సకల సౌకర్యాలతో సర్కారు బడులు
ABN , Publish Date - Oct 23 , 2026 | 12:23 AM
సర్కారు బడుల్లో అందే విద్యకు మరింత వన్నెలద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
(ఆంధ్రజ్యోతి, కరీంనగర్)
సర్కారు బడుల్లో అందే విద్యకు మరింత వన్నెలద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిరుపేదలందరికీ నాణ్యమైన చదువును కార్పొరేట్ తరహాలో అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగానే గత నెలలో జిల్లాలో మూడు చోట్ల వీటి ఏర్పాటుకు అవసరమైన ఉత్తర్వులను అధికారికంగా వెలువరించింది. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో కొంచెం మెరుగైన బోధనను అందిస్తున్న వాటిలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోనే వీటిని వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసే దిశగా కసరత్తు జరుగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో వసతులు, సౌకర్యాల ఏర్పాటుకు సంబంధించి నివేదికను రూపొందిస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్(టీజీపీఎస్)లో ప్రైమరీ నుంచి ఇటర్మీడియట్ వరకు విద్యనందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఫ రూ. 30 కోట్లతో వసతులు
ప్రస్తుతం జిల్లాలో కొత్తపల్లి మండలం చింతకుంట జిల్లాపరిషత హైస్కూల్, గన్నేరువరం మండలం జంగపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చిగురుమామిడి మండల కేంద్రంలోని జడ్పీహెచఎస్ను ఎంపిక చేశారు. వీటికి మొదటి విడతలో ఒక్కో పాఠశాలలో అన్నిరకాల వసతులను కల్పించడానికి 10 కోట్ల చొప్పున మొత్తం 30 కోట్ల రూపాయల నిధులను సెప్టెంబరు 5న సర్కారు మంజూరు చేసింది. మొదట చింతకుంట, జంగపల్లికి 20 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ జీవో వెలువడింది. కొన్నాళ్లకు చిగురుమామిడి పాఠశాలకు నిధులు విడుదల చేస్తూ ప్రత్యేక జీవో విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలానికి ఒక పాఠశాలను ఇలా పబ్లిక్ స్కూల్ తరహాలో ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వీటిని విద్యార్థులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లోనే నిధులను కేటాయించగా.. ఇటీవల జీవోలు వెలువడ్డాయి. కార్పొరేట్ తరహాలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను తిర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే పనులను ప్రారంభించనున్నారు. నిధులు విడుదలవగానే రూపొందించుకున్న అంచనాలు, నమూనాల ప్రకారంగా సర్కారు బడులకు ఆధునిక వసతులను, సొబగులను అద్దనున్నారు. నిధులు రాగానే ఆయా పనులకు సంబంధించి టెండర్లను పూర్తిచేసి వచ్చే జూన మొదటి వారానికల్లా సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఈ బడుల్లో విదార్థులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఈ సంఖ్యను రెండు మూడింతలకు పెంచే విధంగా విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది.
ఫ ప్రయోజనాలు..
ఆయా గ్రామాల నుంచి ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు విద్యార్థులు వస్తున్నారు. ఇందులో పేద, మధ్యతరగతికి చెందిన వారే అధికంగా ఉంటున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్న ఈ విద్యార్థులకు అచ్చంగా ప్రైవేటును మించి ఇక్కడ డిజిటల్ బోధనను అందించబోతున్నారు. పాఠశాలల రూపురేఖలను మొత్తంగా మార్చి కార్పొరేట్ తరహాలో సౌకర్యాలను కల్పిస్తారు. ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే ప్రాంగణంలో తరగతులను నిర్వహించబోతున్నారు. ఇందుకు తగిన విధంగానే ఉపాధ్యాయులు, అధ్యాపకులను నియమించనున్నారు. క్రీడలతోపాటు ఆధునిక సాంకేతికతను అందించే ల్యాబ్లను ఇక్కడ ఏర్పాటు చేస్తారు. సమగ్రమైన విద్యను అందించేందుకు స్మార్ట్ తరగతి గదులను ఏర్పాటు చేసి మండల పరిధిలో ఈబడిలో చదివే విద్యార్థులు నాణ్యమైన బోధనను అందుకునే వెసులుబాటును కల్పిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను విద్యలో సమున్నతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన బోధనను ఇక్కడ అందించబోతున్నారు. ఒక్కో బడిలో మొత్తంగా 1500 మంది విద్యార్థులు ఉండే విధంగా వీటిలో ఏర్పాట్లు చేయనున్నారు.