Share News

మూడు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:17 AM

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మూడు రోజుల్లో ముగుస్తాయని కలెక్టర్‌ చిత్రా మిశ్రా తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ధాన్యం నిల్వలను ఆమె బుధవారం పరిశీలించారు.

మూడు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి
ధాన్యం నిల్వలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా

కరీంనగర్‌, జూన్‌ 3 (ఆంరఽధజ్యోతి ప్రతినిధి): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మూడు రోజుల్లో ముగుస్తాయని కలెక్టర్‌ చిత్రా మిశ్రా తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ధాన్యం నిల్వలను ఆమె బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 96 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని, 236 కొనుగోలు కేంద్రాలు మూసివేశామన్నారు. జిల్లాలో 317 కొనుగోలు కేంద్రాల్లో రైతులు అమ్మకానికి తీసుకు వచ్చిన ధాన్యం సేకరణ 96 శాతం పూర్తయ్యిందన్నారు. ఈ యాసంగికి 317 కొనుగోలు కేంద్రాల్లో 3,32,098 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. దీనికి గాను రైతులకు 628 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. ఈ నెల 6లోగా మిగతా 81 కేంద్రాల్లో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. హుజూరాబాద్‌ నియోక వర్గంలోని హుజూరాబాద్‌, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట మండలాల్లో మానకొండూర్‌ నియోజక వర్గంలోని మానకొండూర్‌, శంకరపట్నం మండలాలోల ధాన్యం కొనుగోలు ప్రక్రియ వంద శాతం పూర్తయ్యిందని తెలిపారు. చొప్పదండి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కొనుగోలు ప్రక్రియ మూడు రోజుల్లో ముగియనుందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం నుంచి 3,16,926 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించామని, 95 శాతం తరలింపు ప్రక్రియ పూర్తయిందన్నారు. 13,139 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాల్లో ఉందన్నారు.

Updated Date - Jun 04 , 2026 | 12:17 AM