Share News

ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ వైద్యం

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:35 AM

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అసుపత్రిలో ప్రైవేట్‌కు దీటుగా వైద్య సేవలు అందుతున్నాయి. ప్రస్తుతం మెరుగైన వైద్య సేవలతో ప్రభుత్వ దవాఖానాల వైపు రోగులు మొగ్గు చూపుతున్నారు.

ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ వైద్యం
పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి

పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి అవార్డులు

పెరుగుతున్న ఓపీ

రూ. 53 కోట్లతో వంద పడకల అసుపత్రిగా విస్తరణ

పెద్దపల్లి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అసుపత్రిలో ప్రైవేట్‌కు దీటుగా వైద్య సేవలు అందుతున్నాయి. ప్రస్తుతం మెరుగైన వైద్య సేవలతో ప్రభుత్వ దవాఖానాల వైపు రోగులు మొగ్గు చూపుతున్నారు. నిపుణులైన వైద్యులు, ఆధునిక వైద్య పరికరాలు, ఉచిత మందులు, శస్త్రచికిత్సలు, ప్రసూతి సేవలు, నవజాత శిశువుల సంరక్షణ వంటి సదుపాయాలు ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచు తున్నాయి. పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి పరిశుభ్రత, వైద్య సేవల నిర్వహ ణలో అవార్డులు లభించాయి.

ఫ పెరిగిన ఓపీ.. పలు శస్త్రచికిత్సలు

ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు విస్తరించడంతో రోగుల సంఖ్య పెరుగుతోంది. గతంలో రోజుకు సుమారు 200 మంది మాత్రమే ఓపీ సేవలు పొందేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య 1200 నుంచి 1500 వరకు చేరుతోంది. ప్రసవాల కోసం గర్భిణులు ప్రభుత్వాసుపత్రిని ఆశ్రయిస్తు న్నారు. వైద్యుల పర్యవేక్షణ, ఉచిత పరీక్షలు, మందులు, ప్రసవానంతర సంరక్షణ అందుబాటులో ఉండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిస్తోంది. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు గర్భిణులను గుర్తించి అవసరమైన వైద్య సేవలు అందేలా పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో 102, 108 అంబులెన్సు సేవలు ఉపయోగపడుతున్నాయి.

ఫ అందుబాటులో అధునాతన చికిత్సలు

పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో సాధారణ వైద్య సేవలతోపాటు ఆర్థోపెడిక్‌, నేత్ర, దంత వైద్యం, ఈఎన్‌టీ, చర్మవ్యాధులు, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలకు చికిత్స అందుతోంది. అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులోకి రావడంతో పరీక్షలు, శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను సైతం జిల్లా ప్రభుత్వాసుపత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. గతంలో కరీంనగర్‌, హైదరాబాద్‌ వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు జిల్లాలోనే అందుబాటులోకి రావడం రోగులకు ప్రయాణ ఖర్చులు, ప్రైవేటు వైద్య వ్యయాల భారాన్ని తగ్గించే అవకాశాన్ని కల్పిస్తోంది.

ఫ నవజాత శిశువులకు ప్రత్యేక సంరక్షణ

ప్రసవాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పుట్టిన శిశువులకు అవసరమైన ప్రత్యేక వైద్య సంరక్షణ అందించడం కీలకంగా మారింది. ఇందుకోసం ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం (ఎస్‌ఎన్‌సీయూ) ఏర్పాటు చేశారు. తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు, అదనపు పర్యవేక్షణ అవసరమైన శిశువులకు చికిత్స లభిస్తోంది.

ఫ రూ.53 కోట్లతో వంద పడకల ఆసుపత్రి

ఆసుపత్రి మౌలిక సదుపాయాలను మరింత విస్తరించేందుకు రూ.53 కోట్లతో వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయనున్నారు. పెరుగుతున్న ఓపీ సేవలు, ప్రసవాలు, శస్త్రచికిత్సలు, ఇన్‌పేషెంట్‌ చికిత్సలకు అనుగు ణంగా అదనపు పడకలు, వైద్య సదుపాయాలు అవసరమవుతున్నాయి. విస్తరణ పూర్తయితే రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

ఫ ప్రభుత్వ ఆసుపత్రికి అవార్డుల పంట!

రాష్ట్రస్థాయిలో నాలుగు అవార్డులతోపాటు కాయకల్ప పథకంలో ఆసుపత్రి గుర్తింపు పొందింది. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన వివిధ విభాగాలలో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి నాలుగు అవార్డులు లభించాయి. సూపరింటెండెంట్‌ కేటగిరీలో డాక్టర్‌ శ్రీధర్‌, రేడియాలజీ విభాగంలో డాక్టర్‌ సంధ్యారాణి గుర్తింపు పొందారు. ఆరోగ్యశ్రీ సేవలు, ఆసుపత్రి ప్రయోగశాల పనితీరులోనూ రాష్ట్రస్థాయి అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

ఫ కాయకల్పలో ప్రథమ స్థానం

ఆసుపత్రిలో పరిశుభ్రత, ఇన్ఫెక్షన్‌ నియంత్రణ, బయోమెడికల్‌ వ్యర్థాల నిర్వహణ, రోగుల రికార్డుల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై నిర్వహించిన మూల్యాంకనంలో కాయకల్ప పథకం కింద గుర్తింపు లభించింది. జిల్లా ఆసుపత్రుల విభాగంలో పెద్దపల్లి, గజ్వేల్‌ ఆసుపత్రులకు సంయుక్తంగా ప్రథమ స్థానం లభించగా, రూ.50 లక్షల పైజ్ర్‌మనీని రెండు అసుపత్రులకు రూ 25 లక్షల చొప్పున లభించింది. పర్యావరణహిత ఆసుపత్రి కేటగిరీలో మరో గుర్తింపు లభించడంతో రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులు అందాయి. దీంతో కాయకల్పకు సంబంధించిన ఈ రెండు విభాగాల్లో కలిపి పెద్దపల్లి ఆసుపత్రికి రూ. 35 లక్షల ప్రోత్సాహక నిధులు లభించాయి.

ఫ అందుబాటులో ల్యాబ్‌ పరీక్షలు

ఆసుపత్రి ప్రయోగశాలలో నెలకు సుమారు 50 వేల పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోగులకు రక్తపరీక్షలతోపాటు ఎక్స్‌రే, ఈసీజీ, టుడీ ఎకో వంటి పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. కార్డియాలజీ సేవల్లో భాగంగా టుడీ ఎకో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫిజియోథెరపీ విభాగం ద్వారా నెలకు సుమారు 200 మంది రోగులకు సేవలు అందిస్తున్నారు.

ఫదంత, ప్లాస్టిక్‌ సర్జరీ సేవలు

దంత వైద్య విభాగంలో రూట్‌ కెనాల్‌ చికిత్సలు, క్యాప్స్‌ అమరిక సేవలు అందిస్తున్నారు. ప్లాస్టిక్‌ సర్జరీలు, ఇతర ప్రత్యేక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. డయాలసిస్‌ సేవలతోపాటు రోగులకు అవసరమైన ఇతర చికిత్సలను కూడా అందిస్తున్నారు.

Updated Date - Oct 24 , 2026 | 12:35 AM