Share News

ధాన్యం దళారుల పాలు..

ABN , Publish Date - Nov 18 , 2026 | 01:15 AM

వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. రైతులకు మద్దతు ధర అందించేం దుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు సాగడం లేదు.

ధాన్యం  దళారుల పాలు..

‘ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలి.. కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమచేస్తాం... దళారులకు ధాన్యం విక్రయించి నష్టపోవద్దు..’ ధాన్యం కొనుగోలు సందర్భంగా ప్రజాప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు ఇవి. అయితే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు నామ్‌కేవాస్తేగా ప్రారంభించి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోలు పరిస్థితిపై ఫోకస్‌...

పెద్దపల్లి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. రైతులకు మద్దతు ధర అందించేం దుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు సాగడం లేదు. మరోవైపు ప్రైవేట్‌ వ్యాపారులు, రైస్‌ మిల్లర్లు, దళారులు గ్రామాల్లోకి వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుండటంతో మార్కెట్‌పై వారి ఆధిపత్యం పెరుగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 70 శాతం ధాన్యాన్ని మిల్లర్లు, ప్రైవేట్‌ వ్యాపారులు కొనుగోలు చేయగా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యం కేవలం 30 శాతమేనని అంచనా.

ఫ 300 కేంద్రాలు ప్రారంభం.. 12 చోట్లే కొనుగోళ్లు

జిల్లాలో మొత్తం 311 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 241, ఐకేపీ 65, హకా 5 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పటివరకు 300 కేంద్రాలను ప్రారంభించారు. ప్రారంభమైన కేంద్రాల్లో కేవలం 12 చోట్లే ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయి. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 350 టన్నుల ధాన్యాన్ని మాత్రమే అధికారికంగా కొనుగోలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే వందలాది కేంద్రాలు ప్రారంభించినా చాలా చోట్ల కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాలేదు.

ఫ మిల్లుల కేటాయింపులో జాప్యం...

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో కీలకమైన రైస్‌మిల్లుల కేటాయింపు ఇంకా పూర్తిస్థాయిలో జరగలేదు. జిల్లాలో 200కు పైగా రైస్‌మిల్లులు ఉండగా, ఇప్పటివరకు కేవలం 11 మిల్లులకు మాత్రమే కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించేందుకు అలాట్‌మెంట్‌ ఇచ్చినట్లు సమాచారం. మిల్లుల కేటాయింపులు పూర్తికాకపోవడం, కొనుగోళ్లకు అవసరమైన ప్రక్రియలో జాప్యం జరగడం వల్ల కేంద్రాల్లో ధాన్యం సేకరణ మందకొడిగా సాగుతోంది. దీంతో రైతులు ప్రభుత్వ కేంద్రాల కోసం ఎదురుచూడకుండా ప్రైవేట్‌ వ్యాపారుల వైపు మొగ్గు చూపుతున్నారు.

ఫ మంథని నుంచి ఇతర రాష్ట్రాలకు తరలింపు..

మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల పరిధిలో ప్రైవేట్‌ వ్యాపారుల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా మంథని ప్రాంతంలో వ్యాపారులు రోజుకు 10 నుంచి 12 లారీల ధాన్యాన్ని కొనుగోలు చేసి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ సేకరణ నత్తనడకన సాగుతుండగా, ఇతర రాష్ట్రాల వ్యాపారులు సైతం రంగంలోకి దిగి రైతుల నుంచి నేరుగా ధాన్యాన్ని సేకరిస్తున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో రైస్‌మిల్లర్లు సైతం పొలాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.

ఫ కేంద్రాల్లో నిల్వలు.. వ్యాపారుల కొనుగోళ్లు!

రైతులకు పొలాల వద్ద ధాన్యం నిల్వ చేసుకునేందుకు తగిన స్థలం లేకపోవడం, ప్రైవేట్‌ వ్యాపారుల లారీలు నేరుగా పొలాల వద్దకు చేరుకోలేని పరిస్థితుల్లో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వడ్లను తరలిస్తున్నారు. అక్కడ నిల్వ చేసుకున్న ధాన్యాన్ని ప్రైవేట్‌ వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. దీంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అధికారికంగా ధాన్యం సేకరించే కేంద్రాల కంటే ప్రైవేట్‌ వ్యాపారులకు అనుకూలమైన విక్రయ వేదికలుగా మారుతున్నాయి.

ఫ సన్న వడ్లకు రూ. 2700 వరకు ధర..

ప్రైవేట్‌ వ్యాపారులు పచ్చి సన్న వడ్లకు క్వింటాలుకు రూ.2650 నుంచి రూ.2700 వరకు ధర చెల్లిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర కంటే ప్రైవేట్‌ మార్కెట్‌లోనే ఎక్కువ ధర లభిస్తుండటంతో రైతులు వ్యాపారులకు విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా సన్న రకాల ధాన్యా నికి డిమాండ్‌ ఉండటంతో మిల్లర్లు, ట్రేడర్లు నేరుగా కొనుగోళ్లు చేస్తున్నారు. రైతులకు తక్షణ నగదు చెల్లింపులు, రవాణా ఇబ్బందులు లేకపోవడం వంటి అంశాలు కూడా ప్రైవేట్‌ కొనుగోళ్లకు కలిసి వస్తున్నాయి.

ఫ అరకొరగా ప్రభుత్వ కొనుగోళ్లు

300 కేంద్రాల ప్రారంభించి కొనుగోళ్లు 12 కేంద్రాలకే పరిమితం కావడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. జిల్లాలో దిగు బడైన ధాన్యంలో సుమారు సగం మేరకు ఇప్పటికే ప్రైవేట్‌ వ్యాపారులు, ఇతర రాష్ట్రాల కొనుగోలుదారుల చేతుల్లోకి వెళ్లినట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు మద్దతు ధర అందించడంతోపాటు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల లక్ష్యం నెరవేరాలంటే మిల్లుల కేటాయిం పులను వేగవంతం చేసి, అన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారం భించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ కొనుగోళ్లు ఆలస్యమవుతున్న కొద్ది ప్రైవేట్‌ వ్యాపారుల చేతుల్లోకి ధాన్యం వెళ్లిపోతుండటంతో ఈ సీజన్‌లో ప్రభుత్వ సేకరణ లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Updated Date - Nov 18 , 2026 | 01:15 AM