రైతుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం
ABN , Publish Date - May 11 , 2026 | 12:08 AM
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, మే 10 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ఇల్లంతకుంట, ముస్కానిపేట గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆదివారం రైతుల సమస్యలు అడిగితెలుసుకున్నారు. సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని, రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకవచ్చి రోజులు గడుస్తున్నా నత్తనడకన ధాన్యం సేకరణ జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోయి రైతుబంధు కేసీఆర్ పరిపాలన కావాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు లేక ధాన్యం కుప్పల మీదనే రైతులు ప్రాణాలు విడుస్తున్న ఘటనలు బాధాకరం అని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో తరుగు, బీ గ్రేడ్ పేరుతో దోపిడీ జరుగుతోందన్నారు. సన్న రకం వడ్లకు బోనస్ ఇస్తానని ప్రకటించి యాసంగి పంటకు బోనస్ లేదనడం చూస్తుంటే ప్రభుత్వ వైఖరి అర్థం అవుతుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్‌చైర్మన్ సిద్దం వేణు, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, సెస్ డైరెక్టర్ మల్లుగారి రవీందర్‌రెడ్డి, నాయకులు చెరుకుపల్లి రాజిరెడ్డి, గొడుగు తిరుపతి, ఉడుతల వెంకటేశం, కముటం రాములు, బొల్లం వెంకటేశం, సావనపెల్లి అనీల్‌కుమార్, సాదుల్, రాగటి రమేష్, గుర్రం తిరుపతిరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, కూనబోయిన రఘు, మీసరగండ్ల అనీల్‌కుమార్, సతీష్‌లతో పాటు పలుగ్రామాల నాయకులు పాల్గొన్నారు.