వస్త్ర పరిశ్రమలకు కోటి చీరల ప్రభుత్వ ఆర్డర్లు
ABN , Publish Date - May 07 , 2026 | 12:41 AM
రాష్ట్రంలోని ఏడు జిల్లాల వస్త్ర పరిశ్రమలకు ప్రజా ప్రభుత్వం కోటి ఇందిరా మహిళా శక్తి నూతన చీరల ఆర్డర్‌ను అందజేసిందని, ప్రభుత్వ ఆర్డర్లను గడువులోగా పూర్తి చేయాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించారు.
సిరిసిల్ల, మే 6 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని ఏడు జిల్లాల వస్త్ర పరిశ్రమలకు ప్రజా ప్రభుత్వం కోటి ఇందిరా మహిళా శక్తి నూతన చీరల ఆర్డర్‌ను అందజేసిందని, ప్రభుత్వ ఆర్డర్లను గడువులోగా పూర్తి చేయాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించారు. బుధవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో మరమగ్గాల వస్త్ర పరిశ్రమకు కోటి చీరల ఆర్డర్లను అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యార్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ నూతన చిలకపచ్చ రంగుల చీరలను ఆవిష్కరించారు. సిరిసిల్లలోని 130 మరమగ్గాల సొసైటీలకు 7 కోట్ల మీటర్లు, కోటి చీరల ఉత్పత్తికి సంబంధించిన ఆర్డర్లు అందించారు. ఇందులో ఇందులో 95 లక్షల చీరలు 6.3 మీటర్ల పొడవు, 5 లక్షల చీరలు 9 మీటర్ల పొడవు గోచి చీరల కోసం ఆర్డర్లు ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి మంది మహిళలకు కోటి చీరలు ఇవ్వాలనేది ప్రజా ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే వస్త్ర పరిశ్రమ సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి ఆర్డర్లు ఎంతో మేలు చేస్తాయన్నారు. గత ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్ పూర్తి చేసిన వస్త్ర పరిశ్రమ బాధ్యులను అభినందించారు. సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 60 లక్షల చీరలు, పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల చీరలు, గోచి చీరలు 5 లక్షలు చీరలు ఆర్డర్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిందని వెల్లడించారు. ఇప్పటికే బకాయి ఉన్న దాదాపు రూ.352 కోట్లు విడుదల చేశారని తెలిపారు. ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ పరిశ్రమను ముందుకు తీసుకెళ్లేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారని స్పష్టం చేశారు. వస్త్ర పరిశ్రమకు ఉపయోగపడేలా వేములవాడలో రూ 50 కోట్లతో సీఎం రేవంత్ రెడ్డి యారన్ బ్యాంక్ ఏర్పాటు చేశారని, 90 శాతం క్రెడిట్ పై యార్న్ ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వస్ర పరిశ్రమను అభివృద్ధిలోకి తీసుకురావాలని అన్ని కార్యక్రమాలను చేపడుతున్నదని, పరిశ్రమలోని బాధ్యులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నేతన్నకు భద్రత కింద రూ 5 లక్షల బీమా ప్రజా ప్రభుత్వం చెల్లిస్తుందని అలాగే చేనేత కార్మికులకు రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు 25 హెచ్‌పీల వరకు రాయితీ, కేటగిరీ మార్పు, ఇతర సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల ఆదేశాల మేరకు ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి ఆధ్వర్యంలో పరిష్కరిస్తున్నామని తెలిపారు.
నాణ్యతగా ఇందిరా మహిళాశక్తి చీరలు
- చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శైలజ రామయ్యార్
వస్త్ర పరిశ్రమలో తయారైన ఇందిరా మహిళాశక్తి చీరలు నాణ్యతతో ఉన్నాయని రానున్న ప్రభుత్వ ఆర్డర్లు కూడా నిబంధనల ప్రకారం నాణ్యతతో తయారుచేయాలని చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యార్ సూచించారు. చీరల నాణ్యతపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వ లక్ష్యం వస్త్ర పరిశ్రమకు ఉపాధి కల్పించడం అలాగే మార్పు తీసుకురావడం ప్రధాన ఉద్దేశం అని స్పష్టం చేశారు. మహిళా శక్తి చీరలను ప్రజా ప్రభుత్వం అందజేసిందని, దీంతో పరిశ్రమకు 6 నుంచి 7 నెలల పాటు ఉపాధి అవకాశం ఉంటుందని వెల్లడించారు. వస్త్ర పరిశ్రమ యజమానులు, ఆసాములు కేవలం ప్రభుత్వ ఆర్డర్లపైనే ఆధారపడకుండా యారన్ బ్యాంక్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ స్థానిక వస్త్ర పరిశ్రమలో తయారైన ఇందిరా మహిళా శక్తి చీరలు పండుగలు, ఇతర కార్యక్రమాల్లో మహిళలు ధరించడం ఎంతో ఆనందంగా ఉందని గుర్తు చేశారు. మహిళల ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా చీరలు నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు స్వరూప, రాములు నాయక్, చేనేత జౌళి శాఖ జేడీ వెంకటేశ్వరరావు, ఏడీ సంతోష్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన వస్త్ర పరిశ్రమ యజమానులు, ఆసాములు తదితరులు పాల్గొన్నారు.