ ఇచ్చినట్లయితే మరో 30 వేల టన్నుల వరకు నిల్వలు ఖాళీ కానున్నాయని అధికారులు చెబుతున్నారు. మంగళవారం కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ డి వేణు, డీఎస్‌వో శ్రీనాఽథ్, సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్‌రెడ్డితో కలిసి పెద్దపల్లి, రాఘవాపూర్‌లోని గోదాములను పరిశీలించారు.