Share News

సన్నాలను సాగు చేస్తే ప్రభుత్వ బోనస్‌

ABN , Publish Date - Jun 24 , 2026 | 12:09 AM

అన్నదాతలు సన్నాలను సాగు చేసి సర్కారు అందిస్తున్న బోనస్‌ను పొందాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు.

సన్నాలను సాగు చేస్తే ప్రభుత్వ బోనస్‌

వీర్నపల్లి(ఎల్లారెడ్డిపేట), జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): అన్నదాతలు సన్నాలను సాగు చేసి సర్కారు అందిస్తున్న బోనస్‌ను పొందాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమానికి మంగళవారం ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడు తూ రైతులు సహజ వ్యవసాయ పద్ధతులను పాటించాలన్నారు. ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్న ఏడు రకాల మేలురకం సన్న వరి విత్తనాలను సాగు చేయాలన్నారు. మార్కెటులో దొడ్డు రకం వరి ధాన్యానికి డిమాం డ్‌ తగ్గిన నేపథ్యంలో సన్నాల సాగుకు మొగ్గు చూపాలని అన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల స్వల్పకాలిక పంటలను సాగు చేయాలన్నారు. ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్‌పామ్‌ సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని అన్నారు. రాయితీపై ప్రభుత్వం మొక్కలు, బిం దు సేద్యం పరికరాలు అందిస్తోందన్నారు. రైతు లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు అనుమతి ఉన్న దుకాణాల్లో విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసి రసీదు పత్రాలను పొందాలని పేర్కొన్నారు. రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. అంతకు ముందు రైతు వేదిక ఆవరణలో మొక్కను నాటారు.

విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

ప్రతి విద్యార్థినీపై ప్రత్యేక శ్రద్ధ వహించడం తో పాటు రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. వీర్నపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది హాజ రుపట్టిక, పాఠశాల పరిసరాలు, వంటకు వినియోగించే సామగ్రిని పరిశీలించారు. ఆహార పదార్థాల నిల్వపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. వంట సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం విద్యార్థినులకు భోజనం అందించాలని సూచించారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఏమైనా సమస్యలున్నాయా..? అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. నిత్యం వివిధ అంశాలపై సాధన చేయాలని అన్నారు. పట్టుదలతో ముందుకు సాగి అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ జ్యోత్స్న, ఏఎంసీ చైర్మన్‌ రాములునాయక్‌, డీఏవో అఫ్జల్‌బేగం, ఉద్యానవన శాఖ అధికారి శరత్‌బాబు, మండల ప్రత్యే క అధికారి క్రాంతి, తహసీల్దార్‌ నారాయణరెడ్డి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2026 | 12:09 AM