నేతన్నలకు ప్రభుత్వం అండ
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:17 AM
సిరిసిల్ల అంటే చేనేతకు ప్రతీక, నేతన్నల కష్టానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
సిరిసిల్ల, జూలై 30 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల అంటే చేనేతకు ప్రతీక, నేతన్నల కష్టానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద రూ.3.10కోట్లతో సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగంలోని వివిధ దశల ప్రతిమలను ఏర్పాటు చేసిన రగుడు జంక్షన్‌ను గురువారం మంత్రులు పొన్న ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్,ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం తో కలిసి ప్రారంభించారు. రగుడు జంక్షన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్‌ను ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. త్రిఫ్ట్ ఫండ్ పథకానికి సంబంధించిన ఆర్డీ పాస్‌బుక్‌లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని, సిరిసిల్ల నేతన్నల సంక్షేమం, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. గత రెండేళ్లలోనే చేనేత రంగానికి రూ.1360 కోట్లకు పైగా అందించామని తెలిపారు. నేతన్నలకు ఏడాది పొడవునా పని కల్పించడంతో పాటు భద్రత, బీమా, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. చేనేత ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు ప్రభుత్వం అధిక ధర చెల్లించాల్సి వచ్చినా నాణ్యమైన చీరలనే కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. పండుగలకు దాచుకొని కట్టుకొనేలాగా నాణ్యతగా చీరలు అందించామని అన్నారు. యార్న్ డిపో ఏర్పాటుతో చేనేత సహకార సంఘాలకు మరింత ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. నేతన్నల సమస్యలను ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తే పరిష్క రించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సిరిసిల్ల మోడల్ చీర రావాలి..
సిరిసిల్ల మోడల్ చీర మహిళలకు అందుబాటు ధరలో నాణ్యతగా ఒకటి తయారు చేయాలని, జీ ఐ ట్యాగ్ వచ్చేలా కృషి చేయాలని రవా ణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ సూచించారు. పోచంపల్లి, గద్వాల, సిద్దిపేటలో గొల్లబామ చీరల విధంగా ప్రత్యేత చాటాలని కోరారు. సిరిసిల్లలో నాణ్యమైన ఇందిరా మహిళా శక్తి చీరలు తయారవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నలకు పని కల్పిస్తూ నాణ్యమైన చీరలు మహిళలకు అందిస్తుందని తెలిపారు. సిరిసిల్ల నేతన్నలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నేతన్న.. గీతన్న వేరు కాదని, జిల్లా నేతగా నేతన్నల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చుతోందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు సిరిసిల్ల ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని, నేతన్నల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వస్త్ర పరిశ్రమలో పేరుకుపోయిన బకాయి లను దశలవారీగా విడుదల చేసి నేతన్నల్లో విశ్వాసాన్ని పెంచిందన్నారు. 2024-25 సంవత్సరానికి 6.80 కోట్ల మీటర్ల చీరల బట్ట ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వడం ద్వారా వేలాది మంది నేతన్నలకు 8 నెలలపాటు ఉపాధి కల్పించామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6 కోట్ల మీటర్ల చీరల తయారీకి ఆర్డర్లు అందించామని, ఇప్పటికే దాదాపు కోటి మీటర్ల చీరల ఉత్పత్తి పూర్తి అయిందని తెలిపారు. మరో 3 కోట్లకు పైగా మీటర్ల చీరల ఉత్పత్తికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నేతన్నలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రూ.62 కోట్ల బిల్లులు చెల్లించామని వెల్లడించారు. నేతన్నల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు. 25 హెచ్‌పీ వరకు పవర్‌లూమ్‌లకు రూ.2 విద్యుత్ సబ్సిడీ అమలులోకి తీసుకురావడం ద్వారా పరిశ్రమకు ఊతమి చ్చిందన్నారు. గతంలో ఉన్న సంస్ఠ ఇవ్వ లేదని ఎన్పీడీసీఎల్‌కు అప్పగిం చిన 24 గంటల్లో 25 హెచ్‌పీలు వచ్చిందని గుర్తు చేశారు. రూ 50 కోట్లతో వేములవాడలో యార్న్ బ్యాంక్ ఏర్పాటు చేశామని తెలిపారు. కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు కోసం కూడా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నల వృత్తి గౌరవాన్ని చాటిచెప్పేలా సిరిసిల్ల కలెక్టరేట్ సర్కిల్ వద్ద రూ.3 కోట్లతో వస్త్రం తయారీ దశల విధానాన్ని ప్రతిబింబించే ప్రత్యేక నిర్మాణాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రగుడు బైపాస్ జంక్షన్ సుందరీకరణ పనులు నేతన్న వృత్తి గుర్తుకు వచ్చేలా తీర్చిదిద్దామని తెలిపారు. వారిపై గౌరవం, ప్రేమతో వీటిని ఏర్పాటు చేశా మని పేర్కొన్నారు.
నాణ్యతతో ఇందిరా మహిళా చీరలు..
జిల్లాలో గత ఏడాది ఇందిరా మహిళా శక్తి చీరలు చాలా నాణ్యతతో తయారు చేశారని, వాటిని మహిళలు పండగలు, ఇతర కార్యక్రమాలకు కట్టుకుంటున్నారని కలెక్టర్ గరిమ అగ్రవాల్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మరో సారి కూడా ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు. వేములవాడకు వచ్చే భక్తులు, పర్యాటకులు సేదతీరేలా.. పట్టణ ప్రజలకు ఆహ్లాదం పంచేలా గుడి చెరువు బండ్ పార్క్ పనులను పూర్తి చేసి.. ప్రారంభించామని తెలి పారు. రగుడు జంక్షన్ సుందరీకరణ పనులు, రోడ్డు విస్తరణ, రోడ్డు భద్రత చర్యలు తీసుకున్నామని, వస్త్రం తయారీలో వివిధ దశలను తెలుసుకునేలా విగ్రహాలను ఏర్పాటు అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఎస్పీ మహేష్ బి గితే, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ స్వరూప, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆడెపు చంద్రకళ, పాలిష్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడేపు భాస్కర్, మ్యాక్స్ సొసైటీ అధ్యక్షుడు వేముల దామోదర్, ఆసాముల సంఘం అధ్య క్షుడు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.